శారీతో సందేశం | 11 year old Sree inspiring for people to covid 19 vaccination | Sakshi
Sakshi News home page

శారీతో సందేశం

Published Sat, Jun 19 2021 4:58 AM | Last Updated on Sat, Jun 19 2021 4:58 AM

11 year old Sree inspiring for people to covid 19 vaccination - Sakshi

వ్యాక్సినేషన్‌ పట్ల గ్రామ ప్రజల అవగాహన కోసం శ్రీ చేస్తున్న ప్రయత్నం

మంచి కోసం చేసే పని ఏదైనా ఓ అడుగు కాదు వేయి అడుగుల ముందుండాలి అనుకున్నట్టుగా ఉంది ఈ చిన్నారి. కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి ఉడత సాయంగా కాళ్లకు చక్రాలు కట్టుకొని మరీ వాడ వాడలా ‘టీకా వేయించుకోండమ్మా, టీకా వేయించుకోండయ్యా!’’ అంటూ ఊరంతా చక్కర్లు కొడుతోంది. పవర్‌ గర్ల్‌గా ప్రశంసలు అందుకుంటోంది.

కోవిడ్‌ టీకా పట్ల మారుమూల గ్రామీణ ప్రాంత ప్రజల్లో ఇంకా అవగాన లోపం ఉందనడానికి ఎన్నో ఉదాహరణలు మనం వింటున్నాం, చూస్తున్నాం. ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటూ, అవగాహనవైపు వారి మెదళ్లను కదిలించే దిశగా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, అందుకు పెద్ద పెద్ద పనులే చేయనక్కర్లేదని నిరూపిస్తోంది ఉత్తరప్రదేశ్‌ సీతాపూర్‌ జిల్లా రామ్‌కోట్‌ గ్రామంలో ఉంటున్న 11 ఏళ్ల శ్రీ గుప్తా.

చిన్నవయసు... పెద్ద ఆలోచన
శారీ ఛాలెంజ్‌ అనే ప్రక్రియ మొన్నామధ్య సామాజిక మాధ్యమాల్లో విరివిగా తిరిగింది. కానీ, శారీతో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ఛాలెంజింగ్‌గా ముందుకు తీసుకెళ్లాలని కాళ్లకు స్కేటింగ్‌ షూస్‌ కట్టుకొని మరీ చెబుతుంది శ్రీ. మొన్నీమధ్య శ్రీ గుప్తా తన తాత, మామలతో కలిసి వ్యాక్సినేషన్‌ సెంటర్‌కి వెళ్లింది. ‘చిన్నపిల్లవు.. నువ్వెందుకులే..’ అంటే ‘దూరంగా ఉండి చూస్తా’ అని మారాం చేసింది. సరే, అని కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఆ ముగ్గురూ తమ ఊళ్లోని వ్యాక్సినేషన్‌ సెంటర్‌కి వెళ్లారు. ఎంతసేపు ఎదురు చూసినా అక్కడి నిర్వాహకులు వ్యాక్సిన్‌ ఇవ్వకపోవడంతో విసుగనిపించింది శ్రీ కి.

తన తాత, మామ అక్కడే ఉన్నా తను మాత్రం ఓ అడుగు ముందుకు వేసి ‘ఎవరూ లేరుగా, వ్యాక్సిన్‌ వేయడానికి ఎందుకు ఇంత లేట్‌ చేస్తున్నార’ని అక్కడివారిని ప్రశ్నించింది. ‘పది మంది ఉంటేనే వ్యాక్సిన్‌ ఇస్తాం. ఇద్దరికి మాత్రమే ఇవ్వాలంటే వ్యాక్సిన్‌ డోస్‌ వేస్ట్‌ అవుతుంద’ని నిర్వాహకులు చెప్పారు. దాంతో మరికొంత సేపు ఎదురు చూశారు. వ్యాక్సిన్‌ వేయించుకోవడానికి మాత్రం ఆ ఊళ్లో ఎవరూ ముందుకు రాలేదు. ‘టీకా వేయించుకోవడానికి ఊరి వాళ్లు ఎందుకు రావట్లేద’ని తాతను, మామను అడిగింది. ‘అవగాహన లేకపోవడం వల్ల’ అనే సమాధానం వారి నుంచి వచ్చింది.

చీరకట్టు... ఆపైన చక్రాలు కట్టు
ఎలాగైనా చాలామందిని ఈ వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో భాగస్తులను చేయాలనుకుంది శ్రీ. కొందరికి వెళ్లి నేరుగా చెప్పింది. కానీ, చిన్న పిల్ల మాటలు ఎవరు పట్టించుకుంటారు. ఇలా అయితే, ఊరంతా తిరగడం కష్టం అనుకుని ఇంటికి వెళ్లి తన కాళ్లకు స్కేటింగ్‌ షూ కట్టుకుంది. గిరా గిరా తిరుగుతూ చుట్టుపక్కల వారికి చెప్పింది. కానీ, ఎవరూ పట్టించుకోలేదు.

జనాలను ఆకర్షించాలంటే ఏదో ఒక పని చేయాలి. ఎలా అని ఆలోచించిన బుర్రకు చీరకట్టు గుర్తుకు వచ్చింది. తన తల్లిని అడిగి చీర కట్టించుకొని, వాడ వాడలా స్కేటింగ్‌ చేస్తూ తిరుగుతూ, ‘టీకా వేయించుకో తాతా, టీకా వేయించుకో బామ్మా.. టీకా వేయించుకోండమ్మా... టీకా వేయించుకోండయ్యా..’ అంటూ ఊరి జనాలకు ఉద్బోధిస్తోంది. వారిని వ్యాక్సినేషన్‌ సెంటర్‌వైపు కదిలేలా చేస్తుంది.
కోవిడ్‌ టీకా గురించి ఊరి ప్రజల్లో అవగాహన కోసం చేసిన ఈ వినూత్న పద్ధతికి ముచ్చటపడిన వారు ఇప్పుడంతా శ్రీ ని ‘గర్ల్‌ పవర్‌’గా ప్రశంసిస్తున్నారు.
 
ఉమన్‌ పవర్‌
ఫిట్నెస్‌ ఫ్రీక్‌ 37 ఏళ్ల శార్వరి పుణెలో ఆయుర్వేద వైద్యురాలు. మహిళలు ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలని కోరుకునే ఆధునిక మహిళ. శార్వరి రోజూ జిమ్‌లో వెయిట్‌ ట్రైనింగ్, పుషప్స్‌ వంటి వర్కౌట్స్‌ చేస్తోంది. తన దగ్గరకు ఆరోగ్య సలహాల కోసం వచ్చే మహిళలకు వ్యాయామం గురించి ఎంత చెప్పినా, ఎవరూ పట్టించుకుంటున్నట్టు కనిపించలేదు. సంప్రదాయ భావాలు గల వారు జిమ్‌ డ్రెస్‌ వేసుకొని వర్కౌట్స్‌ చేయమంటే వినిపించుకోరు. అదేదో మన పని కాదులే అని పక్కన పెట్టేస్తారు. ఈ భావన వల్ల వారు తమ ఫిట్‌నెస్‌ను కోల్పోతున్నారు. అంతేకాదు, సంప్రదాయ ఆహార పద్ధతుల్లోనే ఉండిపోయి మంచి పోషకాహారాన్ని తీసుకోలేకపోతున్నారని గుర్తించిన శార్వరి ఓ వినూత్న ప్రయత్నం చేసింది.
 
చీరకట్టుతో వర్కౌట్స్‌
జిమ్‌లో చీర కట్టుతోనే వర్కౌట్స్‌ చేస్తూ, ‘ఏ పనికైనా చీరకట్టు అడ్డంకి కాదు. ముఖ్యంగా పిట్‌నెస్‌కు’ అంటూ తన వ్యాయామ పద్ధతులతో కూడిన వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ మహిళలకు ఫిట్‌నెస్‌ పట్ల అవగాహన కల్పిస్తోంది. ఆరోగ్యంగా ఉండాలంటే శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవాలి. అందుకు ఫిట్‌నెస్‌ అనేది మన దినచర్యలో భాగం కావాలి. ఇందుకు చీరకట్టు ఏ మాత్రం అడ్డంకి కాదని తన వర్కౌట్స్‌ ద్వారా చూపుతోంది.

శారీకట్టులో జిమ్‌లో వర్కౌట్స్‌చేస్తున్న శార్వరి
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement