ఆమె ఆగ్రా ఏసిపి అర్ధరాత్రి 12 తర్వాత రైల్వేస్టేషన్ దగ్గర నిలబడి హెల్ప్‌లైన్‌కు కాల్ చేసింది ‘ఒంటరి ప్రయాణికురాలిని.. హెల్ప్ చేస్తారా?’ అని పోలీసులు ఎలా స్పందించారు? మహిళల రక్షణ విషయంలో పోలీసు అధికారుల ఇలాంటి ప్రయత్నాలు ఎలాంటి హెచ్చరికలు పంపుతాయి?
రెండు మూడు రోజుల క్రితం. ఆగ్రాలోని రైల్వేస్టేషన్ దగ్గర ఒక మహిళ నిలుచుని ఉంది. తెల్ల షర్టు, బ్లాక్ జీన్స్ ధరించి ఉంది. చేతిలో చిన్న బ్యాగ్ ఉంది. అప్పటికి రాత్రి ఒంటి గంట. ఉత్తర ప్రదేశ్ హెల్ప్‌లైన్ 112కు కాల్ చేసింది. ‘నేను ఒంటరి ప్రయాణికురాలిని. ట్రైన్ మిస్ అయ్యాను. నాకు సాయం చేయగలరా?’ అని అడిగింది.
అవతలి వైపు పోలీసుల స్పందన ఎలా ఉంటుందో చూసింది. ఆ పోలీసులు వెంటనే స్పందించారు. ‘మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండండి లేదా ఏదైనా జనం ఉండే చోట ఉండండి. మా వాళ్లు మీ కాంటాక్ట్‌లోకి వస్తారు’ అని చెప్పారు. మరికొన్ని క్షణాల్లోనే మరో ఫోన్. ‘మేం బయలుదేరాం. మీ లైవ్ లొకేషన్ పెట్టండి’ అని. ‘భేష్. మీరు రానక్కర్లేదు. నేను ఆగ్రా ఏసీపీ సుకన్య శర్మను’ అని ఫోన్ పెట్టేసింది.
ఆ తర్వాత ఆటోను పిలిచింది. ఎక్కడకు వెళ్లాలో చెప్పి ఆటో ఎక్కింది. ‘డ్రైవర్ భయ్యా... ఒంటరి మహిళలు ఈ టైమ్‌లో ఆటో ఎక్కడం సేఫేనా’ అని అడిగింది. ఆటోడ్రైవర్ ‘ఏం పర్లేదమ్మా. పోలీసులు ఆటోడ్రైవర్‌ల అన్ని వివరాలు తీసుకుంటున్నారు. ఖాకీ షర్ట్ లేకుండా డ్రైవింగ్ చేయవద్దంటున్నారు. మీకేం ఇబ్బంది లేదు’ అని ఆమె కోరిన చోట దించాడు.
అప్పుడు ఆమె తనెవరో చెప్పి ‘స్త్రీలు మెచ్చే విధంగా ఉన్నావు. ఇలాగే అందరూ వ్యవహరించాలి’ అని అభినందించింది. పూర్వం ఎలా పాలన జరిగేదో చూడటానికి రాజులు మారు వేషాలు వేసేవారు. ఇలా అధికారులు కూడా సామాన్యుల్లా వ్యవహరించి తిరిగితే లోపాలు తెలిసి సమస్యలు దృష్టికి వచ్చి స్త్రీలకు మరింత రక్షణ ఏర్పాట్లు చేయవచ్చు. భేష్ సుకన్య మేడమ్.
(చదవండి: పెప్పికో మాజీ సీఈవో ఇంద్రా నూయి పేరెంటింగ్ టిప్స్)
Comments
Please login to add a commentAdd a comment