పెద్దపెద్ద ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులేవీ చేయలేదు, కానీ పాపులర్ సెలబ్రెటీలు.. సోనమ్ కపూర్, కరీనాకపూర్ ఖాన్, దీపికా పదుకొనే, కత్రినా కైఫ్, కియరా అద్వానీలను మరింత అందంగా కనిపించే డ్రెస్‌లను రూపొందించింది అనామిక ఖన్నా. జీవితంలో ఎదగాలన్న తపన, వినూత్నమైన ఆలోచనలు, కృషి, పట్టుదలతో శ్రమించే గుణం ఉండాలేగాని డిగ్రీలు చదవకపోయినప్పటికీ అత్యున్నత స్థాయికి ఎదగవచ్చని నిరూపించింది అనామిక.
Anamika Khanna: Celebrity Designer Inspiring Story Facts In Telugu: ఇండియాలోనే పాపులర్ ఫ్యాషన్ డిజైనర్‌గా ఎదిగి, విభిన్న డిజైన్లతో జాతీయ, అంతర్జాతీయ అవార్డులను అందుకోవడమేగాక సరికొత్త డిజైన్లను ఎప్పటికప్పుడు తన ఇన్‌స్ట్రాగామ్ అకౌంట్‌లో పోస్టుచేస్తూ.. లక్షలమందికి ఆదర్శంగా నిలుస్తోంది అనామిక. అప్పటి కలకత్తాలోని ఓ గ్రామంలో పుట్టింది అనామిక. నానమ్మ కుట్టే బట్టలను చూస్తూ పెరిగిన అనామిక.. పెద్దయ్యాక క్లాసికల్ డ్యాన్స్ చేర్చుకుని మంచి డ్యాన్సర్ అయ్యింది.
అలా మొదలైంది..
డ్యాన్స్‌తోపాటు అనామికకు పెయింటింగ్స్ వేయడం అంటే ఎంతో ఇష్టం. ఎప్పుడూ వివిధ రకాల స్కెచ్‌లను గీస్తుండేది. ఈ క్రమంలోనే ఆఫ్రికన్ టెక్స్‌టైల్స్ బుక్ చూసిన అనామికను..దానిలో ఫ్యాషన్ స్టైల్స్ ఎంతగానో ఆకర్షించాయి. దీంతో తను కూడా ఫ్యాషన్ డిజైనర్ కావాలనుకుంది. ఫ్యాషన్ డిగ్రీ చదవని అనామిక ఫ్యాషన్ డిజైనింగ్ గురించి తెలుసుకునేందుకు వర్క్‌షాపులు, ఫ్యాషన్ షోలకు క్రమం తప్పకుండా వెళ్లేది.
అక్కడ చూసిన డిజైన్లకు తన సృజనాత్మకతతో సరికొత్త స్కెచ్‌లు గీసేది. ఇలా గీసిన స్కెచ్‌లను దమానియా ఫ్యాషన్ షోకు పంపింది. ఆ డిజైన్‌లు నచ్చడంతో దమానియా ఫ్యాషన్ వాళ్లు ఆరు డిజైనర్ పీస్‌లు పంపించమన్నారు. అప్పుడు మార్కెట్లో బట్టను కొని టైలర్ దగ్గరకు వెళ్లి కావాల్సిన విధంగా కుట్టించి వారికి పంపడంతో అనామిక డిజైన్స్ అవార్డుకు ఎంపికయ్యాయి. దీంతో అనామికకు డిజైనర్‌గా తొలిగుర్తింపు లభించింది.
దమానియా కోసం డిజైన్ చేసిన వస్త్రాలను బెంగళూరుకు చెందిన ఫ్యాషన్ డిజైనర్ యశోధరా షరాఫ్ చూసింది. అవి ఆమెకు నచ్చడంతో తన ఫోలియో బ్రాండ్ వాటిని విక్రయించడమేగాక, 2003లో పాకిస్థాన్‌లో జరిగిన బ్రైడల్ ఏషియా ఎగ్జిబిషన్‌లో పాల్గొనడానికి ఆహ్వానించింది. ఇలా యశోధరా షరాఫ్, ప్రసాద్ బిడప, రీతు కుమార్, మోనపలి వంటి ఫ్యాషన్ డిజైనర్‌ల గైడెన్స్ తీసుకుని ఫ్యాషన్ డిజైనర్‌గా ఎదిగింది.
అంతర్జాతీయంగా అనా–మిక..
‘అనా–మిక’ పేరుతో 2004లో ప్రారంభించిన బ్రాండ్, అంతర్జాతీయంగా బాగా పేరొందిన ఇండియన్ బ్రాండ్స్‌లో ఒకటి. ల్యాక్మె ఇండియా ఫ్యాషన్ వీక్‌లో పాల్గొనేందుకు 33 మంది డిజైనర్‌లను పిలవగా అందులో అనామిక ఒకరు. 2007లో జరిగిన పారిస్ ఫ్యాషన్ వీక్‌కు హాజరైన తొలి ఇండియన్ ఉమెన్ డిజైనర్ అనామిక. ఆ తరువాత 2010లో లండన్ ఫ్యాషన్ వీక్‌లో పాల్గొన్నారు.
ఇక్కడ అనా–మిక డిజైన్లు నచ్చడంతో అతిపెద్ద బ్రిటిష్ రీటైల్ దిగ్గజ కంపెనీ హరాడ్స్ కాంట్రాక్ట్‌ను ఆఫర్ చేసింది. అంతేగాక బిజినెస్ ఆఫ్ ఫ్యాషన్–500 జాబితాలో అనామిక ఒకరు. 2015లో ప్రముఖ నటి టాక్ షో అతిథి ఐమీ గరేవాల్ లేడీ గగాకు పదికేజీల వెల్వెట్ లెహంగాను బహుమతిగా ఇచ్చారు. ఈ లెహంగా డిజైనర్ అనామికే. 2017లో ఎలిజిబెత్ –2 యూకే ఇండియా ఇయర్ ఆఫ్ కల్చర్‌కు అనామిక ప్రత్యేక ఆహ్వానితురాలు.
ఏకే– ఓకే
వర్క్‌షాపులు, లండన్‌లోని విక్టోరియా అండ్ ఆల్‌బర్ట్ మ్యూజియం, పారిస్‌లోని ఫ్యాషన్ ఇన్‌స్టిట్యూట్స్‌కు వెళ్లినప్పుడు అక్కడ డిజైనింగ్స్ టిప్స్‌తోపాటు, సన్నగా కనిపించేలా బట్టను ఎలా కట్ చేయాలి? ప్యాట్రన్ ఎలా తీసుకురావాలి వంటి అనేక విషయాలను అనామిక జాగ్రత్తగా పరిశీలించి పూర్తిస్థాయి ఫ్యాషన్ డిజైనర్ అయ్యింది. దీంతో తన అనామిక డిజైన్స్ పేరుతో సొంత బ్రాండ్, కోల్‌కతాలో తన డిజైనర్ స్టోర్‌ను ఏర్పాటు చేసింది.
తన పిల్లలు విరాజ్ ఖన్నా, విశేష్ ఖన్నాలతో కలిసి రెడీ టు వేర్ స్ప్రింగ్, సమ్మర్ థీమ్‌తో ‘ఏకే–ఓకే’ పేరుతో ఏర్పాటు చేసింది. కొన్ని బాలీవుడ్ సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసింది. ఇవేగాక ‘టైమ్‌లెస్ ద వరల్డ్’ పేరిట ఈ ఏడాది మార్చిలో తన లేటెస్ట్ డిజైన్లను విడుదల చేశారు. కేవలం పదివేల రూపాయలతో ప్రారంభించిన అనామిక ఎథినిక్ బ్రైడల్ వేర్, కాంటెంపరరీ, వెస్ట్రన్ డిజైన్స్‌ను రూపొందిస్తూ, లక్షలమంది ఫాలోవర్స్‌ను ఆకట్టుకుంటున్నారు.
చదవండి: Toy Bank: మీ పిల్లలు ఆడేసిన బొమ్మలను ఏం చేస్తున్నారు?
Comments
Please login to add a commentAdd a comment