గాలిలో కానరాని గడుసు దెయ్యాలు... అడుగు తీసి అడుగు వేయాలంటే టెన్షన్! హాలో బాగున్నారా? అని ఆత్మీయంగా పలకరించడానికి దగ్గరికి వెళదామంటే ఏ వైపు నుంచి ఏ చెడు నీడ పడుతుందో అని టెన్షన్! ఇప్పుడు టెన్షన్ స్టేషన్‌లో బతుకు బండి భయంగా ఆగింది. ఆ బండి కాస్త ముందుకు కదలాలంటే మనకు తప్పనిసరిగా కావాలి... నవ్వుల ఆక్సిజన్!!
స్టాండ్ అప్ కమెడియన్‌లుగా రాణిస్తున్న కొందరు మహిళలు తమ దగ్గర ఉన్న నవ్వుల మంత్రదండంతో టెన్షన్‌ను‘హాంఫట్’ అని మాయం చేసి ‘హ్హాహ్హా’ అని నవ్విస్తూ మనసు తేలిక పరుస్తున్నారు.
‘అనురాధ మెనన్ ఎవరండీ?’ అని అడిగితే చెప్పేవాళ్లు లేకపోవచ్చుగానీ
‘మిస్ లోలా కుట్టీ ఎవరు?’ అంటే జవాబు చెప్పడం చాలామందికి వీజీ.
సాధారణంగా వీజేలు పోష్ పోష్ ఇంగ్లిష్ మాట్లాడేస్తుంటారు. లోలా కుట్టి మాత్రం మలయాళీ యాక్సెంట్‌తో ఇంగ్లిష్ గడగడా మాట్లాడుతూ ప్రేక్షకులను గలగలమని నవ్విస్తుంటుంది. నూనె రుద్దిన జుట్టు, జడలో పూలు, గాజులు, సోడా బుడ్డి కళ్లద్దాలతో ఆమె ఆహార్యమే నువ్వు తెప్పిస్తుంది. ‘చానల్ వి.లోలా’లో లోలా కుట్టి నవ్వుల తోటమాలి.
‘కామెడీ అనేది చాలా సీరియస్ విషయం’ అని బల్ల బాదీ మరీ చెబుతున్న జియా సేథి స్టాండప్– స్టార్ కమెడీయన్‌గా ‘రాణి’స్తోంది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో కామెడీ స్టేజీ షోలు చేసిన జియా సేథి ఇప్పుడు జూమ్ వేదికగా నవ్వులు పండిస్తుంది. అంతేకాదు స్టాండప్–కామెడీ కోర్సు ప్రారంభించి ఎంతోమందిని కమెడియన్లుగా తీర్చిదిద్దుతుంది. చాలామందికి ‘నవ్వించడం’ అనేది హాబీ నుంచి ఉపాధి స్థాయికి వెళ్లడం విశేషం.
ఇంతకీ స్టాండప్–కామెడీ కోర్స్‌లో ఏముంటాయి? జోక్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి? ఎలాంటి విషయాలు నవ్వు తెప్పిస్తాయి? సందర్భాన్ని బట్టి అప్పటికప్పుడు హాస్యం ఎలా సృష్టించాలి? పంచ్‌లైన్‌లను ఎలా రాసుకోవాలి? కామెడీ నాలెజ్డ్ అంటే ఏమిటి? చిన్న చిన్న జోక్స్‌ను ఆకట్టుకునే స్కిట్‌లా ఎలా మలుచుకోవచ్చు... మొదలైనవి కామెడి కోర్సులో పాఠాలుగా ఉంటాయి.
రంగస్థల నటిగా పేరున్న కోమల్ భాటియా ‘ఆల్–ఉమెన్ స్టాండప్ కామెడీ నైట్స్’ పేరుతో ఢిల్లీ లో చేసిన షోకు అనూహ్యమైన ఆదరణ లభించడంతో దేశంలోని వేరే నగరాల్లో కూడా ఇలాంటి షోలు చేశారు.
అహ్మదాబాద్‌కు చెందిన ప్రీతీ దేశాయ్ కేవలం ‘నవ్వు కోసమే నవ్వు’ అన్నట్లు కాకుండా కాస్తో కూస్తో సామాజిక స్పృహను ఆ నవ్వులకు జోడిస్తుంది.
‘కొందరు పురుష కమెడియన్లు ప్రేక్షకులను నవ్వించడానికి గర్ల్‌ఫ్రెండ్‌పైన, భార్యలపైనా వెకిలి హాస్యం సృష్టిస్తుంటారు. ఇది ఆరోగ్యకరమైన హాస్యధోరణి కాదు’ అంటున్న ప్రీతి నొచ్చుకునే హాస్యానికి కాకుండా అందరూ మెచ్చుకునే హాస్యానికే ప్రాధాన్యత ఇస్తోంది.
ఇక నీతి పల్టా దగ్గరికి వద్దాం.
‘మనకు ఉండాల్సింది అతి విశ్వాసం కాదు ఆత్మవిశ్వాసం’ అంటున్న ఢిల్లీకి చెందిన నీతి పల్టా అరంగేట్రంలాంటి తొలి షో అట్టర్ ఫ్లాప్ అయింది. ఆ షో లో ఆమె ఏవో జోక్స్ చెబుతూనే ఉంది, నవ్వించే ప్రయత్నం చేస్తూనే ఉంది. కానీ ప్రేక్షక మహానుభావుల ఫేసుల్లో ఎలాంటి నవ్వూ మొలకెత్తలేదు. ఏదో ట్రాజెడీ సినిమాకు వచ్చినట్లుగా పెట్టారు ఫేస్.
‘ఇదేదో మనకు అచ్చిరాని వ్యవహారం’ అని దిగులుపడలేదు నీతి. ఇంటికి వెళ్లిన తరువాత తన కామెడీ షోను తానే సమీక్షించుకుంది. ‘నవ్వించడం అంటే మనం నవ్వడం కాదు... ప్రేక్షకులను నవ్వించడం’ అనే విషయాన్ని చాలా గట్టిగా నేర్చుకుంది. ఆ తరువాత చాలా ప్రాక్టీస్ చేసి గానీ స్టేజ్ ఎక్కలేదు. షో సూపర్ డూపర్ హిట్ అయింది.
‘ప్రేక్షకులకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేదు. నేను బాగానే పెర్‌ఫార్మ్ చేశాను’ అని ఆ రోజు ఆమె అనుకొని తనకు తానే సర్టిఫికెట్ ఇచ్చుకొని ఉంటే అక్కడే ఆగిపోయి ఉండేది. తన లోపాల నుంచి గుణ‘పాఠాలు’ నేర్చుకోవడం వల్లే నీతి పల్టా స్టార్–స్టాండప్ కమెడియన్‌గా మంచి పేరు తెచ్చుకుంటోంది.
‘నవ్వు’ అనే ఆరోగ్యకరమైన ఆక్సిజన్ కొరత తీర్చడానికి లోలా కుట్టీ నుంచి నీతి పల్టా వరకు ఎంతోమంది ఫిమేల్ స్టాండప్ కమెడియన్స్ రంగంలో ఉన్నారు. వారికి వందనాలు తెలియజేద్దాం.
Comments
Please login to add a commentAdd a comment