కరోనా వ్యాక్సిన్‌.. వేధించే సందేహాలు.. సమాధానాలు  | Bharat Biotech Faces Difficult Questions About Its Vaccine | Sakshi
Sakshi News home page

కరోనా వ్యాక్సిన్.. వేధించే సందేహాలు.. సమాధానాలు 

Published Thu, Mar 18 2021 2:22 AM | Last Updated on Thu, Mar 18 2021 5:15 AM

Bharat Biotech Faces Difficult Questions About Its Vaccine - Sakshi

కోవిడ్‌ నిరోధం కోసం వ్యాక్సిన్‌ రాకముందు ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ప్రజలు వేచిచూశారు. తీరా అందుబాటులోకి వచ్చాక వారిలో వ్యాక్సిన్‌పై అనేక రకాల సందేహాలూ, సంశయాలూ ముప్పిరిగొంటున్నాయి. సాధారణంగా గుండెజబ్బులు ఉన్నవారిలో ఇవి మరీ ఎక్కువగా ఉంటున్నాయి. దీనికితోడు రక్తం గడ్డకట్టే ధోరణిని పెంపొందిస్తుందా అనే సందేహం తో కొన్నిదేశాల్లో దీని వాడకాన్ని తాత్కాలికంగా ఆపడంతో ఆ సందేహాలు మరింతగా పెరిగాయి. ఇటీవల చాలామందిలో వాక్సిన్‌ పై సందేహాలూ ఎక్కువయ్యాయి. ప్రత్యేకించి బ్లడ్‌ థిన్నర్స్‌ వాడే వారు వ్యాక్సిన్‌ తీసుకోవద్దంటూ భారత్‌ బయోటిక్, సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ వాళ్లు మన ఫ్యాక్ట్‌షీట్‌లో చెప్పిన అంశాలతో గుండెజబ్బులున్నవారిలో ఈ సందేహాలు మరింత ఎక్కువయ్యాయి. అలాంటి సంశయాలున్నవారికి వ్యాక్సిన్‌పై అపోహలు తొలిగేలా మరింత విపులమైన సమాధానాలను తెలుసుకోండి...నిశ్చింతగా వ్యాక్సిన్‌ తీసుకోండి. 

రక్తాన్ని పలుచబార్చే మందులు (బ్లడ్‌ థిన్నర్స్‌) వాడేవాళ్లు కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ వేసుకోవచ్చా?
ఈ విషయంలో సందిగ్ధత రావడానికి భారత్‌ బయోటెక్‌ వాళ్లూ, సీరమ్‌ ఇన్సి్టట్యూట్‌ సంస్థ విడుదల చేసిన ఫ్యాక్ట్‌ షీట్‌ కారణమైంది. బ్లడ్‌ థిన్నర్స్‌ వాడేవారు ఈ వ్యాక్సిన్‌ను తీసుకోకూడదని అందులో ఉంది. అయితే వాస్తవానికి బ్లడ్‌ థిన్నర్స్‌ తీసుకునేవాళ్లలో ఈ వ్యాక్సిన్‌ వలన ఎక్కువ సైడ్‌ ఎఫెక్ట్స్‌ వచ్చే అవకాశం ఏమీ ఉండదు గానీ ఇంజక్షన్‌ ఇచ్చిన దగ్గర రక్తం గడ్డకట్టే అవకాశం మాత్రం కొంతమేరకు ఉండవచ్చు. అంతకుమించి ఎలాంటి దుష్ఫలితాలూ ఈ మందుల వల్ల వచ్చే అవకాశం ఉండదు. బ్లడ్‌ థిన్నర్స్‌ రెండు రకాలుంటాయి. ఒక రకాన్ని ‘యాంటీ ప్లేట్‌లెట్స్‌’ అంటారు రెండో రకాన్ని ‘యాంటీ కోయాగ్యులెంట్స్‌’ అంటారు. యాంటీ ప్లేట్‌లెట్స్‌ అంటే ఆస్పిరిన్, క్లోపిడోగ్రెల్, టికాగ్రిలార్, ప్రాసూగ్రిల్‌ లాంటివి. ఇవి వాడేవాళ్లు నిర్ద్వంద్వం గా కోవిడ్‌ వ్యాక్సిన్‌ని తీసుకోవచ్చు. ఈ బ్లడ్‌ థిన్నర్స్‌ ఎక్కువ గా హార్ట్‌ఎటాక్‌ వచ్చినవాళ్లు వాడుతూ ఉంటారు. వీటిని వ్యాక్సిన్‌ తీసుకునే ముందు ఆపినట్లయితే ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున వీటిని ఆపకుండానే వ్యాక్సిన్‌ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మందులు వేసుకునే వాళ్లు వ్యాక్సిన్‌ తీసుకోవడానికి ముందర గుండె జబ్బుల నిపుణుల దగ్గర అనుమతి తీసుకునే అవసరం లేదు.

మరొక రకం బ్లడ్‌ థిన్నర్స్‌ని ‘యాంటీకోయాగ్యులెంట్స్‌’ అని పిలుస్తారని చెప్పుకున్నాం కదా. వార్‌ఫేరిన్, అసిట్రోమ్‌ ఇలాంటి మందుల్ని పాత రకం యాంటీకోయాగ్యులెంట్స్‌ అంటారు. వాల్వ్‌ మార్పిడి ఆపరేషన్‌ చేయించుకున్న వాళ్లు, కొన్ని రకాల కండిషన్ల కారణంగా రక్తం గడ్డకట్టే స్వభావం ఉన్న వాళ్లు ఈ మందుల్ని వాడుతుంటారు. అలాంటి వారు ఆ మందులు సరైన మోతాదులో సరైన విధంగా పనిచేస్తున్నాయా లేదా అనేది తెలుసుకోవడం కోసం పీటీ విత్‌ ఐఎన్‌ఆర్‌ అనే పరీక్ష క్రమబద్ధంగా చేయించుకుంటూ ఉంటారు. ఈ పరీక్షని వ్యాక్సిన్‌ ముందుకూడా చేయించుకోవచ్చు. ఒకవేళ ఈ ఐఎన్‌ఆర్‌ పరీక్ష మూడు కన్నా తక్కువ ఉన్నట్లయితే ఎలాంటి సందేహం లేకుండా వ్యాక్సిన్‌ వేసుకోవచ్చు. ఐఎన్‌ఆర్‌ వాల్యూ మూడు కన్నా ఎక్కువ ఉన్నట్లయితే అప్పుడు గుండె జబ్బు డాక్టర్‌ని సంప్రదించవచ్చు.

ఇకపోతే కొత్తతరం యాంటీ కొయాగ్యులెంట్స్‌ అనేవి ఇంకొన్ని బ్లడ్‌ థిన్నర్స్‌. రివారోక్సబాన్, ఎపిక్సబాన్, డాబిగాట్రాన్‌ అనే మందులు ఈ కోవకు చెందినవి. ఈ మందులు వేసుకునే వాళ్ళు కూడా కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ని సేఫ్‌గా వేసుకోవచ్చు. బ్లడ్‌ థిన్నర్స్‌ వేసుకునే వాళ్లు కోవిడ్‌ –19 వ్యాక్సిన్‌ తీసుకునే ముందు వాళ్ల మందుల వివరాలను వ్యాక్సినేషన్‌ అధికారికి చెప్పాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇంజక్షన్‌ తీసుకున్న తర్వాత ఇంజక్షన్‌ తీసుకున్న ప్రదేశాన్ని ఒక ఐదు నిమిషాల పాటు గట్టిగా నొక్కి పట్టుకోవాల్సి ఉంటుంది. ఈ మందులు వేసుకునే వాళ్ళు వాక్సిన్‌ కోసం వీటిని ఆపడం అనేది కొన్నిసార్లు ప్రమాదకరం కావచ్చు. అందువల్ల ఏదైనా కారణాల వల్ల ఒకవేళ ఈ మందుల్ని ఆపదలుచుకుంటే మాత్రం వాటికి సంబంధించిన డాక్టర్ని ఖచ్చితంగా సంప్రదించాలి.

కోవిడ్‌–19 వాక్సిన్‌ తర్వాత రక్తం గడ్డకట్టే అవకాశం ఉంటుందా? ఈ కారణంతో యూరోప్‌లో అనేక దేశాలు వ్యాక్సిన్‌ ని తాత్కాలికంగా నిలిపివేశారు అనే వార్తలు వస్తున్నాయి. అవి నిజమేనా?
ఆక్స్‌ఫర్డ్‌ ఆస్ట్రాజెనికా వాక్సిన్‌ వాడిన తర్వాత కొంతమందిలో రక్తం గడ్డ కట్టిందనే అనుమానంతో కొన్ని యూరోపియన్‌ దేశాలు ఈ వ్యాక్సిన్‌ని తాత్కాలికంగా నిలిపివేశాయి. అయితే ఆ కంపెనీ అధికారులు, యూరోపియన్‌ మెడిసిన్స్‌ ఏజెన్సీ అధికారులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులు... ఈ ముగ్గురూ చెప్పే విషయం ఏమిటంటే వ్యాక్సిన్‌ వేసుకున్న తర్వాత కొంతమందికి రక్తం గడ్డకట్టినప్పటికీ వ్యాక్సిన్‌ వల్లనే రక్తం గడ్డకట్టినట్లుగా ఎలాంటి ఆధారాలూ లేవు అని. లక్షమంది ప్రజల్ని తీసుకున్నట్లయితే వాళ్లలో వ్యాక్సిన్‌ వాడనప్పటికీ కొంతమందిలో రక్తం గడ్డకట్టే అవకాశం ఉంటుంది. వాక్సిన్‌ తరువాత అదే లక్షమందిలో ఎక్కువమందికి రక్తం గడ్డకడితే గనక అప్పుడు వ్యాక్సిన్‌ వల్లనే రక్తం గడ్డకట్టే అవకాశం పెరిగిందని అనుకోవచ్చు. కానీ రక్తం గడ్డకట్టే స్వభావం వ్యాక్సిన్‌ తీసుకోడానికి ముందూ... వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాతా ఏ మాత్రం ఎక్కువగా లేదని ఆస్ట్రోజెనికా కంపెనీ చెబుతోంది. మన దేశంలో కూడా వాక్సిన్‌ తర్వాత వచ్చే దుష్ఫలితాల గురించి పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తున్నామని డీసీజీఐ వెల్లడించింది. ఇప్పటివరకు మాత్రం ఇలాంటి రక్తం గడ్డకట్టే స్వభావం ఇండియా లో ఉన్న ఏ వ్యాక్సిన్‌తోనూ కనపడలేదని తెలుస్తోంది. 

కోవిడ్‌–19 వాక్సిన్‌ తర్వాత బీపీగానీ, షుగర్‌ గాని వచ్చే అవకాశం ఉంటుందా?
కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ వేసుకున్న తర్వాత కొంతమందిలో బీపీ ఎక్కువకావడం లేదా మరికొంతమందిలో బీపీ తక్కువ కావడం డాక్టర్ల దృష్టికి వచ్చింది. అయితే ఈ వాక్సిన్‌ తీసుకోవడం పట్ల ఉన్న అనుమానాలూ, టెన్షన్ల వల్లనే బీపీ పెరగడం గానీ, తగ్గడంగానీ జరుగుతోందని నిపుణుల అభిప్రాయం. బీపీలో ఈ రకమైన మార్పు తాత్కాలికమైనదేననీ, దీర్ఘకాలంలో కోవిడ్‌ వ్యాక్సిన్‌ వల్ల బీపీగానీ, షుగర్‌గానీ వచ్చే అవకాశం లేదని నిపుణులు తెలియజేస్తున్నారు.

కోవిడ్‌–19 వాక్సిన్‌ తర్వాత వంధ్యత్వం వచ్చే అవకాశం ఉంటుందా?
ఇది పూర్తిగా నిరాధారమైన సందేహం మాత్రమే. వంధ్యత్వం రావడానికి కోవిడ్‌ –19కీ లేదా కోవిడ్‌–19 వ్యాక్సిన్‌కీ ఎలాంటి సంబంధమూ లేదు.

కోవిడ్‌–19∙వ్యాక్సిన్‌ తర్వాత  కొంతమంది హెల్త్‌ కేర్‌ వర్కర్స్‌ ప్రెగ్నెంట్‌ కావడం జరిగింది. వాళ్లు ప్రెగ్నెన్సీ కంటిన్యూ చెయ్యవచ్చా లేక అబార్షన్‌ చేయించుకోవాలా?
గర్భిణీ స్త్రీలూ, పాలిచ్చే తల్లులకు కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ని ప్రస్తుతానికి ఇవ్వకూడదని ఇండియన్‌ డీసీజీఐ నిర్ణయించింది. ఇప్పటివరకు గర్భవతులపై ఈ వ్యాక్సిన్‌ ప్రయోగం జరగలేదు కాబట్టీ, వారిపై ఎలాంటి ట్రయల్స్‌ నిర్వహించలేదు కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేగాని ఈ వ్యాక్సిన్‌ వల్ల గర్భిణుల్లో ఏమైనా దుష్ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నట్టు గా కూడా ఇప్పటివరకైతే ఎలాంటి దాఖలాలూ లేవు. కాబట్టి గర్భిణులు ప్రస్తుతానికి ఈ వ్యాక్సిన్‌ తీసుకోకూడదు. ఒకవేళ ఈ వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత గర్భధారణ జరిగితే గనక అలాంటివారు ఎలాంటి భయాలూ, సందేహాలూ,  లేకుండా తమ గర్భధారణ (ప్రెగ్నెన్సీ)ని కొనసాగించవచ్చు.

వాక్సిన్‌ వేసుకున్న తర్వాత చేతి దగ్గర నొప్పి లేకపోతే యాంటీబాడీస్‌ డెవలప్‌ కావా?
వ్యాక్సిన్‌ వేసుకున్న తర్వాత భుజం దగ్గర నొప్పి రావడం సహజం. నొప్పి ఉన్నప్పుడు మనకి ఆ ఇంజక్షన్‌ ద్వారా విడుదలైన యాంటిజెన్‌ పనిచేస్తోందని కూడా తెలుస్తుంది. వ్యాక్సిన్‌ పట్ల మన శరీరం ప్రతిక్రియ జరపడం (రియాక్షన్‌ చూపడం)  వల్ల కొంత నొప్పి గాని కొన్నిసార్లు జ్వరం గాని రావచ్చు. అయితే బాగా భుజం నొప్పి వచ్చిన వాళ్లకో... లేదా బాగా జ్వరం వచ్చిన వాళ్లకు మాత్రమే యాంటీబాడీస్‌ ఎక్కువ మోతాదులో ఉత్పత్తి అవుతాయనడానికి ఆధారాలు లేవు. అసలు ఏ నొప్పి లేకపోయినప్పటికీ వాక్సిన్‌ తర్వాత యాంటీ బాడీస్‌ పెద్దమొత్తంలో వృద్ధి కావచ్చు. కాబట్టి వాక్సిన్‌ వేసుకున్న తర్వాత నొప్పి గురించి భయపడాల్సిన అవసరం లేదని ఎలా చెబుతున్నామో, నొప్పి లేకపోయినా వ్యాక్సిన్‌ ప్రభావం గురించి భయపడాల్సిన అవసరం లేదని గట్టిగా చెప్పాల్సి వస్తోంది. అంటే... చేతి నొప్పికీ... వ్యాక్సిన్‌ కారణంగా వృద్ధి అయ్యే యాంటీబాడీస్‌ సంఖ్యకూ ఎలాంటి సంబంధమూ లేదని అర్థం చేసుకోవాలి. 

డా. ఎంఎస్‌ఎస్‌ ముఖర్జీ, 
సీనియర్‌ కన్సల్టెంట్‌
కార్డియాలజిస్ట్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement