గేట్స్‌ గుండె తలుపులు తట్టిందెవరు? | Bill Gates And Melinda Gates Announce Divorce After 27 Years | Sakshi
Sakshi News home page

గేట్స్‌ గుండె తలుపులు తట్టిందెవరు?

Published Sat, May 8 2021 12:09 AM | Last Updated on Sat, May 8 2021 3:29 PM

Bill Gates And Melinda Gates Announce Divorce After 27 Years - Sakshi

బిల్‌గేట్స్‌ దంపతులు

మే 3న గేట్స్‌ దంపతులు విడాకులపై సంతకాలు పెట్టారు. 4న ఆ సంగతి ప్రపంచానికి చెప్పారు. 5న గేట్స్‌ దీర్ఘకాల ప్రియ స్నేహితురాలు యాన్‌ బిన్‌బ్లాడ్‌ పేరు బయటికి వచ్చింది! 6న గేట్స్‌ చైనీస్‌ ఇంటర్‌ప్రెటర్‌ ఝ షెల్లీ వాంగ్‌ పేరు గేట్స్‌తో జత అయింది!! ‘సర్‌ అలాంటివారు కారు..’ అని షెల్లీ అంటున్నా ఎవరూ నమ్మడం లేదు. ఒక భార్య, ఒక భర్త విడిపోయారంటే అందుకు మరొక మహిళే కారణమా!!

36 ఏళ్లు షెల్లీకి. చక్కగా, చలాకీ గా ఉంటారు. ‘నేను అలాంటి మనిషిని కాదు’ అనడం లేదు తను. గేట్స్‌ గౌరవాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అసలు గేట్స్‌ కి యాన్‌ కి, గేట్స్‌ కి షెల్లీ కి మధ్య ఏముంది? వట్టి ప్రేమేనా? అంతకన్నా ఉన్నతమైన భావన ఏదైనానా?! నిజంగా గేట్స్‌ గుండెల్లో ఎవరైనా ఉన్నారా? లేక.. ఎవరో ఒకరు ఉండకపోతారా అని మీడియానే ఆయన గుండె తలుపుల్ని తట్టి చూస్తోందా?!


భార్యాభర్తలుగా తామిద్దరం విడిపోతున్నట్లు బిల్‌ గేట్స్, మెలిందా గేట్స్‌ ప్రకటించగానే, అందుకు యాన్‌ విన్‌బ్లాడ్‌ అనే మహిళ కారణం అయుండొచ్చన్న ఊహా కథనాలు మొదలయ్యాయి. అయితే అవి కేవలం ఊహల ఆధారంగా అల్లుకున్నవి కావు. గేట్స్‌కి మెలిందా పరిచయం అవడానికి ఏడేళ్ల ముందు నుంచే యాన్‌.. అతడి గర్ల్‌ ఫ్రెండ్‌. చివరికి యాన్‌ అనుమతితోనే గేట్స్‌ మెలిందాను పెళ్లి చేసుకున్నారు. అదే అనుమతిని పెళ్లికి ముందే మెలిందా దగ్గర్నుంచి కూడా గేట్స్‌ తీసుకున్నారు... ఏడాదిలో ఒక వారం రోజులు యాన్‌తో కలిసి ఉంటానని!! యాన్‌ వయసిప్పుడు 70 ఏళ్లు. గేట్స్‌ కంటే ఐదేళ్లు పెద్ద.

యాన్‌ విన్‌బ్లాడ్‌, ఝ షెల్లీ వాంగ్‌

ఇరవై ఏడేళ్లు కలిసున్నాక, ముగ్గురు పిల్లలు పెరిగి పెద్దయ్యాక ఇప్పుడు గేట్స్‌ దంపతులు విడిపోవాలని గట్టి నిర్ణయం తీసుకోడానికి కారణంగా యాన్‌ విన్‌బ్లాడ్‌ తర్వాత బయటికి వచ్చిన ఇంకో మహిళ పేరు ఝ షెల్లీ వాంగ్‌! షెల్లీ చైనా యువతి. యాన్‌ కన్నా 35 ఏళ్లు, గేట్స్‌ కన్నా 30 ఏళ్లు చిన్న. ‘బిల్, మెలిందా గేట్స్‌ పౌండేషన్‌’లో ఆరేళ్లుగా చైనీస్‌ ‘ఇంటర్‌ప్రెటర్‌’గా ఉన్నారు. భాషల తర్జుమాల్లో ప్రవీణురాలు. ‘బిల్‌ గేట్స్‌ మిస్ట్రెస్‌ (ప్రియురాలు) ఈజ్‌ ఝ షెల్లీ వాంగ్‌ ఫ్రమ్‌ చైనా’ అని మే 6న మైఖైల్‌ డెలాజెన్‌ అనే యూజర్‌ నేమ్‌తో అకస్మాత్తుగా నెట్‌లో ఒక ట్వీట్‌ తలెత్తగానే.. తలలన్నీ యాన్‌ మీద నుంచి షెల్లీ వైపు తిరిగాయి! ‘‘సర్‌ అలాంటి వారు కారు. నమ్మండి. సర్‌తో, మేడమ్‌తో నాకున్న బాంధవ్యం ఉద్యోగానికి అతీతమైనదేమీ కాదు’’ అని చైనా సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ‘వైబో’లో షెల్లీ పెట్టిన పోస్ట్‌ గత రెండు రోజులుగా అక్కడ వైరల్‌ అవుతోంది.

ఏమైనా ఇప్పుడు గేట్స్, మెలిందాలు వార్తల్లోంచి వెళ్లిపోయి, యాన్, షెల్లీలు.. వదంతులలోకి వచ్చారు. వాటిని విని యాన్‌ నవ్వుకుంటుంటే, షెల్లీ కంట తడి పెట్టుకుంటున్నారు. వ్యక్తిగతంగా ఆమెకు వస్తున్న మెజేస్‌లలో ఇప్పుడు ఆమెను ఓదారుస్తున్నవే ఎక్కువ. ‘షెల్లీ గేట్స్‌ ప్రియురాలు’ అనే ట్వీట్‌ ప్రత్యక్షం కాగానే, ఆ మాటను రూఢీ పరిచే రీ ట్వీట్‌లూ మొదలయ్యాయి.‘‘ఇది చైనా కమ్యూనిస్టు పార్టీ పన్నిన కుట్రలా అనిపించవచ్చు. కామ్రేడ్‌ గేట్స్‌కి డబ్బు, మీడియా ప్రచారం అవసరం లేకున్నా.. ఒక స్త్రీని వద్దనుకోగలడా?’’ అనేది ఆ ట్వీట్‌లలో ఒకటి! అయితే గేట్స్‌ మరీ అంత అవసరంలో ఉంటాడని అనుకోడానికి ఒక్క కారణమూ లేదు. ఆయన జెంటిల్మన్‌  అయినట్లే, యాన్, షెల్లీ నైస్‌ ఉమెన్‌.

యాన్‌ని మోసం చేసి ఆయన మెలిందాను పెళ్లి చేసుకోలేదు. ఎంతకూ పెళ్లి మాట ఎత్తకపోతుంటే.. ‘అలాగే ఆలోచిస్తూ ఉండు’ అని నవ్వుతూ యాన్‌ వేరే వ్యక్తిని వివాహమాడారు. గేట్స్‌ కూడా యాన్‌కు చెప్పకుండా మెలిందాను చేసుకోలేదు. ఆమె సంప్రదించాకే పెళ్లికి చొరవ చేశాడు! పెళ్లయ్యాక ఎప్పుడూ మెలిందా అనుమతి తీసుకోకుండా యాన్‌ని కలవలేదు గేట్స్‌. యాన్‌కి, గేట్స్‌ మధ్య అప్పటికీ ఇప్పటికీ ఉన్న బంధం అభిరుచుల అనుబంధమే తప్ప, హృదయ సంబంధం కాదు. యాన్‌ ఎలా చూసినా గేట్స్‌ కన్నా గ్రేట్‌. మైక్రోసాఫ్ట్‌ ఆరంభ సంవత్సరాలలో యాన్‌ పెట్టుబడులు కూడా ఉన్నాయి. ఇప్పటికీ ఆమె ఇబ్బడిముబ్బడిగా స్టార్టప్‌లకు డబ్బు పెడుతుంటారు. సొంత సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు ఉన్నాయి. పాతిక పైగా కంపెనీల ‘బోర్డ్‌’లలో ఆమె కీలక సలహాదారు. సిలికాన్‌ వ్యాలీలో తొలి మహిళా ప్రోగ్రామర్‌.

ఇవన్నీ అటుంచితే.. అసలు గేట్స్‌కి, యాన్‌కి మధ్య ఏమున్నట్లు?! వాళ్లను ఎప్పటికీ కలిపి ఉంచేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉన్నాయి. గేట్స్‌ మెలిందాతో ప్రేమలో పడటానికి ముందు యాన్‌ తో ప్రేమలో ఉన్న మూడేళ్లూ వాళ్ల డేటింగ్‌ ఎలా ఉంటుందో చూడండి. ఒకసారి బ్రెజిల్‌ వెళ్లారు. అక్కడ ఇద్దరూ కలిసి బయో ఇంజినీరింగ్‌లో చిన్నపాటి అధ్యయనం చేశారు. ఇంకోసారి మరో దేశం వెళ్లారు. అక్కడ రిచర్డ్‌ ఫేవ్‌మన్‌ ప్రసంగాల ఆడియో టేప్‌లలో ఫిజిక్స్‌ను ఆస్వాదించారు. జాంజిబార్‌ వెళ్లినప్పుడు ప్రాచీన మానవ జీవన శాస్త్రాల పరిశోధకుడు డొనాల్డ్‌ జొహాన్‌సన్‌ పరిణామక్రమ సిద్ధాంతాల గురించి చదివారు! ఇదే వాళ్ల లైఫ్, లవ్‌! మెలిందాతో పెళ్లయ్యాక కూడా యాన్‌ని గేట్స్‌ కలుస్తున్నది ఇందుకోసమే. ఇక ఆమెవల్ల వీళ్లు విడిపోడానికి ఏముంటుంది?!

మరి షెల్లీ కారణంగా గేట్స్‌ దంపతులు విడిపోయి ఉంటారా?! గేట్స్‌ అంత బలహీనమైన వారు కానీ, షెల్లీ అంత బలం లేని మహిళ కానీ కాదు. షెల్లీ చక్కగా ఉంటారు. చలాకీగా ఉంటారు. ఈ భార్యాభర్తల పౌండేషన్‌లోనే పని చేస్తున్నారు. క్షణం తీరిక ఉండని ఉద్యోగి ఆమె. నిజానికి మైక్రోసాఫ్ట్‌లో, గేట్స్‌ అండ్‌ మెలిందా ఫౌండేషన్‌లో వందల మంది షెల్లీలు ఉంటారు. ఎవరి ప్రపంచాలు వారివి. వాళ్లలో షెల్లీ ప్రపంచం కూడా ఒకటి. ఒకటి కాదు. చాలా! హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌లో, యేల్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌లో కూడా ఆమె ఇంటర్‌ప్రెటర్‌గా పని చేస్తున్నారు. టి.ఇ.డి. కాన్ఫరెన్స్‌లకు వెళుతుంటారు.

‘మానిటరీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ స్టడీస్‌’లో కూడా పార్ట్‌ టైమ్‌గా వర్క్‌ చేస్తున్నారు. ఒక్కమాటలో గేట్స్‌ ఎంత బిజీగా ఉంటారో, గేట్స్‌ సంస్థలో పని చేస్తున్న షెల్లీ కూడా అంత బిజీగా ఉంటారు. బిజీగా ఉన్నంత మాత్రాన ఇద్దరి మధ్య ప్రేమ జనించకూడదా అనే ప్రశ్న రావచ్చు. వృత్తిని ప్రేమించేవారి దగ్గరికి ఒక ‘వ్యక్తిగా’ ప్రేమ ఎన్నటికీ దరి చేరలేదు. ‘‘భార్యాభర్తలుగా విడిపోతున్నా, ప్రొఫెషనల్స్‌గా మాత్రం మేము కలిసే ఉంటాం’’ అని బిల్‌ గేట్స్, మెలిందా చెప్పింది అందుకేనేమో!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement