రొమ్ముక్యాన్సర్ బాధితులు రాత్రివేళ నిద్రపోగానే... రొమ్ముక్యాన్సర్ కణాలు ఒళ్లు విరుచుకుని నిద్రలేస్తాయంటున్నారు పరిశోధకులు. ఈ పరిశోధన ఆధారంగా రొమ్ముక్యాన్సర్ రోగుల నుంచి పరీక్షల కోసం రక్తాన్ని సేకరించే వేళలు ఇకపై పగటిపూటగాక... రాత్రివేళల్లోకి మారే అవకాశం లేకపోలేదనీ పరిశోధకులు చెబుతున్నారు. అలాగే డాక్టర్లు తాము చేసే బయాప్సీలను మరింత కచ్చితంగా నిర్వహించేందుకు ఈ అంశం తోడ్పడనుందని చెబుతున్నారు ఈ పరిశోధనలో పాలుపంచుకున్న ప్రధాన అధ్యయనవేత్త, ఈటీహెచ్ జ్యూరిక్ (స్విట్జర్లాండ్)కు చెందిన యూనివర్సిటీలోని మాలెక్యులార్ బయాలజీ ప్రొఫెసర్ నికోలా అసెటో.
ఆయన మాట్లాడుతూ... ‘‘ఈ పరిశోధన కోసం మా సహచరులు ఉదయం నుంచి సాయంత్రం వరకు... అలాగే కొన్నిసార్లు రాత్రివేళల్లోనూ అనేక సమయాల్లో బాధితుల నుంచి రక్తాన్ని సేకరిస్తూ వచ్చారు. ఆ పరీక్షల్లో ఈ విషయం వెల్లడైంది’’ అని వివరించారు. ఇక ఇదే అధ్యయనంలో పాలుపంచుకున్న మాలెక్యులార్ ఆంకాలజీ విభాగానికి చెందిన మరో పరిశోధకుడు జోయ్ డయామాంటోపౌలో మాట్లాడుతూ ‘‘క్యాన్సర్ కణాలు తొలుత ఉద్భవించిన (ప్రైమరీ) ప్రదేశం నుంచి మరో చోటనున్న (సెకండరీకి) కణజాలాలకు వ్యాప్తి చెందుతాయి. నిద్రను కలిగించే మెలటోనిన్ ఆ వేగాన్ని ప్రభావితం చేస్తోంది. మెలటోనిన్ చురుగ్గా ఉన్న సమయంలోనే క్యాన్సర్ గడ్డ నుంచి కణాలు మరోచోటికి చురుగ్గా ప్రసరిస్తున్నాయి’’ అని వివరించారు.
అయితే నిద్రవేళల్లో క్యాన్సర్ విస్తరిస్తుందనే పరిశోధనల ఆధారంగా రాత్రుళ్లు మెలకువతో ఉన్నంత మాత్రాన ఆ అంశం క్యాన్సర్ నివారణకూ, వ్యాప్తిని తగ్గించడానికి దోహదపడుతుందనుకుంటే పొరబాటే. సర్కాడియన్ రిథమ్‌కు తోడ్పడే మెలటోనిన్ తగ్గుదల కారణంగా నిద్రపట్టకపోతే క్యాన్సర్ వ్యాప్తి వేగం తగ్గుతుందనుకోవడం తప్పే. నిద్రలేకపోవడం వల్ల కలిగే ఒత్తిడి వల్ల వ్యాప్తి, విస్తరణ మరింత పెరుగుతాయి. అందువల్ల నైట్‌డ్యూటీలు చేసేవారికి క్యాన్సర్ ముప్పు తక్కువగా ఉంటుందనుకోవడం సరికాదు. వాళ్లకు ఆక్సిడేటివ్ స్ట్రెస్ కారణంగా క్యాన్సర్ ముప్పు ఉంటుంది. అందుకే నైట్ డ్యూటీలు చేసేవారు కనీసం ఐదుగంటల పాటైనా నిద్రపోవడం మేలు. పై పరిశోధన వివరాలు ప్రముఖ వైద్య జర్నల్ ‘నేచర్’లో ప్రచురితమయ్యాయి.
చదవండి: మహిళల క్యాన్సర్లు: ఓ అవగాహన
Comments
Please login to add a commentAdd a comment