గుహను ఇల్లుగా మార్చేసి, ఆ ఇంటితోనే స్వయం ఉపాధి పొందుతున్నాడు గ్రాంట్ జాన్సన్ అనే ఈ అమెరికన్ పెద్దమనిషి. సరిగా చదువుకోక పోవడంతో పదిహేడేళ్ల వయసులోనే ఇతన్ని బడి నుంచి సాగనంపేశారు. బడి నుంచి బయటపడ్డాక పొట్టపోసుకోవడానికి గని కార్మికుడుగా కుదురుకున్నాడు. గనుల్లో పనిచేసి, కూడబెట్టుకున్న సొమ్ముతో 1995లో 25 వేల డాలర్లు (ర.15.60 లక్షలు) పెట్టి యూటా శివార్లలో 40 ఎకరాల బీడు భమిని కొన్నాడు. ఈ భూమి కొన్నప్పుడు అతడి మిత్రులంతా పనికిరాని భమి కొని వెర్రిబాగుల పని చేశాడంటూ అతడిని తిట్టిపోశారు. గ్రాంట్ వాళ్ల మాటలను పట్టించుకోలేదు.
తాను కొన్న భూమిలోనే ఉన్న కొండ గుహను ఏళ్ల తరబడి శ్రమించి 5,700 చదరపు అడుగుల విస్తీర్ణం గల చూడచక్కని ఇంటిగా తయారు చేశాడు. అధునాతనమైన ఇంటికి కావలసిన హంగులన్నింటినీ అందులో ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఆ ఇంటిని పర్యాటకులకు అద్దెకు ఇస్త, వచ్చే ఆదాయంతో నిక్షేపంగా కాలక్షేపం చేస్తున్నాడు. ఇందులోని ఒక గదిలో బస చేసేందుకు ఒక రాత్రికి 350 డాలర్లు (ర.28,741), ఇల్లు మొత్తంగా అద్దెకు కావాలనుకుంటే ఒక రాత్రికి వెయ్యి డాలర్లు (ర.82,119) చెల్లించాల్సి ఉంటుంది.
గ్రాంట్ ఈ భూమిని కొన్నప్పుడు ఇక్కడ ఉండే గుహ ప్రవేశమార్గం చాలా చిన్నగా ఉండేది. డైనమైట్లతో దాన్ని పేల్చి, మార్గాన్ని విశాలం చేశాడు. లోపలి గోడలను స్వయంగా తన చేతులతోనే ఉలి, సుత్తి వంటి పరికరాలను పట్టుకుని నున్నగా చెక్కాడు. నేల మీద మొజాయిక్ ఫ్లోరింగ్ చేయించాడు. నీటి సరఫరాకు పైపులు వేయించాడు. పైఅంతస్తుకు, కింది అంతస్తుకు రాకపోకలు జరుపుకోవడానికి మెట్లు ఏర్పాటు చేశాడు. విద్యుత్తు, టెలిఫోన్ కనెక్షన్లు ఏర్పాటు చేయించుకున్నాడు. సలక్షణమైన ఇంటిగా మార్చుకున్నాక, ఈ గుహనే అద్దెకిస్త స్వయం ఉపాధి పొందుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment