బహుశా చాతక పక్షి, మూఢనమ్మకం అవిభాజ్య కవలలు అయుండొచ్చు, అందుకే ఈ పక్షికి చాలా మూఢనమ్మకాలు అంటగట్టారు. చాతక పక్షిని చిట్టి కోకిల, Pied cuckoo, Jacobin Cuckoo (Clamator jacobinus) అని కూడా పిలుస్తారు.
వివిధ పేర్లతో పిలువబడే ఈ పక్షి అనేకమంది ప్రేమ జంటల, రైతుల, శాస్త్రవేత్తల దృష్టిని ఎంతో కాలంగా ఆకర్షిస్తూ ఉంది . కవిత్వంలో ఈ పక్షిని ప్రేమద్వేషాల అతిశయోక్తిని వ్యక్తీకరించడానికి కవిసమయంలో వాడితే, రైతులకు, శాస్త్రవేత్తలకు రుతుపవనాలరాకను తెలిపే శుభ సంకేతంగా ఈ పక్షిని సూచిస్తుంటారు.
మేఘదూత కవిత్వంలో
ఈ చాతక పక్షి గురించి ఎన్నో పురాణాలు, జానపద కథలు మరియు కవిత్వం రచించ బడ్డాయి. కాళిదాసు రూపొందించిన మేఘదూత కవిత్వంలో, ప్రేమ కోసం తపనకు ప్రతీకగా ఈ పక్షిని వర్ణించాడు. అప్పటి నుండి ఇప్పటి వరకూ ఈ పక్షి కవిని ఆకట్టుకోవడం అనేది చాల ఆసుక్తికరమైన విషయమే.
ఎప్పటి నుంచో భారతీయ సంస్కృతిలో భాగమైన పక్షి కాబట్టి, దాని చుట్టూ ఉన్న కథను మహిమపరిచే అవకాశం ఉంది. ఇప్పటికీ సామాన్యుల మదిలో ఈ పక్షిపై రకరకాల అపనమ్మకాలు ఉన్నాయనడంలో తప్పులేదు. వార్తా పత్రికలు, వెబ్ సైట్లు మరియు యూట్యూబ్ వీడియోలు ఆ మూఢనమ్మకానినే సత్యంగా చిత్రీకరిస్తున్నాయి.
వర్షపు నీరే తాగుతుందా?
మన సంప్రదాయం ప్రకారం ఈ చాతక పక్షి నేల మీద ఉండే నీరు త్రాగదని, ఇది కేవలం తొలకరి వర్షపు చినుకులు (స్వాతి వర్షం) ఆకాశం నుంచి పడుతున్నప్పుడే నేరుగా నోరు తెరచి పట్టుకుని తాగుతుంటుందని, లేకుంటే నీరు తాగకుండా రోజుల తరబడి బతుకుతుందని చెబుతుంటారు.
ఇవన్నీ అసత్యాలు
ఇంకొక మూఢనమ్మకం ఏమిటంటే, చాతక పక్షి తలపై ఉన్న శిఖరంలో వర్షపు నీటిని సేకరించి త్రాగుతుందని, ఒక వేల చాతకం నిలిచిన నీటిని త్రాగడానికి ప్రయత్నించినప్పుడు, ఈ శిఖరం అడ్డుపడడం వల్ల నిలిచిన నీటిని త్రాగదని చెబుతారు. ఈ పక్షి యొక్క మెడ ఎముకలు నిటారుగా ఉండటం వలన దాని మెడను వంచి నీటిని త్రాగదని చెబుతుంటారు. ఇవన్నీ అసత్యాలు !
నిజానికి, ఇది వర్షం పడుతున్నప్పుడే నేరుగా ఆ నీరుని త్రాగదు, నిలిచిన నీళ్లే త్రాగతుంది. ఇప్పటికీ, ఎడారులలో నివసించే కొన్ని జీవులు మాత్రమే, ఆ వాతావరణానికి తట్టుకునే ప్రత్యేకమైన శారీరిక నిర్మాణం కారణంగా నీరు లేకుండా ఎక్కువ కాలం జీవించగలవు.
వాటికి అడ్డురాదా?
అయితే అన్ని జీవులకు నీరు చాలా అవసరం. ఇంకా, పక్షులు శిఖరం కలిగివుండానికి కారణం, వాటి ప్రత్యర్థులకు తమ దూకుడును వ్యక్తపరిచేందుకు. ఇంకా నీళ్ళు తాగడానికి శిఖరం అడ్డు వచ్చే అవకాశం లేదు, ఐదు వందలకు పైగా పక్షులకు ఈ శిఖరం ఉంది, అంటే అవి నీరు త్రాగడానికి ఈ శిఖరం అడ్డు రాదా?. అన్ని పక్షుల మాదిరిగానే, ఈ పక్షి మెడ ఎముకలు నిటారుగా ఉండవు, అన్నిటికి ఉండే లాగానే దీనికి ఉంటాయి.
భారతదేశంలో రెండు సమూహాల చాతక పక్షులు ఉన్నాయి, దక్షిణ భారతదేశానికి మాత్రమే పరిమితమైన ఒక చిన్న దేశీయ సమూహం మరియు రుతుపవనాల ముందు భారీ సంఖ్యలో ఆఫ్రికా నుండి వలస వచ్చే మరో సమూహం. ఈ చిన్న పక్షుల సమూహం చాలా అరుదు, ఎవరూ పెద్దగా గమనించి ఉండరు, కానీ ఈ వలస సమూహం భారీ సంఖ్యలో వస్తుంది.
ఈ సమయంలో వర్షాలు లేకపోవడం వల్ల, వేసవి తాపానికి బంజరు భూములు, ఎండిన చెట్లు, జంతువులు, పక్షులు నీటి కొరతతో అల్లాడిపోతుంటాయి. ఈ కాలంలో మనిషి వ్యవసాయ పనులు లేకుండా ఖాళీగా ఉండడం, వ్యాపార లావాదేవీలన్నీ నిలిచిఉండడం చేత, ఇలాంటి సమయంలో మానవుని ఉత్సుకత పకృతిలో చిన్న చిన్న మార్పుల పైనే ఉంటుంది.
వర్షపు రాక సూచనగా
అకస్మాత్తుగా ఎక్కడి నుంచో పెద్ద సంఖ్యలో వచ్చిన ఈ పక్షులు ‘ప్యూ ప్యూ ప్యూ... ప్యూ ప్యూ ప్యూ... ప్యూ ప్యూ ప్యూ...’ అంటూ గంభీర స్వరాలతో అరుస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తాయి. అదనంగా ఈ పక్షుల రాకతో రుతు పవనాలతో పెద్ద వర్షాలే వస్తాయి, దీనిని గమనించిన మన పెద్దలు చాతక పక్షి రాకను వర్షం వచ్చేందుకు సూచనగా భావిస్తారు. అంటే చాతక పక్షి వచ్చిందంటే వర్షం వస్తుందని ఒక గట్టి నమ్మకం.
సంతతి విస్తరించుకోడానికి
ఆఫ్రికా ఖండం నుంచి సముద్రం మీదుగా భారతదేశానికి ఒకేసారి వెళ్లడం చాలా కష్టమైన ప్రయాణం కాబట్టి, మే నెలలో వీచే రుతుపవనాల సహాయం పొందే మార్గాన్ని కనుగొన్నాయి. రుతుపవనాల గాలి సహాయంతో అవి వర్షాలు ప్రారంభానికి ముందే భారత ఉపఖండానికి చేరుకుంటాయి, అందుకే చాతకాకి ’వాన దూత’ అని పిలిచేది. ఈ సమయానికే రావడానికి గల మరొక ప్రధాన కారణం ఏమిటంటే భారతదేశంలో దాని యొక్క సంతతి విస్తరించుకోడానికి అది అనువైన వాతావరణం.
రుతుపవనాలు విచేస్తునప్పుడు పుష్టిగా ఆహారం అందుబాటులో ఉండడం వలన స్థానిక పక్షులు తమ సంతానోత్పత్తి ప్రారంభిస్తాయి. చాతక ఒక బ్రూడ్ పరాన్నజీవి. అనగా అవి తమ గుడ్డులను పెట్టడానికి, పిల్లలను పెంచడానికి ఇతరులపై ఆధారపడే పక్షులు. ఇవి తమ గూడు నిర్మించకుండా మరొక అతిధేయ పక్షి గూడులో వాటి గుడ్లను పెడతాయి.
ఇవి ముఖ్యంగా భారతదేశంలో గుడ్లు పెట్టడానికి బాబ్లర్స్ అనే జాతి పక్షి గూళ్ళపై ఎక్కువగా ఆధారపడతాయి. ఇవి వచ్చిన పనిని పూర్తిచేసి, కొత్తతరం పక్షులతో, ఉత్తర భారతదేశం మీదుగా చలికాలం సమయానికి ఆఫ్రికా ఖండానికి తిరిగివెళ్తాయి.
ప్రేమానుభూతిలో కవి అతిశయోక్తితో సృష్టించిన ఊహాగానకవిత్వాన్ని సత్యంగా భావించి ఇన్నాళ్లూ అదే సత్యమని నమ్మి పురాణాన్ని సంపద్రాయంగా భావించడం ఎంతవరకు సమంజసం? ఆ కవిసమయం నుంచి బయటపడి ఒక్కసారైనా శాస్త్రీయ దృక్పథంతో ప్రశ్నించుకోలేమా?.
- హరీష ఏఎస్(Hareesha AS)
ఫొటోగ్రాఫర్- సుభద్రా దేవి
Comments
Please login to add a commentAdd a comment