లలితమ్మకు అరవై దాటాయి. భర్తపోయాడు. ఇద్దరు పిల్లలు. కొడుకు కుటుంబం యూఎస్‌లో ఉంది. కూతురు తన కుటుంబంతో జీవిస్తోంది. జీవితం లలితమ్మను క్రాస్‌రోడ్‌లో నిలబెట్టింది. మీరంగీకరిస్తే పెళ్లి చేసుకుందాం... అంటూ ఒక ప్రతిపాదన. ఇప్పుడామె ఏం చేయాలి? ఆమె తీసుకున్న నిర్ణయం ఏమిటి? ఓ రోజు కొడుక్కి ఫోన్ చేస్తే కోడలు మాట్లాడింది.
తన ఆరోగ్య పరిస్థితిని గుర్తు చేస్తూ ‘మీరు నా బాధ్యత తీసుకునే కండిషన్‌లో లేరని అర్థమైంది. నన్ను పెళ్లి చేసుకోవడానికి ఓ వ్యక్తి ముందుకొచ్చారు. ఆ విషయం అబ్బాయితో చెప్పడానికి ఫోన్ చేశాను’ అన్నది. ఆ కోడలు భర్తకి ఫోన్ ఇవ్వకుండానే ‘అత్తయ్యా మీ సంతోషమే మా సంతోషం’ అని ఫోన్ పెట్టేసింది. ‘మీకు మేమున్నాం’ అనే మాట కోసం ఎదురు చూసిన లలితమ్మకు పెళ్లి ఒక్కటే ఆమెకున్న దారి అని చెప్పకనే చెప్పినట్లయింది.
న్యూక్లియర్ ఫ్యామిలీ రోజులివి!
ఏదో ఒక ఇంట్లో కాదు, సమాజంలో సగానికి పైగా కుటుంబాల పరిస్థితి ఇలాగే ఉందన్నారు తోడు– నీడ రాజేశ్వరి. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలుండేవి. ఇప్పుడు దాదాపుగా అన్నీ న్యూక్లియర్ ఫ్యామిలీలే. వీటిలో గ్రాండ్ పేరెంట్స్ కి స్థానం లేదు. పిల్లలు పుట్టినప్పటి నుంచి నానమ్మ, తాతయ్య అంటే అతిథులుగా వచ్చిపోయేవాళ్లేననే భావనతోనే పెరుగుతున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో కొడుకు ఇంట్లోనే అనాథల్లా బతుకీడ్చడానికి ఇష్టపడడం లేదు పెద్దవాళ్లు. నగరంలో సీనియర్ సిటిజెన్ హోమ్స్ ఇలాంటి అవసరం నుంచి మొగ్గతొడినవే. భార్యాభర్త ఇద్దరూ జీవించి ఉన్నంత వరకు పిల్లలతో కలిసి ఉండాలనుకోవడం లేదు. తమకు తాముగా హాయిగా ఉంటున్నారు.
వారిద్దరిలో ఒకరు జీవితం చాలించినప్పుడు రెండోవాళ్లు ఒంటరి పక్షులవుతున్నారు. అలాంటి వారికి పెళ్లి బంధంతో ఒక ఆలంబన చేకూర్చడం అవసరం. చివరి శ్వాస వరకు మనిషికి ఎమోషనల్ బాండింగ్ అవసరమే. ఆ బాండింగ్ పెళ్లితోనే సాధ్యం.
సహజీవనమూ సమాధానమే!
‘‘నేను చేసిన పెళ్లిళ్లలో విజయవాడకు చెందిన కోటేశ్వరరావు, రాజేశ్వరి పెళ్లి ప్రత్యేకం. అయితే అరవైలలో పెళ్లి మాత్రమే కాదు, సహజీవనం కూడా ప్రోత్సహించాల్సిన విషయమే. ఇటీవల కొంతమంది విషయంలో లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌నే ప్రోత్సహిస్తున్నాను. సంపన్న కుటుంబాల్లో పెద్దవాళ్ల పెళ్లి ఆస్తి తగాదాలకు దారి తీస్తోంది.
బ్యాంకు మేనేజర్‌గా రిటైరైన అరవై ఏళ్ల వ్యక్తి, అదే వయసున్న గృహిణి సహజీవనంలో ఉన్నారు. వాళ్లకిద్దరికీ పిల్లలున్నారు. మొదటిరోజే అతడి పిల్లలతో స్పష్టంగా ‘మీ ఆస్తి నాకు వద్దు, సవతి తల్లి అనే భావనలో ఉండవద్దు. మీ నాన్న సంరక్షణ చూసుకునే కేర్‌టేకర్‌ని మాత్రమే. నా సంరక్షణ చూసుకునే బాధ్యత మీ నాన్నది. నా కారణంగా మీరు మీ నాన్నకు దూరం కావద్దు.
అలాగే నా పిల్లలూ నాకు దూరం కారు’ అని స్పష్టంగా చెప్పింది.. ఇరువురి పిల్లలూ ఆమోదించారు. కొడుకులు –కోడళ్లు, కూతుళ్లు– అల్లుళ్లు, మనుమలు, మనుమరాళ్లు పండుగలకు వస్తుంటారు’’ అంటూ వాలుతున్న ΄÷ద్దులో తాను పూయించిన వెలుగు సుమాలను ‘సాక్షి’తో పంచుకున్నారు తోడు – నీడ రాజేశ్వరి.
ఆ క్షణం నుంచి మందు ముట్టలేదు
భార్యపోయిన తర్వాత మద్యంతో సేదదీరడం అలవాటైంది. రాజేశ్వరిని పెళ్లి చేసుకున్న మూడేళ్ల తర్వాత ఒకసారి విరేచనాలతో తీవ్రంగా బాధపడ్డాను. నాకేదయినా అయితే... అనే ఆలోచన నన్ను భయపెట్టింది.
నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత రాజేశ్వరి పండుగలప్పుడు పట్టుచీర కట్టుకుని పూలు పెట్టుకుని ఇంట్లో సంతోషంగా ఉండడం కళ్ల ముందు మెదిలింది. ఆమె సంతోషం ఎక్కువకాలం నిలవాలంటే నేను ఆరోగ్యంగా ఉండాలి కదా అనుకున్నాను. ఆ క్షణం నుంచి మద్యం ముట్టుకోలేదు. – కోటేశ్వరరావు
పన్నెండేళ్ల బాంధవ్యం మాది
పెళ్లినాటికి నాకు 62, ఆయనకు 72. ఆయనతో అంతకు ముందు పరిచయం లేదు, కానీ ఒకరి గురించి మరొకరు సర్దుబాటు చేసుకోవాల్సిన అవసరమే రాలేదు.
వయసురీత్యా ఎదురయ్యే ఆరోగ్యసమస్యలు తప్ప ఇతర అనారోగ్యాలేమీ లేవు. ఒకరికి అవసరమైనవి మరొకరు సమకూర్చి పెట్టుకుంటూ ఒకరినొకరు చంటిపిల్లల్లా చూసుకుంటున్నాం. ఈ జీవితం బాగుంది. రెండేళ్ల కిందట మా పిల్లలు బంధువులంతా కలిసి పదేళ్ల వేడుక కూడా చేశారు. – రాజేశ్వరి
– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment