మధుమేహగ్రస్థులు చక్కెరకు బదులు ఇది వాడొచ్చా? | Diabetes Using Agave Sugar And Syrup Instead Of Sugar | Sakshi
Sakshi News home page

సాధారణ చక్కెర కంటే.. కలబంద చక్కెర బెటరేనా?

Published Tue, Mar 16 2021 9:04 AM | Last Updated on Tue, Mar 16 2021 1:25 PM

Diabetes Using Agave Sugar And Syrup Instead Of Sugar - Sakshi

చక్కెర.. పరిమితంగా తీసుకున్నంతవరకు తియ్యగానే ఉంటుంది... ఒకస్థాయిని మించితే మాత్రం ఆరోగ్యానికి చేదే! పరిమితి దాటిన చక్కెర మధుమేహంలాంటి అనేక అనారోగ్య సమస్యలు సృష్టిస్తుంది. అందుకే ఆరోగ్యంపై అవగాహన ఉన్న చాలామంది చక్కెరను దూరం పెడుతున్నారు. మరికొందరు మితంగా తీసుకుంటున్నారు. ఇంకొందరు ప్రత్యామ్నాయం ఎంచుకుంటున్నారు. ఈ ప్రత్యామ్నాయాల్లో ప్రకృతి సిద్ధంగా లభించే తేనెతోపాటు కృత్రిమంగా తయారుచేస్తున్న స్టివియా, ఎరిత్రిటోల్, గ్జైలిటోల్‌ వంటివి ఉన్నాయి. ఈ కోవలోకి తాజాగా అగావె నెక్టర్, అగావె షుగర్‌ చేరాయి. మధుమేహగ్రస్థులు వీటిని సాధారణ చక్కెరకు బదులు వాడొచ్చని విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. అందులోని వాస్తవాలేంటో తెలుసుకుందామిలా.. 

అగావె అంటే?
అగావె అంటే మన దగ్గర కనిపించే కలబందలో ఒకరకం. ఉత్తర అమెరికాలోని మెక్సికోలో సుమారు 200కు పైగా కలబంద రకాలు కనిపిస్తాయి. వీటిలో రెండింటి నుంచి ఈ అగావె నెక్టర్‌(కలబంద తేనె), అగావె సుగర్‌ (కలబంద చక్కెర)ను తయారుచేస్తారు. అగావె నెక్టర్‌నే అగావె సిరప్‌గానూ వ్యవహరిస్తారు. ఇవి రెండే కాక కలబంద నుంచి ఆల్కహాల్‌ సైతం తయారుచేస్తారు. ఈ మూడింటి వినియోగం మెక్సికోలో శతాబ్దాలుగా ఉంది. 

సాధారణ చక్కెర కంటే మేలా?
అన్ని చెట్లు, మొక్కల్లాగే కలబందలోనూ మన ఆరోగ్యానికి మేలు చేసే కొన్ని మూలకాలు ఉన్నాయి. అయితే, మధుమేహ వ్యాధిగ్రస్థులు సాధారణ చక్కెరకు ప్రత్యామ్నాయంగా కలబంద చక్కెర, తేనె తీసుకోవడంపై అనేక వాదనలున్నాయి. నిజానికి అగావె కలబందలో ఫ్రక్టోన్స్‌ లాంటి ఆరోగ్యకర ఫైబర్స్‌ ఉంటాయి. ఇవి జీవక్రియ సరిగా జరగడంలో తోడ్పడతాయి. అయితే, ఈ కలబందను తేనె, చక్కెరగా మార్చే ప్రక్రియలో వాటిలోని ఫైబర్స్‌ విచ్ఛిన్నమవుతాయి. ఫలితంగా వాటి సహజ లక్షణం కోల్పోతాయి. సాధారణంగా ఆహారంలోని చక్కెర ఎంత వేగంగా రక్తంలోకి చేరుతుందనేదానికి గ్లైస్మిక్‌ ఇండెక్స్‌(జీఐ)ను కొలమానంగా పరిగణిస్తారు. కాబట్టి జీఐ అధికంగా ఉంటే చక్కెర వల్ల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. అయితే గ్లూకోజ్‌లాగా ఫ్రక్టోజ్‌ రక్తంలోని చక్కెర స్థాయిలను తక్కువ వ్యవధిలోనే పెంచలేదు.

అందువల్ల ఫ్రక్టోజ్‌ స్థాయి అధికంగా ఉన్న తీపి పదార్థాలను ఆరోగ్యకరమైనవిగా, మధుమేహ రోగులకు మేలు చేసేవిగా పరిగణిస్తారు. దీని ప్రకారం తక్కువ జీఐ ఉన్న కలబంద తేనె/చక్కెరలో ఫ్రక్టోజ్‌ ఎక్కువగానూ గ్లూకోజ్‌ తక్కువగానూ ఉండడంతో అది సాధారణకు చక్కెర కంటే మేలని ప్రచారంలోకి వచ్చింది. ఎలుకలపై చేసిన ఓ ప్రయోగం సైతం దీనిని బలపర్చింది. ఈ ప్రయోగంలో కొన్ని ఎలుకలకు సాధారణ చక్కెరను, మరికొన్నింటికి కలబంద చక్కెర ఇచ్చి 34 రోజుల తర్వాత వాటిని పరిశీలించారు. ఇందులో కలబంద చక్కెర తిన్న ఎలుకలు తక్కువ బరువు పెరగడంతోపాటు వాటి రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువున్నట్లు తేలింది. అయితే, ఈ ప్రయోగం కాలవ్యవధి స్వల్పం కావడంతో సాధారణ చక్కెరలోని గ్లూకోజ్‌.. రక్తంలోని సుగర్, ఇన్సులిన్‌ స్థాయిలను ప్రభావితం చేసినట్లు కలబంద చక్కెరలోని ఫ్రక్టోజ్‌ చేయకలేకపోయింది. అందువల్లే కలబంద తేనెలో తక్కువ జీఐ స్థాయి ఉన్నట్లు చూపుతోంది. 

సాధారణ చక్కెరలో, మొక్కజొన్న గింజలతో తయారుచేసే హై ఫ్రక్టోజ్‌ కార్న్‌ సిరప్‌(హెచ్‌ఎఫ్‌సీఎస్‌)లోనూ గ్లూకోజ్, ఫ్రక్టోజ్‌ చెరో 50శాతం ఉంటాయి. అయితే, కలబంద తేనె, చక్కెరలో దాదాపు 85శాతం ఫ్రక్టోజే ఉంటుంది. 
గ్లూకోజ్, ఫ్రక్టోజ్‌ లక్షణాలు చాలావరకు ఒకదానికొకటి సామీప్యంగా ఉన్నప్పటికీ మన శరీరంపై అవి చూపే ప్రభావాలు విభిన్నం. 
ప్రతిరోజు మనం తీసుకునే పండ్లు, కూరగాయలు, ఆహారంలో గ్లూకోజ్‌ తగినంత ఉంటుంది. ఒక్కోసారి మన శరీరం కూడా సొంతంగా కొంతమేర గ్లూకోజ్‌ను తయారుచేసుకుంటుంది. వాస్తవానికి అన్ని జీవకణాల్లోనూ గ్లూకోజ్‌ తప్పనిసరి మూలకం. 
మన శరీరంలోని ప్రతి కణం గ్లూకోజ్‌ను జీవక్రియకు ఉపయోగించుకోగలదు. కాలేయం మాత్రం ఫ్రక్టోజ్‌ను తన జీవక్రియకు వినియోగించుకుంటుంది. 

శరీరంలో ఫ్రక్టోజ్‌ అధికంగా చేరితే కాలేయంలో శోషణ ఎక్కువై అది కొవ్వుగా మారుతుంది. ఫలితంగా రక్తప్రసరణలో సమస్యలు ఏర్పడతాయి. జీవక్రియపై దుష్ప్రభావం చూపుతుంది. టైప్‌2 డయాబెటిస్, ఫాటీ లివర్‌ డిసీజ్‌ వస్తాయి. అనేక పరిశోధనలు దీన్ని రుజువు చేశాయి. 
శరీరంలో ఫ్రక్టోజ్‌ ఎక్కువైనప్పుడు కొవ్వు శాతం పెరిగి రక్తంలో సుగర్, ఇన్సులిన్‌ స్థాయిలు అధికమవుతాయి. ఫలితంగా మెటబాలిక్‌ సిండ్రోమ్, టైప్‌2 డయాబెటిస్‌కు దారితీస్తాయి. అలాగే చెడు కొవ్వు విపరీతంగా పెరిగిపోయి ఊబకాయానికి దారితీస్తుంది. 
అందువల్ల మధుమేహగ్రస్థులు కలబంద తేనె/చక్కెరకు బదులు స్టివియా, ఎరిత్రిటోల్, గ్జైలిటోల్‌ వంటి ప్రత్యామ్నాయ చక్కెర/సిరప్‌లను తీసుకోవడం ఉత్తమం.
సో.. మిగిలిన అన్ని రకాల చక్కెరలతో పోలిస్తే కలబంద చక్కెరలో అతి తక్కువ తీపిస్థాయిలు ఉన్నప్పటికీ ఆరోగ్యపరంగా సాధారణ చక్కెరే శ్రేష్టం!

చదవండి: 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement