నటి మసాబా గుప్తా జిహ్వచాపల్యం, తిండి పుష్టి గురించి అందరికీ తెలిసిందే! ఇంట్లో తయారు చేసే రకరకాల చిరుతిళ్లు అంటే ఆమెకు మహా మక్కువ. నోరూరించే రకరకాల తినుబండారాలకు నో చెప్పలేని బలహీనత ఆమెది. అయితే వాసికీ, రాశికీ మధ్య సమతూకాన్ని పాటించడం ఆమెకు తెలిసినంతగా మరెవరికీ తెలియదేమో అనిపిస్తుంది. డైట్ విషయంలో తాను 80/20 సూత్రాన్ని పాటిస్తానని చెప్పిన మసాబా గుప్తా ఇన్‌స్టాగ్రామ్‌లో కరోసెల్ అనే క్యాప్షన్ కింద తన రోజువారీ డైట్ గురించిన వివరాలు ఇలా పంచుకుంది.
‘‘80/20 రూల్ అనేది నా పాలిట బంగారం లాంటిది. ఇక్కడ 80 అనేది ప్రోటీన్లతో కూడిన బలవర్థకమైన ఆహారాన్ని సూచిస్తే, 20 నాకు నచ్చిన ఆహారాన్ని సూచిస్తుంది. (పేస్ట్రీలు, ఫ్రెంచ్ ఫ్రైస్, పిజ్జా బర్గర్‌లను సూచిస్తూ ఇమోజీలు పెట్టింది) వారంలో ఆరు రోజులూ నేను నా శరీరానికి ఏది అవసరమో అది ఇవ్వడానికే ప్రాధాన్యత ఇస్తాను. ఒకరోజు మాత్రం నా నాలుక ఏది కోరిందో అది తీసుకోవడానికే ప్రయత్నిస్తాను’’ అని చెప్పింది.
తాను రోజువారీ తీసుకునే డైట్ గురించిన వివరాలు ఇలా పంచుకుంది మసాబా. ‘‘ఉదయం ఆరున్నరకు టేబుల్ స్పూన్ జీలకర్ర, టేబుల్ స్పూన్ సోంపు గింజలను బాగా నమిలి తిని గ్లాసు గోరువెచ్చటి నీళ్లు తాగుతాను. నా దృష్టిలో ఇది అమృత జలం.
తొమ్మిది గంటలకు పెద్ద కప్పు నిండా ముసేలీ, బెర్రీలు. దాంతోపాటు వీలయితే అత్తిపళ్లు (రాస్‌బెర్రీ), నేరేడు పళ్లు. వర్క్ అవుట్స్ చేసిన తర్వాత పెద్ద గ్లాసు నిండా ప్రోటీన్ షేక్ తీసుకుంటాను. నానబెట్టిన ఐదు బాదం, ఐదు వాల్‌నట్స్ తీసుకుంటా. మధ్య మధ్యలో చల్లటి మజ్జిగ పిప్ చేస్తుంటా.
ఒంటిగంటకు ఆలూ లేదా బెండకాయ ఫ్రై, చికెన్ కర్రీ, రైస్, స్ప్రౌట్స్‌తో చేసిన సలాడ్‌తో సంతృప్తికరమైన లంచ్ చేస్తాను. 5 గంటలకు చికెన్ లేదా చీజ్, కూరగాయలతో టాపింగ్ చేసిన హోల్ వీట్ లేదా మల్టిగ్రెయిన్స్‌తో చేసిన పిజ్జా..
రెండు ఉడకబెట్టిన గుడ్లు, కొద్దిగా చికెన్ గ్రేవీతో ఏడింటికల్లా డిన్నర్ ఫినిష్ చేస్తాను. మొత్తం మీద నా డైట్‌లో కార్బ్స్ కంటే ్రపోటీన్లు ఎక్కువగా ఉండేలా చూసుకుంటాను’’ అంటూ ఆమె చేసిన పోస్టింగ్‌కు చాలా లైకులు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment