తోడా ఆదివాసీలు... నీలగిరుల్లో ఉంటారు. వారి జీవనం ప్రకృతి ఒడిలో ప్రకృతితో మమేకమై సాగుతుంది. వారి చేతిలో రూపుదిద్దుకున్న ఎంబ్రాయిడరీ డిజైన్‌లు కూడా వారు నివసిస్తున్న ప్రకృతి సౌందర్యాన్ని ప్రతిబింబిస్తాయి. పూలు, లతలు, పౌరాణిక గాథలు కుట్టులో రూపుదిద్దుకుంటాయి. తెల్లటి వస్త్రం, గోధుమ వర్ణంలోని వస్త్రం మీద నల్లటి దారాలతో ఈ ఎంబ్రాయిడరీ చేస్తారు. సాధారణంగా ఎంబ్రాయిడరీ చేస్తే ఒక వైపు చక్కటి డిజైన్ కనిపిస్తే వెనుక వైపు దారాల ముడులుంటాయి. తోడా ఆదివాసీలు చేసే ఎంబ్రాయిడరీలో రెండు వైపులా డిజైన్ అందంగా కనిపిస్తుంది.
ఇలాంటి అందమైన పనితనం కొండలకే పరిమితమైపోతే ఎలాగ అనుకున్నారు షీలాపావెల్. నీలగిరుల్లో తోడా ఆదివాసీలు నివసించే కుగ్రామాలన్నింటిలో పర్యటించారామె. వారిని స్వయం సహాయక బృందంగా సంఘటితపరిచారు. ‘షాలోమ్ ఊటీ’ పేరుతో తోడా ఆదివాసీ మహిళలను ఒక వేదిక మీదకు తీసుకువచ్చారు షీలా పావెల్. ఇప్పుడు తోడా ఆదివాసీ మహిళలు వారానికి ఐదు వందల నుంచి ఐదు వేల రూపాయలు సంపాదించుకోగలుగుతున్నారు. ‘వారి చేతిలో ఉన్న కళ గొప్పతనం వారికి తెలియజేశాను, ఆ కళను ప్రపంచానికి పరిచయం చేశాను’ అన్నారు షీలా పావెల్.
సాధికారత కుట్టారు
షీలా పావెల్ వయసు 59. తమిళనాడులోని ఊటీలో నివసిస్తారు. ఆమె 2005లో షాలోమ్ ఊటీ స్వయం సహాయక బృందాన్నిప్రారంభించారు. అప్పుడు 250 మందితో మొదలైన బృందంలో ఇప్పుడు 150 మంది చురుగ్గా ఉన్నారు. అప్పటి సంగతులను తెలియచేస్తూ ‘‘తోడా ఆదివాసీ మహిళల చేతిలో ఏం నైపుణ్యం ఉందో తెలియదు. అందమైన ఎంబ్రాయిడరీతో చక్కటి శాలువాలు వాళ్ల చేతిలో రూపుదిద్దుకోవాల్సిందే. ఈ మహిళలు తాము ఎంబ్రాయిడరీ చేసిన శాలువాలను సమీపంలోని ఊటీ పట్టణానికి తెచ్చి అమ్ముకునేవారు. ఊటీలో దుకాణాల వాళ్లు తక్కువ ధరకు కొని వాటిని పర్యాటకులకు మంచి ధరకు అమ్ముకునేవారు.
ఈ మహిళలకు మరొక ప్రపంచం తెలియకపోవడంతో ఆ వచ్చిన డబ్బుతో సంతృప్తి పడేవారు. వారిని సంఘంగా ఏర్పరిచి, వారు తయారు చేసిన శాలువాలు, కీ చైన్‌లు, మఫ్లర్‌లు, పర్సులు వంటి వాటిని తమ బృందం పేరుతో లేబుల్ అతికించి అమ్మడం మొదలు పెట్టారు. వ్యవస్థీకృతంగా లేని పనిని, కళ చేతిలో ఉన్న వారిని వ్యవస్థీకృతం చేయడమే నేను చేసింది. అప్పట్లో షాల్ కోసం వాళ్లు తీసుకునే క్లాత్‌కంటే కొంచెం మెరుగైన క్లాత్ కొని ఇవ్వడం, మార్కెటింగ్ మెళకువలు నేర్పించడం వంటివి చేశాను. గతంలో ఐదు వందలకు అమ్మిన శాలువాలను ఇప్పుడు వెయ్యి రూపాయలకు అమ్మగలుగు తున్నారు.
నా కళ్లముందే వారి జీవన స్థాయులు పెరిగాయి. నేను కోరుకున్న లక్ష్యాలు రెండూ నెరవేరాయి. వీరి కళ విలువ వీరికి తెలిసింది, వీరి కళ గురించి బయటి ప్రపంచానికి తెలిసింది. క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో అనుసంధానం చేయగలిగాను. తోడా ఎంబ్రాయిడరీ వస్తువులు చెన్నై, బెంగళూరు, ముంబయి, హైదరాబాద్‌లో కూడా లభిస్తున్నాయిప్పుడు.
కళ కొనసాగాలి
ఈ కళ ఎదుర్కొంటున్న మరో చాలెంజ్ ఏమిటంటే... కొత్తతరం ఈ ఎంబ్రాయిడరీ నేర్చుకోవడం లేదు. చదువుకుని ఉద్యోగాలకు వెళ్లడం మంచి పరిణామమే. కానీ ఈ కళను కూడా నేర్చుకోవచ్చు కదా అనిపిస్తుంది. తోడా ఆదివాసీల జనాభా పదమూడు వందలుంటే అందులో ఏడు వందల వరకు మహిళలున్నారు. డెబ్బై ఏళ్ల వాళ్లతో కలుపుకుంటే ఈ ఎంబ్రాయిడరీ వచ్చిన వాళ్లు మూడు వందల లోపే ఉన్నారిప్పుడు. ఇతరులకు నేర్పించే ఆలోచనలో ఉన్నాను’’ అని తెలియ చేశారు షీలా పావెల్.
Comments
Please login to add a commentAdd a comment