మంచిమాట
చీరలు కట్టే రోజుల్లో వాటికి కొంగు ఉండేది. దానికి ఎన్నో ప్రయోజనాలు ఉండేవి. గుండెలని కప్పటంతో పాటు, అవసరమైతే తన చేతులు తుడుచుకోవటం, దేనినైనా గబగబా తుడిచి శుభ్రం చేయటం, కోపం లేదా పౌరుషాన్ని ప్రదర్శించటానికి కొంగుని చీరకట్టులో దోపి ముందుకు రావటం తరచుగా కనపడే ప్రయోజనాలు.
అలసిపోతే మొహం తుడుచుకోవటానికి, చెమట పడితే విసురుకోవటానికి, వీలైతే పక్కనున్న భర్తకో, అత్తగారికో, పిల్లలకో కూడా ఆ భోగాన్ని కలిగించటానికి కొంగు పనికి వస్తుంది. పిల్లలు మొహం తుడుచుకోవటానికి, అన్నం తిని చేతులు కడుక్కున్నాక తుడుచుకోటానికి కూడా ఉపయోగ పడుతుంది. అయితే మగవారికో? వారు కూడా ఉత్తరీయం పైన వేసుకునే వారు. లేదంటే కనీసం తుండు గుడ్డ. ఇప్పుడు రెండూ కనపడటం అపురూపమైపోయాయి. ఇవి రెండు చేసే పనులు ఒకటే అయినా, చీర కొంగు చేసే పనులు ప్రత్యేకంగా కొన్ని ఉన్నాయి.
ఇంటితాళాలు, ఇనుపపెట్టె తాళాలు ఒకప్పుడు ఇంటావిడ కొంగుచివర ఉండేవి. ముఖ్యంగా బెంగాలీ స్త్రీలకి పెద్ద తాళాల గుత్తి కొంగు చివర కట్టి ఉంటుంది. అది వారు వంగ దేశపు వారు అనటానికి గుర్తు. కొంగున కట్టారు అంటే ఎంతో ముఖ్యమైనది అని అర్థం. గుడిలో ఇచ్చిన అక్షతలు కావచ్చు, ప్రసాదం కావచ్చు, ఏదైనా విలువైన తాయెత్తో, రక్షరేకో, మరేదైనా కావచ్చు ఇల్లాలి కొంగులో ఒదిగి దాక్కుంటాయి.
అంతేకాదు, పనికిరానివి, ఉన్నచోట పడేయ కూడనివి ఉంటే కొంగులో దాక్కుంటాయి. అంటే, విరిగిన గోళ్ళు, రాలి పడిన వెంట్రుకలు, చిన్న చిన్న గాజుముక్కలు, ముళ్ళు... ఇట్లాంటి వాటిని కూడా కొంగు భద్రంగా జాగ్రత్త చేస్తుంది చెత్తలో వేసేవరకు.
కొంగుకి ఎంతటి ్రపాముఖ్యమో చూడండి – వివాహ సమయంలో బ్రహ్మముడి వేయటానికి ఇద్దరి కొంగులని కలుపుతారు. అంటే, ఒకరి కొంగులో మరొకరు ఉండమని. ఒకరికొకరు కొంగు బంగారం. కొంగు బంగారం అంటే అందుబాటులో ఉండే విలువైన, అవసరానికి ఆదుకొనేది అని అర్థం. ఒకరి అవసరాలు, కష్టసుఖాలు మరొకరు అడగనవసరం లేకుండానే పంచుకుంటూ, తీర్చుకుంటూ జీవితం గడపాలన్నది సూచన.
అందుకే ఎవరైనా భార్యని అపురూపంగా చూస్తుంటే – ఆవిడ భర్తని కొంగున కట్టుకుంది అంటారు. లక్ష్మీదేవే దానికి పెద్ద ఉదాహరణ. గజేంద్రుడి కుయ్యాలించిన విష్ణువు ఉన్న వాడు ఉన్నట్టుగా బయలుదేరితే లక్ష్మీదేవి వెంట వెళ్ళవలసి వచ్చింది.
ఎందుకంటే ఆవిడ కొంగు ఆయన చేతిలో ఉన్నది అని వర్ణించారు. ‘‘వివాద ్రపోత్థిత శ్రీ కుచోపరి చేలాంచల మైన వీడడు’’ అన్నారు పోతన గారు. అసలు విషయం అది కాదు. విష్ణువుని లక్ష్మీదేవి కొంగున కట్టుకుంది. ఆయన కదిలితే తానున్న కొంగు కూడా కదిలింది. పోనీ, ఆయనే పట్టుకున్నాడు అనుకుందాం. అప్పుడైనా విష్ణువు లక్ష్మీదేవి కొంగు విడవడు అనే కదా అర్థం.
భర్తని తానే కొంగున కట్టుకున్నా, కొంగుని వదలని వారూ ఉన్నారు. వారే సంతానం. కొంగు పట్టుకుని తిరుగుతూ ఉంటారు. ఎవరైనా కొత్తవారు వచ్చినా, సిగ్గు కలిగినా అమ్మ కొంగు చాటున దాక్కుంటూ ఉంటారు. అది వారికి రక్షణ. పసితనంలో పాలు తాగుతున్నపుడు,
(తల్లిపాలు అయినా, పోతపాలు అయినా) అందరి చూపు పడకుండా అడ్డుగా ఉండే అమ్మ కొంగు, ఎండ, వాన, చలి, గాలి మొదలైనవి రాగానే తమ పైన చేరి వాటి బాధ నుండి రక్షణ కలిగించే అమ్మ చీర కొంగు తమకి ఎప్పుడు భద్రతా భావన కలిగిస్తుంది అని నమ్మకం. ‘‘కొంగు చాటు బిడ్డ’’ అనే నానుడి అందుకే వచ్చి ఉంటుంది.
– డా. ఎన్.అనంతలక్ష్మి
Comments
Please login to add a commentAdd a comment