చనిపోయే క్షణాల్లో మన మెదడులో జీవితంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలు ప్లే అవుతాయని తాజా అధ్యయనంలో తేలింది. ఆ సమయంలో కూడా మెదడు కలలు కనే తరంగాలను ఉత్పత్తి చేసిందన్నారు. ఈ లోకాన్ని విడిచిపెట్టే ముందు చివరి క్షణాల్లో మనతో ఉండే ఆలోచనలను మరింత లోతుగా అర్థం చేసుకోనే ప్రయత్నంలో భాగంగా 87 ఏళ్ల వ్యక్తి మొదడు తరంగాలను శాస్త్రవేత్తలు పరిశీలించారు.
ఆ వ్యక్తి మూర్చ వ్యాధితో బాధపడుతున్న రోగి అని, చనిపోవడానికి కొన్ని క్షణాల ముందు గుండెపోటు వచ్చినట్లు తెలిపారు. కలలు కంటున్నప్పుడు లేదా ఏవైనా విషయాలను గుర్తు చేసుకుంటున్నప్పుడు మెదడులో ఎలాంటి తరంగాలు జనిస్తాయో అచ్చం అలాంటి తరంగాలే చనిపోవడానికి 30 సెకన్ల ముందు సదరు వ్యక్తి మెదడులో పరిశోధకులు గుర్తించారు. జీవితం చివరి క్షణాల్లో మరచిపోలేని అన్ని విషయాలను గుర్తు చేసుకోవడానికి ఈ తరంగాలు సంకేతం కావొచ్చని ఏజింగ్ న్యూరోసైన్స్ మ్యాగజైన్‌లో ప్రచురితమైన అధ్యయనంలో వివరించారు.
మరణిస్తున్న మెదడులో మేం అనుకోకుండా ఇలాంటి తరంగాలను రికార్డు చేయగలిగామని పరిశోధనలో పాలుపంచుకున్న డాక్టర్ అజ్మన్ జెమ్మర్ చెప్పారు. వాస్తవానికి తాము ఇలా మెదడులోని తరంగాలను రికార్డు చేయాలని భావించలేదని, అనుకోకుండా ఇదంతా జరిగిందని అన్నారు. ఆఖరి నిమిషంలో మధుర క్షణాలు లేదా మనకిష్టమైన వారితో గడిపిన క్షణాలు గుర్తు చేసుకోవచ్చేమో అని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలా గుర్తుచేసుకోవాలనే ఘటనలు ఒక్కొక్కరికి ఒక్కోలా ఉండొచ్చని అన్నారు.
మెదడుకు రక్త సరఫరా నిలిచిపోవడానికి 30 సెకన్ల ముందు.. ఏకాగ్రత పెట్టడం, కలలు కనడం, ఏవైనా సంగతులను గుర్తు చేసుకోవడం లాంటి సమయంలో మెదడులో ఎలా అయితే తరంగాలు జనిస్తాయో అవే ఆ టైంలో కూడా ఉత్పత్తవ్వడం గుర్తించామని న్యూరో సర్జన్ జెమ్మర్ అన్నారు. తరంగాలు 30 సెకన్లపాటు కనిపించాయి. ఆ తర్వాత గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. అంటే సదరు వ్యక్తి మరణించాడని అర్థం.
చనిపోయే ముందు మన జీవితంలో మరుపురాని సంఘటనలు చివరిసారిగా మన మెదడులో ప్లే అవుతాయని ఈ కేసులో తేలిందని అన్నారు. ఈ పరిశోధన సరిగ్గా ప్రాణం ఎప్పుడు? ఎలా పోతుంది? గుండె ఎప్పుడు కొట్టుకోవడం ఆగిపోతుంది? లేదా మెదడు ఎప్పుడు పనిచేయడం ఆగిపోతుంది? లాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునేందుకు ఈ అధ్యయనం దోహదపడుతుందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment