పాతికేళ్లకు పైగా ఫిట్‌నెస్ రంగంలో తనదైన ముద్ర వేస్తున్నారు యాస్మిన్ కరాచీవాలా. బాలీవుడ్ తారలకు ఫిట్‌నెస్ ట్రైనర్‌గా ఉన్న యాస్మిన్‌కి ముంబైతో పాటు విదేశాల్లోనూ ఫిటెనెస్ స్టూడియోలు ఉన్నాయి.ఫిట్‌నెస్‌కు సంబంధించిన తన అనుభవాలను పుస్తకాల రూపంలో తీసుకు వచ్చి రైటర్‌గానూ గుర్తింపు పొందారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన రివల్యూషనైజ్ యువర్ వర్కౌట్ కార్యక్రమానికి వచ్చిన ఈ ముంబై ఫిట్‌నెస్ ట్రైనర్ ‘53 ఏళ్ల వయసులోనూ చాలా యంగ్ అండ్ ఎనర్జిటిక్‌గా కనిపిస్తున్నారు ఆ సీక్రెట్ ఏంటో మాకూ చెప్పండి’ అంటే ఎన్నో విషయాలను మన ముందుంచారు.
నంబర్ వన్ ట్రైనర్
కత్రీనా కైఫ్, దీపికా పదుకొణె, కరీనా కపూర్.. వంటి ప్రముఖ బాలీవుడ్ తారలకు నంబర్‌వన్ ఫిట్‌నెస్ ట్రైనర్ యాస్మిన్ కరాచీవాలా. జర్మన్ పిలేట్స్ కాన్సెప్ట్‌ను మన దేశంలో మొదటిసారి ప్రవేశపట్టి, బిఎఎస్‌ఐ సర్టిఫికెట్ పొందింది. ఎన్నో ఫ్యాషన్ అండ్ బ్యూటీ అవార్డ్‌లను సొంతం చేసుకోవడంతో పాటు వరల్డ్ ఉమెన్ లీడర్‌షిప్ అవార్డ్‌ను అందుకున్న ఘనత యాస్మిన్‌ది. స్కల్ప్›్ట అండ్ షేప్, పర్‌ఫెక్ట్ 10 పేరుతో తీసుకొచ్చిన పుస్తకాలు పాఠకులకు ఫిట్‌నెస్ జ్ఞానాన్ని అందించడంలో ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి.
‘‘(నవ్వుతూ) నాకు ముగ్గురు పిల్లలున్నారు. పెద్దబ్బాయికి 26, చిన్నబ్బాయికి 23 ఏళ్లు. అమ్మాయికి పెళ్లైంది. 26 ఏళ్లుగా వ్యాయామంపై దృష్టి పెడుతున్నాను. వ్యాయామాలు నేర్పిస్తున్నాను. సరైన ఆహారం, సరైన వ్యాయామం, సరైన జీవనశైలిని అలవర్చుకుంటే ఎవ్వరైనా యంగ్ అండ్ ఎనర్జిటిక్‌గా ఉండచ్చు. ఫిట్‌నెస్ అనేది కేవలం బరువు తగ్గించుకోవడానికి ఉపయోగించే మ్యాజిక్ పిల్ కాదు షాప్‌కి వెళ్లి కొనుక్కోవడానికి. ఫిట్‌గా మారాలంటే కృషి చేయాల్సిందే.
కృషికి మూలం
నన్ను చూసి మా అబ్బాయిలు ఇద్దరూ ఫిట్‌నెస్ పట్ల ఆసక్తి పెంచుకున్నారు. వాళ్లూ ఈ రంగంలో బిజీగా ఉన్నారు. నచ్చింది చేయడం మన జీవనశైలి అవుతుంది. ఇష్టం లేనిది చేయడం భారం అనిపిస్తుంది. ఫిట్‌నెస్ అనేది ట్రెండ్ కాదు. అదొక జీవన విధానం. మనం దానిని ఎలా తీసుకుంటే, అది మనల్ని అలా మార్చేస్తుంది. నేను ఫిట్‌నెస్ ట్రైనర్‌గా ఉండాలని ఎప్పుడూ ప్లాన్ చేసుకోలేదు. నా చిన్నతనం నుంచి నేను గమనించినవాటిలో మా నాన్న రోజూ వాకింగ్, అమ్మ యోగా చేయడం చూసేదాన్ని. కానీ, (నవ్వుతూ) నేను మాత్రం చేసేదాన్ని కాదు.
ఎవ్వరూ ఇష్టపడని బద్దకిష్టులలో నేనూ ఒకరిగా ఉండేదాన్ని. డిగ్రీ పూర్తయిన కొన్నాళ్లకు ఓ రోజు నా ఫ్రెండ్ హెల్త్ క్లబ్‌కి తీసుకెళ్లింది. అయిష్టంగానే అక్కడికి వెళ్లాను. ఆ హెల్త్‌క్లబ్‌కు వెళ్లే ముందు వరకు ఎన్నడూ వ్యాయామం చేసింది లేదు. ఏదో ఒక సాకుతో ఫిట్‌నెస్ యాక్టివిటీస్‌కి దూరంగా ఉండేదాన్ని. అలాంటిది సరదాగా హెల్త్ క్లబ్‌లో చేసిన ప్రయత్నాలు దారిలో పడేలా చేశాయి. అప్పటినుంచి ఇన్నేళ్లుగా నన్ను నేను మలుచుకుంటూ ఇంకొందరిని మారుస్తున్నాను.
చురుకైనా మార్పులంటే..
ఫిట్‌గా ఉండటానికి, వ్యాయామంప్రారంభించాలంటే ముందు మన శరీర బలాన్ని అదేవిధంగా పరిమితులను అర్థం చేసుకోవాలి. తప్పనిసరిగా కృషి చేయాలనే జిజ్ఞాసను, నిబంధననూ బ్రెయిన్‌కు అందించాలి. మనల్ని మనం ఎలా చూసుకోవాలను కుంటున్నామో ముందు దానిని గుర్తించాలి. అప్పుడు సరైన కృషి చేయగలం. కొందరు జిమ్‌కి వెళితే వ్యాయామం సాధ్యం అనుకుంటారు.
ఇంకొందరు నాకు సినిమా తారల్లాంటి శరీరం కావాలి అని కలలు కంటుంటారు. ఇలాంటివారు తమ రోజువారి యాక్టివిటీలో మార్పులు చేసుకోవాలి. బద్ధకం పోవడానికి, చురుగ్గా మారడానికి స్పోర్ట్స్ హాబీని పెంచుకోవాలి. ఫిట్‌నెస్, వాకర్స్ .. వంటి గ్రూపుల్లో చేరాలి. ఏదోవిధంగా ప్రతిరోజూ చురుగ్గా ఉండేలా మార్పులు చేసుకోవాలి. వీటితోపాటు రోజువారీ వదుల్చుకోలేని కొన్ని విషాలకు దూరంగా ఉండాలి.
ఎలాంటి విషాలు..
చక్కెర క్యాన్సర్‌కు ఆహారం. అంతేకాదు, అనేకవ్యాధులకు ప్రధాన కారణం కూడా. చాలా మంది ఉదయాన్నే షుగర్ కలిపిన టీ లేదా కాఫీతో రోజును మొదలుపెడతారు. అదే అనారోగ్యాలకు దగ్గర చేస్తుంది. అందుకని, ముఖ్యంగా రిఫైన్డ్ షుగర్‌ని పూర్తిగా దూరం పెట్టాలి. దీనికి బదులు బెల్లం, తేనె తీసుకోవచ్చు. ఇక నూనెలో వేయించిన సమోసాలు, బోండాలు.. వంటి వేపుడు పదార్థాలు తీసుకోకూడదు. వేడుకల సమయాల్లో ‘ఏముందిలే, ఈ ఒక్కరోజుకు అంటూ ఐస్‌క్రీమ్, షుగర్ బేస్డ్ వంటి ఎన్నో పదార్థాలు తీసుకుంటూ ఉంటారు. ఇవన్నీ శరీరానికి హాని చేసేవే.
సవాళ్లను అధిగమించాలంటే..
నాకు ముంబై, గుర్గావ్, ఢిల్లీ, ఇండోర్, ఢాకా, దుబాయ్‌లలో ఫిట్‌నెస్ స్టూడియోలు ఉన్నాయి. ఇంకా మరికొన్ని ఫిట్‌నెస్ స్టూడియోలుప్రారంభించాలనే లక్ష్యంగా ఉన్నాను. వ్యాయామం మొదలుపెట్టిన రోజున ఇవేవీ అప్పుడు అనుకోలేదు. బలం ఎంత అనేది బరువులు ఎత్తడంలో మాత్రమే కాదు మన లోపల ఉన్న శక్తిని గుర్తించాలి. అప్పుడు సవాళ్లను అధిగమించడం కూడా సులువు అవుతుంది.
మెరుగైన ఆరోగ్యం, ఫిట్‌నెస్ మనల్ని శక్తి–అభివృద్ధి వైపుగా నడిపిస్తుంది. ఒక్కరోజులో ఏదీ మారదు. మనం ఎంచుకున్న మార్గంలో నిరంతరం కృషి చేస్తుంటే విజయం సొంతం అవుతుంది. శారీరక వ్యాయామం మైండ్‌ను కూడా చురుగ్గా ఉంచుతుంది కాబట్టి వాయిదా వేయకుండా ఈ రోజే దినచర్యలో భాగం చేసుకోండి’’ అని వివరించారు ఈ ఫిట్‌నెస్ ట్రైనర్. – నిర్మలారెడ్డి ఫొటోలు: నోముల రాజేష్ రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment