ఇరవై రెండు సంవత్సరాల వయసులో... ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన కంటెంట్ క్రియేషన్ ప్లాట్‌ఫామ్‌కు బిజినెస్ హెడ్‌గా పనిచేస్తున్నాడు కిషన్ పన్‌పాలియా. ఇరవై నాలుగు సంవత్సరాల వయసులోనే ఆర్టిస్ట్‌గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది రితిక పాండే. ఈ ఇద్దరు తాజాగా... ‘ఫోర్బ్స్ 30 అండర్ 30’ 2023 జాబితాలో చోటు సంపాదించారు...
చిన్న వయసులోనే మోస్ట్ పాపులర్ కంటెంట్ క్రియేషన్ ప్లాట్‌ఫామ్ ‘పెప్పర్ కంటెంట్’కు బిజినెస్ హెడ్‌గా పెద్ద బాధ్యతలు నిర్వహిస్తున్నాడు కిషన్ పన్‌పాలియా
ఒక్కసారి ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళితే...
‘ఇండియా కాటన్ సిటీ’గా పేరుగాంచిన మహారాష్ట్రలోని అకోల. కిషన్ ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు. ‘పాకెట్ మనీ కోసం తల్లిదండ్రుల మీద ఆధారపడడం ఎందుకు? నేను సంపాదించలేనా!’ అని ఆలోచించి రంగంలోకి దిగాడు.
తన ఐడియా చెప్పి స్నేహితులు బంధువులను ఒప్పించాడు. అందరూ కలిసి స్క్రాప్ కొని అమ్మడం మొదలు పెట్టారు. పాకెట్ చాలనంత మనీ వచ్చి చేరింది!
కట్ చేస్తే...
బిట్స్ పిలానిలో చదువుకునే రోజుల్లో కిషన్‌కు మంచి గుర్తింపు ఉండేది. దీనికి కారణం కాలేజీ ఈవెంట్ కోసం లక్షా పాతికవేల స్పాన్సర్‌షిప్‌ను సంపాదించడం. నిజానికి కాలేజి ఈవెంట్‌కు పాతికవేలకు మించి స్పాన్సర్‌షిప్ వచ్చేది కాదు. మొదటి సంవత్సరంలో ఉన్నప్పుడు తన సీనియర్స్ అనిరుద్ సింగ్లా, రిషబ్ శేఖర్‌లు ‘పెప్పర్ కంటెంట్’ పేరుతో కంటెంట్ క్రియేషన్ ప్లాట్‌ఫామ్ స్టార్ట్ చేశారు. కిషన్‌ను కూడా తమతో కలుపుకున్నారు.
మొదటిసారిగా ఆటోమోటివ్ పార్ట్స్ డీలర్ నుంచి ‘కూల్ కంటెంట్’ ఆఫర్ వచ్చింది. రాసే వారి కోసం చూశారు. పదానికి పదిహేను పైసలు అంటే ఎవరు మాత్రం వస్తారు!
దీంతో తప్పనిసరి పరిస్థితులలో తామే కంటెంట్ పనిలోకి దిగారు. పదిరోజుల్లో 300 పీస్‌లు రాశారు. ఇక అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు.
ప్రస్తుతం ‘పెప్పర్ కంటెంట్’ 2,500 మంది కస్టమర్‌లతో, 1.2 లక్షల మంది కంటెంట్ క్రియేటర్స్‌తో పనిచేసింది. మన దేశంలో లార్జెస్ట్ ఫ్రీలాన్స్ క్రియేటర్స్ ప్లాట్‌ఫామ్‌గా ఎదిగింది. బిజినెస్ సెన్స్, రెవెన్యూ మేనేజ్‌మెంట్‌లో తనదైన ప్రత్యేకతను సృష్టించుకున్న కిషన్‌ను తన ‘సక్సెస్ మంత్రా’ గురించి అడిగితే– ‘నిరంతర సాధన’ అంటాడు.
వారణాసిలో పుట్టి.. ఆఫ్రికాలో పెరిగి
వారణాసిలో పుట్టిన రితిక పాండే ముంబై రావడానికి ముందు ఆఫ్రికాలోని వివిధ ప్రాంతాలలో పెరిగింది. శ్రిష్టి మణిపాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్, డిజైన్ అండ్ టెక్నాలజీలో చదువుకుంది. వేల్స్ (యూకే)లోని ఒక సిటీలో కొంతకాలం పురాణాలు, సైన్స్–ఫిక్షన్ ఆధారంగా కళాసాధన ప్రారంభించింది.
అక్కడి నుంచి ఇండియాకు తిరిగి వచ్చిన తరువాత హిమాచల్‌ప్రదేశ్‌లోని మారుమూల ప్రాంతాలకు ప్రయాణించింది. ప్రకృతి ప్రపంచంతో స్నేహం చేసింది. తనలో సృజనాత్మకమైన కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించుకుంది.
థీమ్ ఏమిటంటే
‘విశ్వవిద్యాలయాలు, గొప్ప పుస్తకాల నుంచి మాత్రమే కాదు ప్రకృతి ప్రపంచం నుంచి కూడా ఎంతో నేర్చుకోవచ్చు. అందుకే ఎన్నో మారుమూల ప్రాంతాలకు వెళ్లాను. ఇది నిరంతరమైన ప్రయాణం. నిరంతర సాధన. ఆర్టిస్ట్‌లు నేర్చుకోవడానికి ప్రకృతిలోనే ఎన్నో పాఠాలు ఉన్నాయి’ అంటుంది రితిక.
రితిక వర్ణచిత్రాలలో మనుషులు కనిపిస్తారు. మొక్కలు, జంతువులు కనిపిస్తాయి. స్థూలంగా చెప్పాలంటే హ్యూమన్, నాన్–హ్యూమన్‌కు సంబంధించి రిలేషన్ అనే థీమ్ కనిపిస్తుంది.
‘గ్రోస్‌వెనర్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన రితిక ఆర్ట్‌వర్క్ సోలో షోకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఎంతోమంది ప్రైవేట్ ఆర్ట్ కలెక్టర్స్ ఆసక్తి ప్రదర్శించారు’ అంటున్నారు లండన్‌లోని గ్రోస్‌వెనర్ గ్యాలరీ డైరెక్టర్ చార్లెస్ మూర్.
Comments
Please login to add a commentAdd a comment