
ఇది డైట్‌ల కాలం. ‘ఈ తిండి తింటే ఆ వ్యాధి దూరం.. ఈ ఆహారం అన్నిటికంటే శ్రేష్టం’ అంటూ కొత్త కొత్త డైట్ విధానాలు తామరతంపరగా ఇప్పటికే ఎన్నో పుట్టుకొచ్చాయి/పుట్టుకొస్తూనే ఉన్నాయి. అలాంటి కోవలోకి తాజాగా చేరిందే గ్లుటెన్ ఫ్రీ డైట్.
గ్లుటెన్ అంటే..
సాధారణంగా గోధుమల్లో బంకగా ఉండే పదార్ధాన్ని గ్లుటెన్ అంటారు. గోధుమలు/మైదాతో తయారుచేసిన ఏ ఆహార పదార్థంలోనైనా గ్లుటెన్ తప్పనిసరిగా ఉంటుంది. ముఖ్యంగా వీటిని ఉపయోగించి తయారుచేసే పిజ్జాలు, పేస్ట్రీలు, కేకులు, స్వీట్సు, కొన్ని రకాల బ్రెడ్లలో అధికంగా ఉంటుంది. ఈ పదార్థాలు ఎక్కువగా తినడం సిలియాక్ వ్యాధికి కారణమని, దీని నుంచి బయటపడాలంటే గ్లుటెన్ రహిత ఆహారం తీసుకోవాలన్నదే గ్లూటెన్ ఫ్రీడైట్ కాన్సెప్ట్.
సిలియాక్ వ్యాధి అంటే..
అజీర్తి, కడుపు ఉబ్బరం, నీరసం, పొత్తి కడుపులో నొప్పి, అతిసారం, ఎముకల బలహీనత లక్షణాలను సిలియాక్ వ్యాధిగా పేర్కొంటారు. గోధుమలు, బార్లీ, మైదాతో తయారుచేసిన ఆహారం తీసుకోవడం వల్ల అందులోని గ్లుటెన్ జీర్ణశక్తి ప్రక్రియపై దుష్ప్రభావం చూపుతుందని, ఫలితంగా పైన చెప్పిన అనారోగ్య సమస్యలకు కారణమవుతుందని అంటున్నారు. ఒక వైద్య సర్వే ప్రకారం ప్రస్తుతం ప్రపంచ జనాభాలో సుమారు ఒకశాతం జనాభా సిలియాక్ వ్యాధితో బాధపడుతున్నారు.
నివారించాలంటే..
గ్లుటెన్ ఫ్రీ (గ్లుటెన్ రహిత ఆహారం) డైట్ అనుసరించడం ద్వారా సిలియాక్ వ్యాధికి చెక్ పెట్టొచ్చనేది ఈ డైట్‌ను ఫాలో అవుతున్న వారి మాట. అమెరికాలో కన్జూమర్ రిపోర్ట్ నేషనల్ రీసెర్చ్ సెంటర్(సీఆర్‌ఎన్‌ఆర్‌సీ) వెలువరించిన నివేదిక ప్రకారం సుమారు 63శాతం మంది అమెరికన్లు గ్లుటెన్ ఫ్రీ డైట్ ను నమ్ముతున్నట్లు తేలింది. ఈ డైట్‌ను అనుసరించడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపర్చుకోవచ్చని వారు భావిస్తున్నట్లు గుర్తించారు. అలాగే గ్లుటెన్ కారణంగా వచ్చే సిలియాక్ వ్యాధినీ అడ్డుకోవచ్చని నమ్ముతున్నట్లు తేల్చారు.
ఎందుకింత ఆదరణ?
వివిధ రకాల కారణాల వల్ల గ్లుటెన్ ఫ్రీ డైట్‌కు ఊహించిన దానికంటే ఎక్కువ ఆదరణ దక్కుతోంది. ఈ డైట్‌ను ఒకసారి ప్రయత్నించి చూద్దామనే సహజమైన ఉత్సుకత, సిలియాక్ వ్యాధిగ్రస్థులకు గ్లుటెన్ ప్రమాదకరమైతే నాకు కూడా ప్రమాదమేమో అనే ఆలోచన, ఈ డైట్‌ను క్యాష్ చేసుకోవాలనుకునే కొందరి మార్కెటింగ్ నైపుణ్యం తదితర కారణాలు కావచ్చు.
నష్టాలు లేవా?
నిజానికి ఏ డైట్‌లోనైనా కొన్ని దుష్ప్రభావాలు ఉంటాయి. ఇదీ అందుకు అతీతం కాదు. ముఖ్యంగా ఈ డైట్ అందరికీ మేలు చేయకపోవచ్చు. కొత్త అనారోగ్య సమస్యలూ తీసుకురావచ్చు. ఇంకా చెప్పాలంటే ఇంకా ఎక్కువ మూల్యం చెల్లించుకోవాల్సి రావచ్చు. ఒక సర్వే ప్రకారం గ్లుటెన్ ఫ్రీ డైట్ అనుసరించేవాళ్లు చెబుతున్నదేంటంటే సాధారణ ఆహారం కంటే గ్లుటెన్ లేని పదార్థాల్లో ఎక్కువ న్యూట్రిషన్స్, అధిక మినరల్స్, విటమిన్లు ఉన్నాయి. కానీ, నిజానికి సాధారణ ఆహార పదార్థాల కంటే గ్లుటెన్ ఫ్రీ పదార్థాల్లో తక్కువ ఫోలిక్ ఆసిడ్, ఐరన్, ఇతర న్యూట్రిషన్స్ ఉన్నాయి. అలాగే గ్లుటెన్ రహిత ఆహార పదార్థాల్లో తక్కువ ఫైబర్, అధిక చక్కెర, కొవ్వు ఉన్నాయి. ఈ డైట్ అనుసరించే వారిలో అధికశాతం మంది బరువు పెరగడం, స్థూలకాయంతో బాధపడుతుండడాన్ని కొన్ని అధ్యయనాలు కనుగొనడం దీనికి బలం చేకూరుస్తోంది.
ఎవరు అనుసరించాలి?
ఎలాంటి అజీర్ణ సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి గ్లూటెన్ ఫ్రీ డైట్ గురించి ఆలోచించకపోవడం అత్యుత్తమం. అయితే గ్లుటెన్ సంబంధ అనారోగ్య సమస్యలు, లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. కొన్ని వైద్య పరీక్షల ఆధారంగా ఎలాంటి ఆహారం తీసుకోవాలి, దేనికి దూరంగా ఉండాలి అనేది తెలుస్తుంది. ఒక్కోసారి సిలియాక్ వ్యాధి లక్షణాలకు లాక్టోజ్(చక్కెర, పాలు) కారణం కావొచ్చు. చివరగా చెప్పేదేంటంటే మంచికో చెడుకో ప్రస్తుతం గ్లుటెన్ గురించి అవగాహన చాలా పెరిగింది. ఒకవేళ సిలియాక్ వ్యాధి ఉంటే వారు కచ్చితంగా గ్లుటెన్ ఫ్రీ డైట్‌ను అనుసరించాల్సి వస్తే అందుకు తగిన ఆహార పదార్థాలు కూడా విరివిగా అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా క్రీడాకారుల్లాగానో, సినిమా నటుల్లాగానో గ్లుటెన్ ఫ్రీ డైట్‌ను అనుసరించడం మాత్రం చేయొద్దు. మన ఆరోగ్యం మన చేతుల్లో, మన డాక్టర్ చేతుల్లో ఉంది. ఎవరో ఏదో చెప్పారని, ఇంకెవరో ఏదో పాటిస్తున్నారని మాత్రం అనుసరించొద్దు.
వాస్తవాలేంటి?
నిజానికి గ్లుటెన్ ఫ్రీ డైట్ శాస్త్రీయమేనా? అంటే ప్రస్తుతానికి కచ్చితంగా చెప్పడం కష్టం. అయితే, ఇందులో ఒక నిజం ఉంది. అదేంటంటే గ్లుటెన్ ప్రమాదకరం. పైన చెప్పినట్లు సిలియాక్ వ్యాధి ఉన్న వారు గ్లుటెన్ ఫ్రీ డైట్ పాటించడం ద్వారా కొంతమేర స్వస్థత పొందవచ్చు. అయితే, మరికొందరికి సిలియాక్ వ్యాధి లేనప్పటికీ గ్లుటెన్ ఆహారం తీసుకున్నప్పుడు ఉబ్బరం, అతిసారం, పొత్తి కడుపు నొప్పి లాంటివి కనిపిస్తున్నాయి. దీనికి కారణం వారి శరీర తత్వానికి గోధుమలు పడకపోవడమని కొందరిలో తేలింది. అయితే, వీరిలో చాలా మందిలో సిలియాక్ వ్యాధి లక్షణాలకు సరైన కారణం గుర్తించలేకపోయారు. అలాగే సిలియాక్ వ్యాధి లేనివారు గ్లుటెన్ పదార్థాలను నిశ్చింతంగా తినొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment