ప్రశాంతి అందరిలా ఆలోచించలేదు.. | Goodwill Store Founder Prashanthi Special Store In Hyderabad | Sakshi
Sakshi News home page

ప్రశాంతి అందరిలా ఆలోచించలేదు..

Published Tue, Dec 15 2020 9:05 AM | Last Updated on Tue, Dec 15 2020 9:05 AM

Goodwill Store Founder Prashanthi Special Store In Hyderabad - Sakshi

చాలా మందికి తమ చుట్టూ ఉన్న సమాజానికి తన వంతుగా ఏదైనా  చేయాలనుంటుంది. కానీ వివిధ కారణాల రీత్యా, నగరాలలో ఉండే యాంత్రిక జీవన ప్రభావం వల్ల ఏమీ చేయలేక పోయామని బాధపడుతుంటారు. అయితే ప్రశాంతి అందరిలా ఆలోచించలేదు.. ఏదైనా చేయాలని గట్టిగా సంకల్పించింది. తాను అనుకున్న దానిని ఆచరణలో పెట్టింది. తన ‘గుడ్‌విల్‌’తో అందరి ఆదరాభిమానాలనూ చూరగొంది. తన సేవలను మరింత విస్తృతంగా చేయాలంటే  ప్రభుత్వాధికారిగా ఉండాలనుకుంది. కష్టపడి ప్రయత్నించింది. ఉన్నతాధికారిగా ఉద్యోగాన్ని సాధించింది. తన కలలను సాకారం చేసుకుంది. ఇంతకీ ఎవరీ ప్రశాంతి... ఆమె సమాజానికి చేసింది ఏమిటో తెలుసుకుందాం...

ప్రశాంతి స్వస్థలం మహబూబ్‌ నగర్‌. ఎంబీబీఎస్‌ చేయాలనే లక్ష్యంతో ఎంసెట్‌లో ఓయూ పరిధిలో 2100 ర్యాంకు సాధించారు. కానీ, వైద్యకళాశాలలో సీటు రాకపోవడంతో ఎల్‌ఎల్‌బీ చేసి, ఆ విద్యా సంవత్సరపు టాపర్‌గా నిలిచారు. అనంతరం అరోరా బిజినెస్‌ స్కూల్‌ ఆంధ్రా మహిళా సభలో ప్రొఫెసర్‌గా పనిచేసేవారు. ఇలా తన ఇంటిని, తన వాళ్లను చూసుకుంటూ, ఇటు ఉద్యోగం  చేసుకుంటూ.. తనకున్న సమయంలో సమాజంలోని పేదవారికి ఏదైనా చేయాలని ఆలోచించేవారు. ఒకసారి ఆమెకు వీధి చివరన ఒక బాలుడు చెత్త కుండీ నుంచి ఆహారాన్ని తీసుకుంటూ, అందులో పారేసిన గుడ్డపీలికలను వెతికి ఆచ్చాదనగా చుట్టుకుంటున్న దృశ్యం కంట పడింది.

ఆ దృశ్యం ఆ క్షణాన ఆమె కళ్ల ముందు నుంచి తొలగింది కానీ, చాలాకాలం పాటు మనసును వెంటాడుతూనే ఉంది. దాంతో అలాంటి వారి కోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని అమెరికాలో ఉన్న తన సోదరి తో పంచుకుంది. అప్పుడామె ఇంట్లో తాము ఉపయోగించని వస్తువులు, ఫర్నీచర్, దుస్తులు వగైరా ఇతరులు ఉపయోగించుకునేందుకు వీలుగా ‘గుడ్‌ విల్‌ స్టోర్స్‌’ అమెరికాలో ఉంటాయని, వీలయితే నువ్వు కూడా అలాంటి స్టోర్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించమని సలహా ఇచ్చింది. ప్రశాంతిపై ఆమె మాటలు బాగానే ప్రభావం చూపాయి. వెంటనే ఆమె తన ఇంట్లో వాడకుండా ఉన్న దుస్తులు, ఫర్నిచర్‌ వంటి వాటిని తీసుకొని తను ఉంటున్న వీధి చివరన ఒక స్టోర్‌ను ఏర్పాటు చేసి, అక్కడ గోడకు పెయింటింగ్‌ వేసి ఆ బట్టలు, వస్తువులు పెట్టేసి వచ్చింది.

ఈ గుడ్‌ విల్‌ స్టోర్‌ గురించి తన మిత్రులకు, అపార్ట్‌మెంట్‌ చుట్టుపక్కల ఉంటున్న వారికి కూడా అవగాహన కల్పించింది. ఆమె చేసిన ఈ పనులను స్థానికులు మొదట్లో వింతగా చూసినప్పటికీ క్రమంగా ఆమె ఆలోచనకు, చేస్తున్న ప్రయత్నానికి ఆదరణ పెరిగింది. దీంతో ప్రస్తుతం అక్కడ చాలామంది వారికి కావాల్సిన వస్తువులను తీసుకోగల్గుతున్నారు. అప్పటికి కానీ ప్రశాంతి మనసుకు ప్రశాంతత లభించలేదు.

స్టోర్‌ కోసం ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం
తనకున్న పరిధిలోనే ఇంత చేయగలిగితే, ఒకవేళ ప్రభుత్వ సర్వీసులో ఉంటే ఇంకా ఎక్కువే చేయచ్చు కదా అనుకుంది. ఉన్నతమైన ఆశయాలున్న ప్రశాంతిని ఆమె ఆలోచనలు గ్రూప్‌–1 ఉద్యోగం వైపునకు నడిపించాయి. భర్త, ఇతర కుటుంబ సభ్యులు అందుకు సహకరించారు. దీంతో తను రాసిన పరీక్షలో ఓవరాల్‌ గా 9వ ర్యాంకు, మహిళల విభాగంలో 3వ ర్యాంకు సాధించారు. 2016–17 గ్రూప్‌–1 నోటిఫికేషన్‌లో మున్సిపల్‌ శాఖలో డిప్యూటీ కమిషనర్‌ ఉద్యోగాన్ని సాధించారు. గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలో తొలి పోస్టింగ్‌ వచ్చింది. ఉద్యోగంలో చేరిన వెంటనే అక్కడ కూడా ప్రశాంతి గుడ్‌ విల్‌ స్టోర్‌ను ఏర్పాటు చేశారు. అదే విధంగా సంగారెడ్డిలోనూ చేశారు.

అలా ఇంతింతై.. వటుడింతై.. అన్నట్లు ఉద్యోగరీత్యా ఎక్కడికి వెళ్లినా, అక్కడ ఒక గుడ్‌ విల్‌ స్టోర్‌ను ఏర్పాటు చేస్తూనే ఉన్నారామె. కొన్ని ఎన్‌జీవో సంస్థలు కూడా ముందుకు వచ్చి, స్టోర్‌ ముందు అన్నదానాలు, ముఖ్యదినోత్సవాలను పురస్కరించుకొని పేదలకు దుప్పట్లు వగైరా పంచి పెట్టేవారు. ఇప్పుడు ఆమె మూసాపేట్‌ పరిధిలో కూడా తన గుడ్‌ విల్‌ స్టోర్‌ను తోటి ఉద్యోగుల సహకారంతో ఏర్పాటు చేశారు అంతేకాదు, ఉద్యోగంలో భాగంగా తన శాఖ పరిధిలో ప్రభుత్వం అందిస్తున్న ఫలాలను ప్రజలకు చేరేలా సహకారం అందిస్తూ.. ఇటు కుటుంబ బాధ్యతలు.. అటు ఉద్యోగ ధర్మం నిర్వర్తిస్తూ ముందుకు సాగుతున్నారు. 

కూకట్‌పల్లి సర్కిల్‌ ప్రాంతంలో ఆమె ఏర్పాటు చేసిన గుడ్‌విల్‌ స్టోర్‌ను చూసిన కె. చంద్రశేఖర్‌ రెడ్డి అనే వైద్యాధికారికి ఒక మంచి ఆలోచన వచ్చింది. తాను కూడా ఈ మంచి పనిలో తనవంతుగా ఏదైనా చేయాలనుకున్నారు. వెంటనే కూకట్‌పల్లి సమీపంలోని హుడా ట్రక్‌పార్క్‌ సమీపంలో శిథిలావస్థలో ఉన్న ఒక గదిని తన సొంత ఖర్చులతో శుభ్రం చేయించి, మరమ్మతులు చేయించి, రంగులు వేయించి, గుడ్‌విల్‌ స్టోర్‌ను ఏర్పాటు చేశారు. అక్కడి వారు కూడా ఈ స్టోర్‌ పట్ల అవగాహనతో తమ వద్ద నిరుపయోగంగా ఉన్న కొన్ని వస్తువులు, దుస్తులను తీసుకొచ్చి అక్కడ పెడుతున్నారు. అవసరం ఉన్న వారు వాటిని తీసుకెళుతున్నారు. గుడ్‌విల్‌తో ప్రశాంతి చేసిన ఈ మంచి పనిని చూసి అయినా  అవసరంలో ఉన్న వారికి అంతో ఇంతో ఉపయోగపడాలనే ఆలోచన కొందరిలో అయినా వస్తే చాలా మంచిది.

గుడ్‌విల్‌ స్టోర్‌ నా మానస పుత్రిక
నాకు కేవలం 18 సంవత్సరాల సర్వీసు మాత్రమే ఉంది. చాలా ఆలస్యంగా ఈ ఉద్యోగంలో చేరానని బాధపడుతూ ఉంటాను. ప్రతిక్షణం ప్రజలకు ఇంకా ఏం చేయగలనో ఆలోచిస్తుంటాను. అంతేకాదు, ఎన్ని సమస్యలు, సవాళ్లు ఎదురవుతున్నా ప్రభుత్వ ఫలాలను ప్రజలకు చేర్చడంలో నేను రాజీ పడను. ఇది ప్రజలతో మమేకమై, వారికి సేవచేయడానికి నాకిచ్చిన సువర్ణావకాశంగా భావిస్తున్నాను. గుడ్‌విల్‌ స్టోర్‌ నా మానస పుత్రిక.
– ప్రశాంతి, గుడ్‌విల్‌ స్టోర్‌ వ్యవస్థాపకురాలు, డిప్యూటీ కమిషనర్, జీహెచ్‌ఎంసీ, కూకట్‌పల్లి
– ఇనామ్‌దార్‌ పరేష్‌
సాక్షి, హైదరాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement