మనకు ఏదైనా గాయం కాగానే... శరీరం తనను తాను రిపేరు చేసుకునే తీరు అద్భుతం. ప్రతివారి జీవితంలో ఏదో ఓ సందర్భంలో గాయం కాగానే... (అది మరీ పెద్దది కాకపోతే) కొద్దిరోజుల్లోనే దాని ఆనవాలు కూడా తెలియకుండా పోతుంది. భారీ హార్ట్ ఎటాక్ సమయంలో గుండె కండరం చచ్చుబడిపోవడం... అవే కండరాలు మళ్లీ పునరుజ్జీవం పొందకపోవడం వల్లనే చాలామందిలో మరణం సంభవిస్తుంది.
కానీ చాలా తక్కువగా లేదా ఓ మోస్తరుగా వచ్చిన హార్ట్ అటాక్‌లోనూ... శరీరం తనను తాను రిపేరు చేసుకునే ప్రక్రియ సాగుతుంది. ఇదెలా జరుగుతుందో తెలుసుకోడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఇదెలా జరుగుతుందో తెలుసుకుంటే... స్వాభావికంగా జరిగే ఇదే ప్రక్రియను... వైద్య చికిత్సగా ఇవ్వడం ద్వారా గుండెను రిపేరు చేసుకోగలమన్నది శాస్త్రవేత్తల భావన. తమ పరిశోధనల ద్వారా అదెలా జరుగుతుందో... రిపేరుకు కారణమయ్యే ప్రోటీన్ ఏమిటో తెలుసుకున్నారు. దాని గురించి తెలిపేదే ఈ కథనం.
మన దేహంలో ఏదైనా భాగం గాయపడగానే... వెంటనే మన వ్యాధి నిరోధక వ్యవస్థ స్పందిస్తుంది. ‘లింఫాటిక్ సిస్టమ్’ అనే వ్యవస్థ ఇందుకు తోడ్పడుతుంది. ఇది మన వ్యాధినిరోధక వ్యవస్థలో ఒక కీలక అంశం. దేహంలో అన్నిచోట్ల కండరాలకు రిపేరు జరిగినట్లే... దెబ్బతిన్న గుండె కండరాన్నీ రిపేరు చేయడానికి పూనుకుంటుందీ వ్యవస్థ.
రిపేరు ప్రక్రియలో ఏం జరుగుతుంది...? ఎలా జరుగుతుంది?
ఏదైనా భాగంలో దెబ్బతగలగానే లింఫాటిక్ సిస్టమ్ ద్వారా ‘మ్యాక్రోఫేజెస్’ అనే కణాలు ఎక్కువ స్థాయిలో విడుదల అవుతాయి. నిజానికి అవి మన వ్యాధినిరోధక వ్యవస్థలో భాగంగా... అవి తెల్లరక్తకణాలపై ఉండే అనుబంధ కణాలే. ‘మ్యాక్రో’ అంటే పెద్దవి... ‘ఫేజెస్’ అంటే హరించేవి అని అర్థం. పేరుకు తగ్గట్లుగానే అవి హానికరమైన కణాలనూ/అంశాలనూ, బ్యాక్టీరియాను, అతి సూక్ష్మమైన హానికారక క్రిములను తినేయడం/హరించడం చేస్తాయి.
అలాగే మన రోజువారీ జీవక్రియల్లో భాగంగా మనలో ప్రతిరోజూ 200 నుంచి 1000 వరకు క్యాన్సర్ కణాలూ వెలువడుతుంటాయి. వాటిని కూడా ఈ మ్యాక్రోఫేజెస్ పూర్తిగా హరించేస్తాయి. (మన వ్యాధినిరోధక శక్తి తగినంత లేని సందర్భాలోనూ, లేదా అక్కడ పుట్టిన మొత్తం క్యాన్సర్ కణాలను ఈ మ్యాక్రోఫేజెస్ పూర్తిగా హరించలేని సందర్భాల్లోనే క్యాన్సర్ వస్తుందన్నమాట).
హానిచేసే కణాలను మాత్రమేగాకుండా... ఏదైనా దెబ్బతగిలినప్పుడు ఇన్‌ఫ్లమేషన్ (మంట, వాపు) కలిగించే కారకాలనూ, దెబ్బతిన్న తర్వాత శిథిలమైపోయి పోగుబడ్డ కణాల గుట్టలనూ ఇవి నిర్మూలిస్తాయి. ఇన్ఫెక్షన్ కలిగించే వాటినీ తొలగిస్తాయి. అంతేకాదు... బయటి పదార్థాలనూ (ఫారిన్‌బాడీస్‌నూ) ఎదుర్కొంటాయి. ఇలా ఏదైనా దెబ్బ తగిలిన వెంటనే... ఇవి పెద్దసంఖ్యలో పుట్టి... ఇలా క్లీన్ చేసే ప్రక్రియను ‘ఫ్యాగోసైటోసిస్’ అని అంటారు.
మ్యాక్రోఫేజెస్ ఏం చేస్తాయి?
ఇంతటి కీలకమైన భూమిక నిర్వహించే ఈ ‘మ్యాక్రోఫేజెస్’ ఎలా ఈ పని చేస్తాయన్నది శాస్త్రవేత్తలు ఇటీవలి తమ అధ్యయనాల్లో తెలుసుకున్నారు. ‘నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయీ’కి చెందిన ప్రముఖ పాథాలజిస్ట్ ఎడ్వర్డ్ థోర్ప్ ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందో వివరించారు. ‘‘గుండెపోటు రాగానే ఇమ్యూన్ సెల్స్... సరిగ్గా చెప్పాలంటే ‘మ్యాక్రోఫేజెస్’ గుండెకండరం దెబ్బతిన్న చోటికి వెంటనే చేరుకుంటాయి.
అక్కడ దెబ్బతిన్న కండరాలనూ, చచ్చుబడ్డ కణజాలాన్నీ (డెడ్ టిష్యూను) తినేయడం ప్రారంభిస్తాయి. ఇందుకోసం ఈ మ్యాక్రోఫేజెస్ ‘వీఈజీఎఫ్–సీ’ అనే ప్రోటీన్‌ను తయారు చేసి వెలువరిస్తాయి. ‘వాస్క్యులార్ ఎండోథీలియల్ గ్రోత్ ఫ్యాక్టర్–సి’ అనే మాటకు సంక్షిప్తరూపమే ఈ ‘వీఈజీఎఫ్–సీ’. ‘డాక్టర్ జకిల్ అండ్ మిస్టర్ హైడ్’ నవలోలాగా... ఈ మ్యాక్రోఫేజెస్ ఇక్కడ రెండు పనులు ఒకేసారి చేస్తుంటాయి. మంచి మ్యాక్రోఫేజెస్... ‘వీఈజీఎఫ్–సి’ని ఉత్పత్తి చేస్తుంటాయి.
కానీ అదే సమయంలో కొన్ని చెడు మ్యాక్రోఫేజెస్ ఇన్‌ఫ్లమేటరీ (మంట, వాపు) కలిగించే ప్రక్రియను వేగవంతం చేస్తాయి. ఇవి... అప్పటికే దెబ్బతిన్న గుండె కండరానికీ, ఆ పొరుగున ఉన్న కణజాలాలకు మరింత హాని చేసే అవకాశం ఉంది. ఇలా జరిగే సమయంలో అక్కడ దెబ్బతిని, నశించుకుపోయాక లేదా చచ్చుబడిపోయాక పోగుబడ్డ మృతకణజాలం అంతా తొలగిపోవాల్సిన అవసరం ఉంటుంది.
ఇలా ఆ మృతకణజాలమంతా పూర్తిగా తొలగిపోయి, పరిశుభ్రమైపోయే ప్రక్రియను ‘ఎఫరోసైటోసిస్’ అంటారు. ఈ ప్రక్రియలోనే ‘మ్యాక్రోఫేజెస్’ కీలక భూమిక పోషిస్తాయి. ఈ ప్రక్రియ ‘వీఈజీఎఫ్–సీ’ ప్రోటీన్‌తో ఎలా జరుగుతుందనే అంశాన్ని ల్యాబ్‌లో ఎలుకల సహాయంతో మేము కనుగొన్నాం’’ అంటున్నారు ఎడ్వర్డ్ థోర్ప్.
ఈ అంశాల ఆధారంగా గుండెకు మేలు జరిగేదెలాగంటే...?
ఇప్పటివరకు జరిగిన పరిశోధన ఆధారంగా... ఈ మ్యాక్రోఫేజెస్‌నూ, ‘వీఈజీఎఫ్–సీ’ ప్రోటీన్‌నూ ఉత్పత్తి అయ్యేలా చేస్తారు. వాటి సహాయంతో హార్ట్ ఎటాక్‌లో దెబ్బతిన్న గుండె కండరాల రిపేరు వేగంగా జరిగేలా చేయాలన్నది ఇప్పుడు పరిశోధకుల ముందున్న లక్ష్యం.
అంతేకాదు... గుండెపోటు వచ్చినప్పుడు అక్కడ జరిగే జీవక్రియల (బయొలాజికల్) తీనుతెన్నులేమిటో తెలుసుకుని, దానికి విరుగుడుగా ‘ఎఫరోసైటోసిస్’ ద్వారా గుండెకండరాన్ని వేగంగా కోలుకునేలా చేయాలని కూడా పరిశోధకులు సంకల్పిస్తున్నారు.
చదవండి👉🏾Hypertension: పక్షవాతం, బ్రెయిన్ స్ట్రోక్, గుండె సమస్యలు.. అందుకే ‘టెన్షన్’ వద్దు! ఇవి తినండి!
చదవండి👉🏾Health Tips: రాత్రిపూట అన్నం తినొచ్చా? తినకూడదా? ఒకవేళ తింటే ఏమవుతుంది?
Comments
Please login to add a commentAdd a comment