
రొయ్యలతో ఇడ్లీ
కావలసినవి: రొయ్యలు – పావు కప్పు (శుభ్రం చేసుకుని, ఉప్పు, కారం, పసుపు దట్టించి ఉడికించుకోవాలి. చల్లారాక ముక్కలుగా చేసుకోవాలి)
ఇడ్లీపిండి – 4 కప్పులు (ముందుగా సిద్ధం చేసుకోవాలి)
బీట్‌రూట్ తురుము, క్యారెట్ తురుము – 2 టేబుల్ స్పూన్ల చొప్పున
గరం మసాలా – 1 టీ స్పూన్, నెయ్యి – పావు కప్పు
ధనియాల పొడి – 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర తురుము – కొద్దిగా
తయారీ విధానమిలా:
ముందుగా రొయ్యల ముక్కల్ని నేతిలో వేయించాలి. అందులో క్యారెట్ తురుము, బీట్‌రూట్ తురుము, గరం మసాలా వేసి.. దోరగా వేగాక.. తీసి పక్కన పెట్టుకోవాలి. అనంతరం ఇడ్లీ ప్లేట్ తీసుకుని.. ప్రతి గుంతలో మినప్పిండి మిశ్రమం కొద్దికొద్దిగా వేసుకుని.. ఆపై చిన్న గరిటెతో కొద్దిగా రొయ్యల మిశ్రమాన్ని పెట్టుకుని.. అది కనిపించకుండా మళ్లీ మినప్పిండితో కవర్ చేసుకుంటూ ఇడ్లీ గుంతలు నింపుకోవాలి.
ఇంతలో మరో స్టవ్ మీద.. కళాయిలో నెయ్యి వేసుకుని.. ధనియాల పొడీ వేసి.. ఒక నిమిషం పాటు గరిటెతో తిప్పి.. ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇడ్లీలు ఆవిరిపై ఉడికిన తర్వాత.. సర్వ్ చేసుకునే ముందు ప్లేట్‌లోకి తీసుకుని.. వాటిపై ధనియాల–నెయ్యి మిశ్రమాన్ని వేసుకుని.. కొత్తిమీర తురుము గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది.