పెద్దగా మాటలుండవు. ఒక పదీ పదిహేనుమందివచ్చి పార్కులో కలుస్తారు. అందరి చేతుల్లో వారికి నచ్చిన పుస్తకాలు ఉంటాయి. తలా ఒకచోట కూచుని పుస్తకాన్ని నిశ్శబ్దంగా చదువుకుంటారు. వీడ్కోలుకు ముందు కాసిన్ని కబుర్లు... ఒక చాయ్... ఒకరి పుస్తకం మరొకరికి అరువు...ఒక ఆరోగ్యకరమైన వ్యాపకం ఆరోగ్యకరమైన బృందం...సెల్‌ఫోన్‌ల కాలుష్యంలోముంబైలో తాజా ట్రెండ్ ‘సైలెంట్ రీడింగ్‘.
శనివారం సాయంత్రం 5 గంటలు. ముంబైలోని జుహూలో కైఫీ ఆజ్మీ పార్క్. మెల్లమెల్లగా కొంతమంది నడుచుకుంటూ వచ్చి ఒకచోట జమయ్యారు. వారి చేతుల్లో పుస్తకాలు, చాపలు, దుప్పట్లు, చిరుతిండ్లు ఉన్నాయి. ఒక్కొక్కరు వారికి నచ్చినచోట దుప్పటి పరిచి పుస్తకం తెరిచి కూచున్నారు. దూరం నుంచి చూస్తే ఒక పదిహేను ఇరవై మంది శిలల్లా కూచుని చేతుల్లో పుస్తకాలు చదువుతూ కనిపిస్తారు. మంచి ప్రకృతిలో, మంచి సమయంలో, నచ్చిన పుస్తకాన్ని, తమలా పుస్తకాలను ఇష్టపడేవారి సమక్షంలో చదువుకోవడం ఎంత బాగుంటుంది? పుస్తకాన్ని మించిన స్నేహితుడు లేడు. పుస్తకాలను చదివేవారితో స్నేహానికి మించింది లేదు. అందుకే ఇప్పుడు ముంబైలో ‘సైలెంట్ రీడింగ్’ అనేది ఒక ట్రెండ్‌గా మారింది. కొత్త స్నేహితులను పరిచయం చేస్తోంది.
సైలెంట్ రీడింగ్ ఎందుకు?
పుస్తకాభిమానులు బుక్ రిలీజ్ ఫంక్షన్లకు వెళ్లినా, ఆథర్ టాక్‌కు వెళ్లినా ఏదో రణగొణధ్వని. పుస్తకం గురించి తక్కువ... మెరమెచ్చులు ఎక్కువ. అంతేకాదు, కొంతమంది పుస్తకాన్ని తప్ప దానిని రాసినవారిని కలవాలనుకోరు. మరికొంతమంది ఇంట్రావర్ట్‌లు తాము నిశ్శబ్ద స్నేహితులుగా ఉండాలనుకుంటారు. ఇలాంటి వారంతా ఏ గోలా లేని ‘సైలెంట్ రీడింగ్’ని ఇష్టపడుతున్నారు. ఈ సైలెంట్ రీడింగ్ గ్రూపుల్లో వాగుడుకాయలకు ప్రవేశం లేదు. హాయిగా నిశ్శబ్దంగా చదువుకోవడమే. మంచి పుస్తకాన్ని ఒకరితో మరొకరు పంచుకోవడమే.
బెంగళూరులో మొదలు
బెంగళూరులోని కబ్బన్ పార్క్‌లో శ్రుతి షా, హర్ష్ స్నేహాన్షు ఇద్దరు పుస్తక ప్రేమికులు ‘కబ్బన్ రీడ్స్’ పేరుతో ‘సైలెంట్ రీడింగ్’ని 2022 డిసెంబర్‌లో మొదలెట్టారు. కబ్బన్ పార్క్‌లో పుస్తక ప్రేమికులు విశేషంగా వచ్చి వారానికి ఒకసారి పుస్తకాలు చదువుకుని వెళ్లడం అందరినీ ఆకర్షించింది. దాని ప్రభావంతో ముంబైలోని జుహూలో దియా సేన్‌గుప్తా, రచనా మల్హోత్రా అనే ఇద్దరు స్నేహితురాళ్లు ‘జుహూ రీడ్స్’ పేరుతో ఈ సంవత్సరం మేలో ‘సైలెంట్ రీడింగ్’ను మొదలెట్టారు. వెంటనే జుహూలోని పుస్తక ప్రేమికులను ఇది ఆకర్షించింది. అన్ని వయసుల వాళ్లు ఇక్కడికి వచ్చి కూచుని ప్రశాంతంగా పుస్తకాలు చదవసాగారు.
అంతేనా? వీల్‌చైర్‌లో ఉండేవారు కూడా వచ్చి పుస్తకంలో, పుస్తకాన్ని ఇష్టపడేవారి సమక్షంలో ఓదార్పు పొందసాగారు. ‘సెల్‌ఫోన్లు వచ్చాక పుస్తకం చదివే అలవాటు తగ్గింది. మనుషులు సెల్ చూసుకుంటూ కనిపించడమే అందరికీ తెలుసు. కాని ఒకప్పుడు పుస్తకం చదువుతూ కనిపించేవారు. సైలెంట్ రీడింగ్ వల్ల పుస్తకం చదువుకుంటూ కనిపించేవారు అందరినీ ఆకర్షిస్తున్నారు. దానివల్ల పుస్తకాలు చదవాలన్న అభిలాష పెరుగుతోంది. మేము ఆశిస్తున్నది అదే’ అని జుహూ రీడ్స్ నిర్వాహకులు అన్నారు.
దేశ, విదేశాల్లో...
బెంగళూరు కబ్బన్ పార్క్‌తో మొదలైన సైలెంట్ రీడింగ్ ఉద్యమం ఇప్పుడు ముంబైలో బాంద్రా, దాదర్, కొలాబా లాంటి ఐదారు చోట్లకు విస్తరించింది. ఇక మన దేశంలోని ఢిల్లీ, పూణె, చెన్నై, కొచ్చి, హైదరాబాద్‌లకు కూడా వ్యాపించింది. సోషల్ మీడియా ద్వారా కబ్బన్ రీడ్స్ గురించి తెలుసుకున్న వారు న్యూయార్క్, లండన్, దుబాయ్, మెల్‌బోర్న్‌లలో కూడా సైలెంట్ రీడింగ్ సమూహాలను తయారు చేస్తున్నారు. ‘ఈ రీడింగ్స్‌కు వచ్చినవారు మంచి స్నేహితులుగా మారుతున్నారు. బిజీ లైఫ్‌లో మనిషి ఒంటరితనాన్ని ఫీలవుతున్నాడు. ఆ ఒంటరితనం పోగొట్టేందుకు సైలెంట్ రీడింగ్ గ్రూపులు సాయం చేస్తున్నాయి’ అని నిర్వాహకులు అభిప్రాయ పడుతున్నారు.
వాట్సాప్ యూనివర్సిటీ నుంచి
వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చే నానా చెత్త ప్రభావంలో పడి అనవసర భావోద్వేగాలకు లోను కావడం కన్నా వికాసం, జ్ఞానం, జీవితానుభవం, ఆహ్లాదం పంచే పుస్తకాన్ని అక్కున చేర్చుకోవడం నేటి తక్షణావసరం. పుస్తకాలు చదివే వారితోనే నాగరిక సమాజం ఏర్పడుతుంది. ఆ విధంగా సైలెంట్ రీడింగ్ గ్రూపులు సమాజాన్ని మరింత అర్థవంతం చేస్తున్నాయి. ఇలాంటి ఉద్యమాల్ని పుస్తకాభిమానులు ఎక్కడికక్కడ అందుకోవాల్సిన అవసరం ప్రతి ఊళ్లో, పట్టణంలో ఉంది.
(చదవండి: మహిళ మెదడులో.. కొండచిలువలో ఉండే..)
Comments
Please login to add a commentAdd a comment