విజేతల గాథలు లోకానికి తెలుస్తాయి.
విజేతలు కాలేకపోయిన వారి కథ తెర వెనుక ఉండిపోతుంది.
సుమన్ కల్యాణ్‌పూర్‌ను ‘పేదవాళ్ల లతా మంగేష్కర్’ అనేవారు.
ఆమె అచ్చు లతా లాగే పాడేది.
లతతో సరిసాటి అనేవారు అభిమానులు.
‘నా నా కర్‌తే ప్యార్ తుమ్హీసే కర్ బైఠే’
‘ఆజ్ కల్ తెరె మేరె ప్యార్ కే చర్చే హర్ జబాన్ పర్’... ఎన్నో పాటలు.
ఆమెను ఇండస్ట్రీ దగా చేసింది. ఆమె మాత్రం హుందాగా తనకు వచ్చిన పాటే పాడింది.
ఈ సున్నితమైన గాయని జీవితాన్ని ఒక తలుచుకోవాల్సిన రోజు ఇది.
‘ఆమె అంత బాగా పాడేది. మరిఎందుకు ఎక్కువ పాటలు పాడలేదు?’ అని సుమన్ కల్యాణ్‌పూర్ గురించి అభిమానులు నేటికీ అనుకుంటారు. ఎందుకు పాడలేదు? ఎందుకు ఉద్యోగంలో రాణించలేదు? ఎందుకు ఫలానా రంగంలో పైకి ఎదగలేదు? అనంటే ఆ రంగానికి సంబంధించిన ఆట సరిగా ఆడకపోవడమే కారణం. ఆడేంత మొరటుదనం లేకపోవడమే కారణం. మనం గెలవాలంటే మనం ప్రయత్నించి గెలవడం ఒక మార్గం. ప్రత్యర్థులను లేకుండా చేసి గెలవడం ఒక మార్గం. పైకి ఎదగాలంటే సినిమా పరిశ్రమలో ఇవన్నీ చేయాలి. సుమన్ కల్యాణ్‌పూర్ కేవలం పాడగలిగేదే తప్ప ఇన్ని రాజకీయాలు చేసేది కాదు. అందుకే ఆమె తక్కువ పాడింది. కాని పాడిన ప్రతిదీ ఎంత తీయగా పాడింది? గుర్తుందా నౌషాద్ సంగీతంలో ముఖేశ్‌తో పాడిన ఈ డ్యూయెట్–
మేరా ప్యార్ భీ తూహై ఏ బహార్ భీ తూహై
తూహీ నజరోంమే జానే తమన్నా తూహీ నజారోమే... (సాథీ)
సుమన్ కల్యాణ్‌పూర్‌ది మంగళూరు. తండ్రి బ్యాంక్ ఉద్యోగి కావడంతో ముంబై వచ్చి స్థిరపడింది. చిన్న వయసులోనే పెళ్లయ్యింది. భర్త రామానంద్ కల్యాణ్‌పూర్ ఆమెను పాడనిచ్చాడు కాని ప్రతి రికార్డింగ్‌కూ తోడు వచ్చేవాడు. లతా గొంతును చూసి ఇన్‌స్పయిర్ అయ్యింది సుమన్. కాని విశేషం ఏమిటంటే ఆమె గొంతు కూడా అచ్చు లతా గొంతులాగే ఉండేది. కొన్ని పాటలు వింటే లతా ఎక్కువ మార్దవం గా పాడుతోందా సుమన్ ఎక్కువ మార్దవంగా పాడుతోందా అర్థమయ్యేది కాదు. కొన్ని రికార్డు లు రేడియోలో ప్లే చేస్తూ ఒకరి పేరు మరొకరి పేరుగా చెప్పేంతగా కన్ఫ్యూజన్ ఉండేది. ‘బ్రహ్మచారి’ లో రఫీతో ఈ డ్యూయెట్ లతా పాడింది అనుకుంటారు. కాని సుమన్ పాడింది.
ఆజ్ కల్ తెరె ప్యార్ కే చర్చే హర్ జబాన్ పర్
తుజ్ కో మాలూమ్ హై ఔర్ సబ్‌కో ఖబర్ హోగయి...
సుమన్ కల్యాణ్‌పూర్‌ను చాలా మంది నిర్మాతలు ఇష్టపడేవారు. దానికి కారణం ఆమె ‘పూర్‌మేన్స్ లతా’ కావడమే. అంటే లతా 10 వేలు తీసుకుంటే అలాగే పాడే సుమన్ మూడు నాలుగు వేలకు పాట పూర్తి చేసేది. ‘బాత్ ఏక్ రాత్ కీ’లో హేమంత్ కుమార్‌తో ఆమె ఎంత అందమైన పాట పాడింది.
నా తుమ్ హమే జానో నా హమ్ తుమే జానే
మగర్ లగ్‌తా హై కుచ్ ఐసా మేరా హమ్‌దమ్ మిల్ గయా...
కాని లతా మంగేష్కర్, ఆశా భోంస్లే... వీరిద్దరికీ ఉండే శక్తి ముందు ఇతర గాయనులు ఒదిగి ఉండక తప్పేది కాదు. సంగీత దర్శకులు కూడా వీరిద్దరిని కాదని సుమన్‌కు పాట ఇవ్వాలంటే జంకే వారు. నిర్మాతలు భయపడేవారు. లతా మార్కెట్ సినిమాకు ప్లస్ అయ్యేది. దానిని వదులుకోలేక సుమన్‌ను వదులుకున్నారు. అయితే ఒక సందర్భం వచ్చింది. సినిమా పాటల రాయల్టీ ఆ పాటలు రిలీజయ్యి ఎన్నాళ్లయినా గాయనీ గాయకులకు ఇవ్వాల్సిందే అని లతా వాదనకు దిగింది. రఫీ ఆమెతో విభేదించాడు. పాటకు ఒకసారి డబ్బు తీసుకున్నాక ఆ తర్వాత దాని గురించి ఆలోచించకూడదు అని అతని వాదన. ‘అయితే నీతో నేను పాడను’ అని రఫీతో పాటడం మానేసింది లత. రఫీ అప్పుడు సుమన్ కల్యాణ్‌పూర్‌తో బోలెడన్ని డ్యూయెట్లు పాడాడు. అన్నీ హిట్. ‘జబ్ జబ్ ఫూల్ ఖిలే’లో ఈ పాట–
నా నా కర్‌తే ప్యార్ తుమ్హీసే కర్ బైఠే
కర్‌నా థా ఇన్‌కార్ మగర్ ఇక్‌రార్
తుమ్హీసే కర్ బైఠే...
ఖయ్యాం కూడా సుమన్, రఫీలతో మంచి డ్యూయెట్లు పాడించాడు. ‘మొహబ్బద్ ఇస్‌కో కెహతే హై’లో ‘ఠెహరియే హోష్ మే ఆలూం’ పాట మధురాతి మధురం. ‘రాజ్‌కుమార్’లో సుమన్–రఫీల డ్యూయెట్ ‘తుమ్ నే పుకారా ఔర్ హమ్ చలే ఆయే’ పెద్ద హిట్. కాని ఆ తర్వాత తిరిగి లతా, రఫీల మధ్య సంధి కుదరడంతో సుమన్‌కు పాటలు పోయాయి.
సుమన్ పెద్దగా ఎవరినీ కలవదు. నేటికీ ఆమె ముంబైలో జీవిస్తోంది కాని చూసిన వారు తక్కువ. మాట్లాడినవారూ తక్కువే. ఎన్నో గొప్ప పాటలు పాడాల్సిన ఆమె కొద్ది తేనె చుక్కలు చిలకరించి మాయమైంది. ఆమె పాటకు పూల కానుక.
షరాబీ షరాబీ ఏ సావన్ కా మౌసమ్
ఖుదాకీ కసమ్ ఖూబ్ సూరత్ న హోతా
అగర్ ఇస్ మే రంగే మొహబ్బత్ న హోతా (నూర్జహాన్).
మొహమ్మద్ రఫీతో సుమన్ కల్యాణ్‌పూర్
Comments
Please login to add a commentAdd a comment