అదో రహస్య కోట. సూర్యస్తమయం తర్వాత ఆ కోటలోకి వెళ్లడం నిషేధం. ఒకవేళ ఎవరైనా ధైర్యం చేసినా వెళ్లినా తిరిగి వచ్చిన సందర్భాలు లేవు. ఇప్పటివరకు అలా వెళ్లిన వాళ్లెవరూ తిరిగి రాలేదు. మిస్టీరియస్ కోటగా పేరుగాంచిన ఈ ప్రాంతం ఎక్కడ ఉంది? ఏంటీ హిస్టరీ అన్నది తెలుసుకుందాం.
మధ్యప్రదేశ్‌లోని వారసత్వ కోటలలో ఒకటి ఈ గర్‌కుందర్ ఫోర్ట్. ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన ఈ అంతుచిక్కని రహస్యమైన కోట చుట్టూ అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. దీంతో ఇదో మిస్టీరియస్ కోటగా పేరుగాంచింది. మధ్యప్రదేశ్‌లోని ఝాన్సీకి 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ కోటను 11వ శతాబ్దంలో నిర్మించినట్టుగా సమాచారం. చందేలా, బుందేలా, ఖంగర్ వంటి రాజవంశస్థులు ఈ ప్రాంతంలో పాలన సాగించారు. తర్వాత ఈ కోటను తుగ్‌లక్‌లు సొంతం చేసుకొని బుందేలాలకు అప్పగించారు.
ఈ కోటను ఎప్పుడు, ఎవరు నిర్మించారు అనే దాని గురించి ఖచ్చితమైన సమాచారం లేదు. ఈ కోటలో చాలా నిధి ఉందన్న ప్రచారం కూడా ఉంది. దీంతో కోట లోపల ఏం ఉందో తెలుసుకోవాలని చాలామంది ఉత్సాహం చూపిస్తుంటారు. ఇక్కడ జరిగిన సంఘటనల ఆధారంగా ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండియాకు చెందిన అధికారులు ఒక హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. అదేంటంటే.. సూర్యాస్తమయం తర్వాత కోటలోకి ఎవరూ ప్రవేశించకూడదని. కొంతమంది క్యూరియాసిటీతో కోట లోపల రాత్రి ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. కానీ వాళ్లు ప్రాణాలతో తిరిగి రాలేదు.
ఈ కోట గురించి తెలుసుకోవాలని వెళ్లిన సుమారు 50-60మంది ఆచూకీ ఇప్పటివరకు తెలియరాలేదు. ఈ సంఘటన తర్వాత కోటలోకి వెళ్లే అన్ని తలుపులు మూసివేశారు. ఈ కోట వెనక ఆసక్తికరమైన కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఒక తాంత్రికుడు యువరాణి సౌందర్యాన్ని చూసి ఆకర్షితుడై మంత్రించిన నూనెతో వశం చేసుకోవాలని ప్రయత్నించాడు.
అది పసిగట్టిన యువరాణి ఆ నూనెల ఓ రాయిపై పడేలా చేసింది. దీంతో ఆ రాయి తాంత్రికుణ్ణి హతమార్చింది. ఆ తాంత్రికుడు చనిపోతూ శపించడం వల్ల ఊరంతా నాశనమైందని చెబుతారు. మొత్తం ఐదు అంతస్తుల్లో ఉండే గర్‌కుందర్ కోటలో మూడు అంతస్తులు పైన, రెండు అంతస్తులు నేలకింద నిర్మించడం విశేషం. రాత్రిపూట ఇక్కడికి ఎవరైనా ప్రవేశిస్తే మరుసటి రోజుకు కనిపించకుండా పోతారని అంటారు. దీంతో ఇదో మిస్టీరియస్ కోటగా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment