
Can You Change Your Body Shape With Daily Exercises: నిద్రలేచి అద్దంలో చూసుకునే వాళ్లు ఎంతమంది ఉంటారో కానీ బయటకు వెళ్లడానికి తయారైన తర్వాత అద్దంలో చూసుకునే అలవాటు చాలామందికి ఉంటుంది. ‘పట్టుచీరల షోరూమ్ ముందు హోర్డింగ్‌లో ఉన్న మోడల్ కట్టుకుంటే అంత అందంగా అమరిన చీర తనకెందుకు ఆ స్థాయిలో నప్పడం లేదు. మూడు నెలలుగా ఎక్సర్‌సైజ్ చేస్తున్నా ఫలితం అంతంత మాత్రమే’ అని ఓ యువతి అసంతృప్తిగా ముఖం పెట్టడం సహజమే.
అలాగే స్లిమ్ ఫిట్ షర్ట్‌ను ధరించిన మోడల్‌ను చూసి మనసు పడి ఆ చొక్కా కొనుక్కున్న ఓ కుర్రాడు కూడా అద్దంలో చూసుకుంటూ ‘మోడల్ ఉన్నంత స్మార్ట్‌గా లేను’ అనుకోవడమూ, మరుసటి రోజు నుంచే వ్యాయామం మొదలు పెట్టడం కూడా సర్వసాధారణమే. ఎక్సర్‌సైజ్ దేహాకృతిని మారుస్తుంది. నిజమే, అయితే ఎక్సర్‌సైజ్ ఎన్ని రోజులు చేస్తే ప్రకటనలో ఉన్న మోడల్ దేహాకృతి వస్తుంది..?
ఇది జెనెటిక్స్ నిర్ణయం... మనిషి దేహాకృతిని ప్రధానంగా జెనెటిక్స్ నిర్దేశిస్తాయి. బొద్దుగా లేదా బక్క పలుచగా ఉండడం వంటి లక్షణాలు పిల్లలకు వారసత్వంగా సంక్రమిస్తాయి. అలా సంక్రమించిన లక్షణాలను మన జీవనశైలి ప్రభావితం చేస్తుంది. ఆహారవిహారాల ప్రభావంతో సన్నని వాళ్లు కూడా అధిక బరువుకు లోనవుతుంటారు. బొద్దు వాళ్లు ఏకంగా ఒబేసిటీ బారిన పడుతుంటారు. ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల దేహంలో కొవ్వు కరిగి కండరాలు చక్కని షేప్‌లో రూపుదిద్దుకుంటాయి. అందులో సందేహం లేదు.
చదవండి: Science Facts: చీమల రక్తం అందుకే ఎర్రగా ఉండదట..!
అయితే నడుము భాగం సన్నగా ఉండడం లేదా వెడల్పుగా ఉండడం, భుజాలు విశాలంగా ఉండడం లేదా కుంచించుకు పోయినట్లు ఉండడం వంటివి వారసత్వంగా వస్తాయి. వ్యాయామం వల్ల దేహ నిర్మాణరీతిలో ఎటువంటి మార్పు రాదు. ఈ అంశం మీద ఏకంగా 24 అధ్యయనాలు జరిగాయి. మూడు వేలమందికి పైగా ఇందులో పాల్గొన్నారు. వారంలో మూడు రోజుల చొప్పున పన్నెండు వారాలపాటు వ్యాయామం చేస్తే... ఒకరి దేహం స్పందించినట్లు మరొక దేహం స్పందించలేదు.
మనిషి ఎత్తు, బరువు, వయసు, ఆహారవిహారాలు, నిద్ర వంటి వాటన్నింటినీ ఆరోగ్యవంతంగా క్రమబద్ధం చేసుకుంటూ వ్యాయామాన్ని కొనసాగించాలి. వ్యాయామం దేహాన్ని శక్తిమంతంగా, ఫ్లెక్సిబుల్‌గా ఉంచుతుంది. దేహం అంతర్గత అవయవాల పనితీరు మెరుగ్గా ఉంటుంది. సమగ్ర ఆరోగ్యం వ్యాయామం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి వ్యాయామం మంచిదే. అలాగే దేహాకృతి మీద ధ్యాస ఉండడం కూడా ఆరోగ్యకరమే. అయితే మనదేహం మరొకరి దేహాకృతిలాగా మారిపోవాలనుకోవడం ఆరోగ్యకరం కాదు. అది సాధ్యం కాదు.
చదవండి: Covid Taste Test: తెలుసా..! కాఫీతో కోవిడ్ టెస్ట్ చేయొచ్చు... ఎలాగంటే..