
రకరకాల రంగులను ఒకరి మీద ఒకరు చల్లుకునే హోలి పండుగను ఇష్టపడని వారంటూ ఉండరు. హోలి కోసం పిల్లల నుంచి పెద్దల వరకు అంతా ఎదురు చూస్తుంటారు. ఎంతో సరదా గా చేసుకునే పండగని ఉత్తర ప్రదేశ్‌లోని ఓ గ్రామంలో మాత్రం మహిళలే చేసుకుంటారు. వీరి హోలి సంబరాల్లోకి పురుషులు ఎవరైనా పొరపాటున వచ్చారంటే తన్నులు తినాల్సిందే. నిబంధన అతిక్రమించిన పురుషులకు శిక్షగా లంగా, జాకెట్‌ను ధరింపచేసి హోలీ రంగులు చల్లుతారు. వందల ఏళ్లుగా ఆ గ్రామంలో ఇదే తంతు జరుగుతోంది.
యూపీలోని హరీమ్‌పూర్ జిల్లాలో కుందౌరా అనే కుగ్రామం ఉంది. ఊరి జనాభా ఐదువేలు మాత్రమే. ఇక్కడ హోలీ పండుగను కాస్త ప్రత్యేకంగా జరుపుకుంటారు. మూడురోజులపాటు హోలీ సంబరాలు జరుగుతాయి. హోలి మొదటి రోజు మాత్రం పురుషులు రంగులు చల్లుకుంటూ హోలి ఆడతారు. రెండో రోజు కన్నెపిల్లలు, మహిళలు మాత్రమే హోలి ఆడతారు. ఈరోజు మహిళలు, అమ్మాయిలు తమకు నచ్చిన దుస్తుల్లో ఆరు బయట హోలి ఆడవచ్చు. ఈ సంబరాల్లోకి మగవాళ్లకు అస్సలు అనుమతి లేదు. వాళ్లు ఎట్టిపరిస్థితుల్లోనూ బయటకు రాకూడదు.
అత్తాకోడళ్లు సైతం ఒకరిమీద ఒకరు రంగులు చల్లుకుంటూ నాట్యం చేస్తారు. సంప్రదాయం ప్రకారం మామగారి ముందు కోడళ్లు కొన్ని పద్ధతులు పాటించాలి. అందువల్ల పురుషులను ఈ పండక్కి బయటకు రానివ్వరు. పురుషులు ఇంటికే పరిమితమవ్వాలి లేదా ఊర్లో ఉండకూడదు. సూర్యాస్తమయం అయ్యాకే ఊర్లోకి రావాలి. హోలీ రెండోరోజు పురుషులు ఆరుబయట కనిపించడం నిషేధం కనుక ఎవరైనా వచ్చారంటే శిక్షను అనుభవించాలి. ఆరుబయట కనిపించిన పురుషులకు లెహంగా చోళీ ధరింపచేసి రంగులు చల్లుతారు. కొన్ని సందర్భాల్లో మహిళలు వారిని కొడుతుంటారు
అర్ధరాత్రిదాకా...
మూడో రోజు హోలి పండుగను రామ్ జానకి గుడి ఆవరణలో నిర్వహిస్తారు. కుటుంబంలో ఉన్న చిన్నా పెద్ద మొత్తం దీనిలో పాల్గొంటారు. అర్ధరాత్రి వరకు జరిగే ఈ సంబరాల్లో మహిళలు డోలు, కంజిరాలు వాయిస్తూ నృత్యం చేస్తారు. కొంతమంది మహిళలంతా కలిసి ఒక గ్రూపుగా ఏర్పడి ఆకర్షణీయంగా కనిపిస్తారు. సాయంత్రం కాగానే ప్రత్యేకమైన వంటకాలను తయారు చేసి ఇంట్లో పురుషులకు వడ్డిస్తారు. ఇక్కడ కూడా ఫోటోలు, వీడియోలు నిషేధం.
Comments
Please login to add a commentAdd a comment