శివతత్వమే మంగళం. జన్మకో శివరాత్రి అన్నది ఆర్యోక్తి. దీని అర్ధం సంవత్సరంలో వివిధ కారణాల వల్ల నిర్లక్ష్యం చేయబడ్డ దైవారాధన కనీసం శివరాత్రి రోజు చేసినా సమస్త మంగళాలు ప్రోదిచేసి అందించే దైవం బోళాశంకరుడు అన్నది అందరూ అనుభవైకపూర్వకంగా అనుభవించే సత్యం.
మహా శివరాత్రి అనడానికి..
ప్రతీమాసంలో కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశిని శివరాత్రి అంటారు.ప్రతి మాసంలో వచ్చే ఈ శివరాత్రిని మాసశివరాత్రిగా వ్యవహరిస్తారు. మాఘ కృష్ణ పక్ష చతుర్దశిలో వచ్చే శివరాత్రికి మహాశివరాత్రి అని పేరు.ఈ తిథి నాడు లింగాకారంలో పరమేశ్వరుడు ఆవిర్భవించిన సందర్బంగా పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక దినంగా మహాశివరాత్రిగా జరుపుకుంటాం.
శివ అంటే..
శివ అనే నామమే అత్యంత పవిత్రమైనది.శివ అంటే మంగళం,శుభం,క్షేమం,భద్రం,శాంతం అనే అర్ధాలు చెప్పబడ్డాయి.అన్నిటికీ ఆధారమైనవాడు శివయ్య.అలసిన జీవుడు ధ్యానంలో చేరేది శివ చైతన్యవలయంలోనికే. పరమ శివుని ఆవిర్భావం అందరికీ తెలిసిందే.భక్త సులభుడు మరియు భక్త వరదుడు శంకరుడు అన్నది పురాణాలు ద్వారా అందరికీ సుపరిచితం.
శివతత్వం అంటే..
సాక్షాత్ చదువుల తల్లి సరస్వతీ మాత శివతత్వం గ్రంథస్తం చేసే క్రమంలో ఎంత రాసినా తరగని ఘని అయిన పరమేశ్వరుడి తత్వరచన కోసం కాటుక కొండను కరిగించి "సిరా" (ఇంక్) గానూ, కల్పవృక్షం కొమ్మను "కలం"(పెన్) గాను, భూమాతను "కాగితం"(పేపర్)గా చేసుకుని రచన ప్రారంభించి ఎంత రాసినా పూర్తి కానీ సశేషం శివతత్వం అని గ్రహించి "పరమేశ్వరా నీ తత్వం అందనిది కానీ నీ అనుగ్రహం సులభసాధ్యంగా అందరికీ అందేదీ"అని నిర్వచించారట అమ్మవారు. అంతటి విశిష్టతే శివతత్వం.
శివపూజ..
గీతాచార్యుడయిన శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా తెలిపిన అమృతవాక్కు పురాణాల ద్వారా గ్రహించిన మహనీయులు ప్రపంచానికి అందించినది "కోటి జన్మల పుణ్యఫలం ఉంటే తప్ప శివపూజ చేయలేము".సాక్షాత్ దైవమే చెప్పిన ఈ మాట శివపూజలో ఉన్న ధార్మిక ప్రాధాన్యతను తెలియజేస్తోంది.
ఈ రోజు ఉపవాసమే నైవేద్యం:-
పార్వతీనాధునికి ఉపవాసమే భక్తుడు సమర్పించే నిజమైన నైవేద్యం.తృప్తి కోసం భక్తుడు తాను స్వీకరించే ఆహారం సాత్వికమైనది శివార్పణమ్ చేసి తీసుకోవచ్చు.శక్తి కొద్దీ ఎవరు ఇష్టపూర్వకంగా సమర్పించే ఆహారం అయినా పరమాత్మునికి ప్రీతికరమైనది.
అభిషేకప్రియుడు..
లింగరూపుడు అయిన శివయ్యకు శుద్ధజలం(మంచి నీరు)అత్యంత ప్రీతి కరమయిన అభిషేకద్రవ్యం.గంగాధరుడు కాబట్టి గంగకు అత్యంత ప్రాధాన్యత.మరో రకంగా ఆలోచిస్తే సామాన్యుడికి సైతం అందుబాటులో ఉండే జలం కోరుకున్నాడు భగవానుడు.శక్తి కొద్దీ పంచామృతాలు,పళ్లరసాలు భక్తులు సమర్పిస్తారు.ఒక్కో ద్రవానికి ఒక్కో విశిష్టత చెప్పబడింది.స్థూలంగా శివునికి అభిషేకం అత్యంత ప్రియం.
బిల్వదళం..
మారేడుదళాలు సంవత్సరం మొత్తంలో శిశిరఋతువులో సైతం ఆకురాల్చని విధానం కలిగి ఉండటమే కాక శరీరం లోని వేడిని సైతం తగ్గించే శక్తి కలిగి ఉండడంతో గరళకంటుడికి మారేడుదళం సమర్పిస్తారు భక్తులు.ఈ బిల్వదళం సమర్పణలో ఒక్కో రకమయిన పురాణ వివరణలు కూడా ఉన్నాయి. ఈ శివరాత్రి రోజును ఉపవాసంతో శివుడిని అర్చించి జాగరణ చేయడం అనేది అత్యంత కష్టమైన విధి విధానం. వీటన్నింటిని కనీసం ఒక్కసారైన ఆచరించే పూజ చేయగలిగితే చాలని జన్మకో శివరాత్రి అన్నారు. అందులోనూ మాఘమాసం ఈ చలికాలంలో ఇవన్నీ ఒక్కసారైన నియమంగా చేస్తే చాలనే ఉద్దేశ్యంతో వచ్చిన ఆర్కోక్తి జన్మకో శివరాత్రి. అందువల్లే దీన్ని మహా శివరాత్రి అని కూడా పిలవడం జరిగింది.
ఐక్యతకు శివకుటుంబం ఆదర్శం..
పరస్పర వైరభావం కలిగిన వాహనాలు ఎద్దు,సింహం,నెమలి,ఎలుక ఏంతో అన్యోన్యతతో ఒదిగి ఉండటం ప్రస్తుత సమాజానికి ఒక విలువైన పాఠం.ఎన్నో వైరుధ్యాలు,భావాలు,వ్యక్తిత్వాలు ఉన్నా సమాజం అనే గొడుగు క్రింద అందరం అన్యోన్యంగా ఉన్నప్పుడే భావితరాలకి శాంతి మరియు సౌబ్రాతృత్వాలు అందించగలం.ఐక్యతే విజయ సూత్రం అని చెబుతోంది శివకుటుంబం. దయగల దైవం చంద్రశేఖరుడు. భక్తితో శివునికి చేరవ్వవుదాం. సత్కర్మలు ఆచరించి నిశ్చలమైన భక్తి, విశ్వాసాలను ఇవ్మమని అడుదాం. శివతత్వాన్ని శాశ్వతం చేసుకుందాం మన నిత్య జీవనవిధానంలో..
(చదవండి: శివయ్య అనుగ్రహం కావాలంటే..)
Comments
Please login to add a commentAdd a comment