సాధారణంగా యూత్ ఏం చేస్తుంది? చదువు, కెరీర్ బిల్డింగ్, డేటింగ్స్‌తో తలమునకలై ఉంటుంది. ఖాళీ సమయాల్లో..? సోషల్ మీడియా.. పబ్‌లు.. క్లబ్‌లు.. సినిమాలు.. అవుటింగ్‌లు.. ఎట్‌సెట్రా! కదా.. కానీ ఈ అబ్బాయి.. మేసన్ డెస్‌చాంప్స్ మాత్రం చకచకా ఆకాశ హార్మ్యాలు ఎక్కేస్తాడు.. తాళ్లు, కొక్కాలు, జీనులు వంటివాటి ఆసరా ఏమీ లేకుండా. మేసన్ వయసు 22 ఏళ్లు. లాస్ వేగస్‌లోని యూనిర్శిటీ ఆఫ్ నెవాడలో ఫైనాన్స్ స్టూడెంట్.
కాలేజీకి ఒక్క పూట సెలవు దొరికినా దగ్గరున్న బిల్డింగులను వెదుక్కుని మరీ చివరి అంతస్తుకి పాకేస్తాడు. అది అతని సరదా. అయితే దానికి ఓ లక్ష్యాన్ని పెట్టుకున్నాడు. ఇన్ని రోజుల్లో ఇన్ని భవంతులకు ఎక్కాలని కాదు.. ఎన్ని అంతస్తుల మేడనైనా ఏ సహాయమూ లేకుండా ఇట్టే ఎక్కేసి చూపిస్తా .. ఫలానా అన్ని డాలర్లు ఇస్తారా అని సవాలు విసురుతాడు. దాని ద్వారా వచ్చిన డబ్బును యాంటీ అబార్షన్ ప్రాజెక్ట్‌కు ఖర్చు పెడ్తాడు.
అవును.. ఆ మేసన్ అబార్షన్లకు వ్యతిరేకి. పెళ్లి కాకుండా, పెళ్లయినా ఇష్టం లేని లేదా మానసికంగా సిద్ధంగా లేని, లేదా ఆర్థికలేమిలో ఉన్న అమ్మాయిలు, మహిళలు అబార్షన్‌ను ఆశ్రయించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని.. అది నివారించడానికి మేసన్ యాంటీ అబార్షన్ యాక్టివిస్ట్ అయ్యాడు. తాను మేడలెక్కి సంపాదిస్తున్న డబ్బును వీళ్ల డెలివరీలకు ఖర్చు పెడ్తున్నాడు. అలా పుట్టిన పిల్లలను దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చే జంటలను ప్రోత్సహించే ప్రాజెక్ట్ కోసమూ వెచ్చిస్తున్నాడు.
అయితే.. ఆ ఉద్దేశం మంచిదే అయినప్పటికీ ఇలా కనిపించిన మేడల్లా ఎక్కుతూ ఏ కాలో .. చెయ్యో.. నడుమో విరగ్గొట్టుకుంటే.. లేదా ప్రాణాల మీదకే తెచ్చుకుంటే ఎలా? ఎవరు దీనికి పూచీకత్తు? పైగా ముందస్తు అనుమతుల్లేకుండా బిల్డింగులు ఎక్కడమేంటి? తప్పు కదా? అంటూ స్థానిక ప్రభుత్వ సంస్థలు మేసన్ సాహసాన్ని తప్పుపట్టాయి. ఇటీవలే శాన్‌ఫ్రాన్సిస్కోలోని వెయ్యిడెబ్భై అడుగుల ఎత్తున్న 61 అంతస్తుల భవనాన్ని చకచకా ఎక్కేశాడు.
అయితే స్థానిక సంస్థల ఆగ్రహం ఫలితంగా అతను ఆ భవంతిని దిగేలోపు పోలీసులు వచ్చి అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఇప్పుడు కాలిఫోర్నియా, నెవాడ రాష్ట్రాల్లో టాక్ ఆఫ్ ది స్టేట్స్ ఈ మగానుభావుడే. ఇతనికి ‘ప్రో– లైఫ్ స్పైడర్‌మ్యాన్’ అని పేరు పెట్టుకుని మరీ ఆ అబ్బాయి గురించి చర్చించుకుంటున్నారు. ఇప్పుడు అతని కేస్ కోర్ట్‌లో ఉంది. ఎక్కితే ఎక్కావ్ కానీ పర్మిషన్ తీసుకో నాయనా అంటోంది కోర్ట్. ‘ఎహే.. నా కిష్టమైన.. పై నుంచి నాతోని ఎవరికీ ఇబ్బంది కలగని పనికి ఎవరినో పర్మిషన్ అడుగుడేంది? అట్లనే ఉంటది మనతోని’ అని వాదిస్తున్నాడు మేసన్. అడాప్షన్ ఓవర్ ది అబార్షన్ (అబార్షన్ బదులు అడాప్షన్) పేరిట ఈ అబ్బాయి సాగిస్తున్న ఉద్యమం అతని అరెస్ట్‌తో అమెరికా అంతటికీ తెలిసిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment