మోస్ట్ ఇన్‌స్పైరింగ్ వుమెన్: ముగ్ధ కల్రా
Mugdha Kalra: Not That Different Autism Rights Activist BBC 100 Women List: బ్యాంకులో ఉద్యోగం చేసే ఒక వ్యక్తి తన భార్యతో కలిసి ఆరోజు ముంబైలోని ముగ్ధ కల్రా ఇంటికి వచ్చాడు. వారి ముఖాలలో దిగులు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ‘సమస్య ఏమిటి?’ అని అడగక ముందే ఆయన ఇలా చెప్పాడు... ‘మీ గురించి చాలాసార్లు విన్నాము. చదివాము. మా సమస్యకు మీరే ఒక పరిష్కారం చూపాలి. మా బాబుకు ఆటిజం సమస్య ఉంది. వాడిని చూస్తుంటే బాధగా ఉంది. వాడి భవిష్యత్‌ను ఊహించుకుంటే భయంగా ఉంది.
ఏదైనా ఫంక్షన్‌కు వెళ్లాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నాం...’ ముగ్ధ ఇంటిని వెదుక్కుంటూ వచ్చి ఇలా తమ మనసులోని బాధను చెప్పుకునే వారు ఎందరో ఉంటారు. వారిలో ఎన్నో అపోహలు గూడుకట్టుకొని ఉన్న విషయాన్ని ఆ సందర్భంలో గ్రహించేది ముగ్ధ. ముందుగా వారిలోని అపోహలను తొలగించేది. అలా వారి మనసులను తేలిక చేసేది.
‘ఆటిజం అనేది అంగవైకల్యం కాదు... న్యూరోడైవర్శిటీ మాత్రమే’... ‘వారిని ఎప్పుడూ ఇంటికి మాత్రమే పరిమితం చేయకూడదు. ఔట్‌డౌర్ యాక్టివిటీలకు ప్రాధాన్యాన్ని ఇవ్వండి. సైకిలింగ్, స్విమ్మింగ్, గార్డెనింగ్.. మొదలైనవి చేయించండి’ .. ‘వారిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకండి... వారికి దగ్గరగా కూర్చొని కళ్లలోకి చూస్తూ ప్రేమగా మాట్లాడండి’ ..
‘ప్రపంచంలోని ఎంతోమంది గొప్ప మేధావుల్లోనూ ఆటిజం లక్షణాలు ఉండేవనే విషయం మీకు తెలుసా!’... మాట సహాయం కోసం తన ఇంటికి వచ్చిన వారికి ఇలాంటి విషయాలు ఎన్నో చెబుతుంటుంది ముగ్ధ. నిజానికి ఆమె డాక్టర్ కాదు. పన్నెండు సంవత్సరాల తన కుమారుడికి ఆటిజం ఉంది. అయితే అదొక సమస్య అని ముగ్ధ ఎప్పుడూ అనుకోలేదు.
‘నా కొడుకు కోసం ప్రత్యేక ప్రపంచాన్ని సృష్టించుకోవాలనుకోలేదు. అతను ఈ ప్రపంచం నుంచే వచ్చాడు. కాబట్టి ఈ ప్రపంచంతోనే ఉండాలి. అందుకు అనువైన వాతావరణాన్ని సృష్టించాల్సిన బాధ్యత మనపై ఉంది’ అంటున్న ముగ్ధ ఆటిజం రైట్స్ యాక్టివిస్ట్‌గా ఎంతోమందికి ధైర్యాన్ని ఇస్తుంది. ఎంతోమందిలో ఉన్న అజ్ఞానాన్ని,
అపోహలను తొలగిస్తుంది.
‘నాట్ దట్ డిఫరెంట్’ పేరుతో ఒక ఉద్యమాన్ని ప్రారంభించింది. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది. ‘నాలో ఎలాంటి అపోహలు, అకారణ భయాలు లేకుండా పిల్లాడిని సంపూర్ణంగా అర్ధం చేసుకున్నాను. అప్పుడు అనిపించింది... హి ఈజ్ నాట్ దట్ డిఫరెంట్’ అంటున్న ముగ్ధ తాను అనుకున్న మాటలోని ‘నాట్ దట్ డిఫరెంట్’ను మూమెంట్‌కు పేరుగా ఎంచుకొంది. యూట్యూబ్‌లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ఆటిజం ఉన్న పిల్లలతో ఎలా వ్యవహరించాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనేదానిపై ఎన్నో విషయాలు చెబుతుంది ముగ్ధ.
పెద్దల సంగతి సరే, పిల్లల మాటేమిటి?
కొందరు పిల్లలు, ఆటిజం ఉన్న పిల్లలతో వ్యవహరించే తీరు బాగుండదు. ‘అలా చేయడం తప్పు. వారు మీలాంటి పిల్లలే. మీ ఫ్రెండ్సే’ ఇలాంటి అవగాహనను పిల్లలలో కలిగించడానికి కామిక్ స్ట్రిప్‌లను తయారు చేయించి ప్రచారం చేసింది. అవి మంచి ఫలితాన్ని ఇస్తున్నాయి. తాజాగా ముగ్ధ పేరు బిబిసి–2021 ‘మోస్ట్ ఇన్‌స్పైరింగ్ అండ్ ఇన్‌ఫ్లూయెన్షియల్ ఉమెన్–వరల్డ్’ జాబితాలో చోటు చేసుకుంది.
చదవండి: Bipin Rawat Wife Madhulika: భర్తకు తగ్గ భార్య.. ఆఖరి శ్వాస వరకు ఆయనతోనే
Comments
Please login to add a commentAdd a comment