Neha Rastogi: Significance of breastfeeding centers in India - Sakshi
Sakshi News home page

టాయ్‌లెట్‌లో కూర్చొని  మనం తినగలమా? మరి అలాంటప్పుడు..

Published Wed, May 31 2023 2:42 PM | Last Updated on Wed, May 31 2023 3:24 PM

Neha Rastogi: Significance Of Breastfeeding Centers In India - Sakshi

నేహా రస్తోగి

టాయ్‌లెట్‌లో కూర్చొని మనం తినగలమా? మరి అలాంటప్పుడు తల్లులు తమ పిల్లలకు బహిరంగ ప్రదేశాల్లో పాలివ్వడానికి పబ్లిక్‌ టాయిలెట్లకు ఎందుకు వెళ్లాలి? సిగరెట్‌ తాగడం కోసం స్మోకింగ్‌ జోన్‌లు ఏర్పాటు చేస్తారు. కానీ, ఆకలితో ఉన్న పిల్లలకు పాలివ్వడానికి ప్రతిచోటా బ్రెస్ట్‌ ఫీడింగ్‌ రూమ్‌లు ఎందుకు లేవు? అందరి ముందు తమ బిడ్డకు పాలిచ్చే తల్లులు ప్రజల చెడు దృష్టిని ఎందుకు ఎదుర్కోవాలి?

ఢిల్లీవాసి, న్యాయవాది నేహా రస్తోగి ఈ సమస్యల నుండి తల్లులను రక్షించడానికి ప్రచారాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా పింక్‌ టాయిలెట్లు, పిల్లలకు తల్లిపాలు ఇచ్చే గదులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికీ ఆమె ఈ దిశగా తన ప్రచారాన్ని కొనసాగిస్తూనే ఉంది. ప్రజల్లో అవగాహన కలిగిస్తూనే ఉంది. ఇంతకీ నేహా రస్తోగి తల్లిపాల ఆలయాలు ఎందుకు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేసింది. దీని ద్వారా ఆమె ఏం సాధిస్తోంది. లాయర్‌గా ఆమె పోరాటం దేనికి? 

ముందుగా తను ఎదుర్కొన్న సమస్యను వివరిస్తూ..  ‘‘నేను 2017, అక్టోబరులో మొదటిసారి తల్లిని అయ్యాను. నా బాబుకి మూడు నెలల వయసున్నప్పుడు బెంగళూరు వెళ్లాల్సి వచ్చింది. ఢిల్లీ నుంచి బయల్దేరాలి. గంటల గంటల ట్రాఫిక్‌ తాకిడిని తప్పించుకుంటూ విమానాశ్రయానికి చేరుకునేసరికి బాబు ఆకలితో ఏడుపు మొదలెట్టాడు. అక్కడ వాడికి పాలు ఎక్కడ ఇవ్వాలో తెలియలేదు. 

వాష్‌రూమ్‌లో తల్లి పాలు
తల్లిపాలు పట్టేందుకు విమానాశ్రయంలోని వాష్‌రూమ్‌కి వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత ఫ్లైట్‌లో వాడికి మరోసారి ఆకలి వేసింది. పక్కన కూర్చున్న వ్యక్తిని ‘బిడ్డకు పాలు పట్టాలి, కొద్దిగా స్థలం ఇవ్వమని అడిగాను. కానీ, అతను కాదన్నాడు. ఎయిర్‌హోస్టెస్‌ను అడిగితే ‘టాయ్‌లెట్‌కి వెళ్లు’ అని చెప్పింది. చాలాసేపు ప్రాధేయపడ్డాక ఎయిర్‌ హోస్టెస్‌ కూర్చున్న చోట కూర్చుని, పిల్లవాడికి పాలు పట్టాను.

బెంగళూరు విమానాశ్రయంలోనూ బిడ్డకు తల్లి పాలు పట్టేందుకు చోటు లేదు. అలా బిడ్డతో నా మొదటి ప్రయాణం వ్యవస్థ నిర్లక్ష్యం కారణంగా చాలా బాధకారంగా అనిపించింది. గంటల తరబడి నా కొడుకు ఆకలితో ఏడుస్తూ ఉంటే, నేను నిస్సహాయంగా ఉండిపోయాను. 

విషయ సేకరణ 
ఈ సంఘటన తర్వాత నేను దేశవ్యాప్త సమాచారాన్ని సేకరించే పనిలో పడ్డాను. దేశంలో ఎక్కడా చంటి బిడ్డలకు తల్లిపాలు పట్టే గదులు లేవని తెలిసింది. ఈ విషయంపై చాలా మంది మహిళలతో మాట్లాడి, వారి బాధాకరమైన అనుభవాలను విన్నాను. నాలాంటి తల్లులకు బహిరంగ ప్రదేశాల్లో పాలిచ్చే హక్కును కల్పించాలని, అందుకు ఎంతకాలం యుద్ధం చేసినా పర్వాలేదని నిర్ణయించుకున్నా.

అదే సమయంలో ఓ ఎంపీ కూడా ఈ అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తుతానని హామీ ఇచ్చారు. అప్పుడే ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గీతా మిట్టల్‌ ఈ కేసు విచారణ సందర్భంగా దేశవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాలలో లక్షలాదిమంది చంటిబిడ్డలకు తల్లిపాలు ఇచ్చే ఏర్పాటు లేదని తెలుసుకొని ఆశ్చర్యపోయారు.

రైల్వేస్టేషన్, బస్టాప్, ఎయిర్‌పోర్ట్, మాల్స్‌తో సహా ప్రతి బహిరంగ ప్రదేశాల్లో తల్లిపాల బూత్‌లు ఏర్పాటు చేయాలని కోర్టును కోరాను. తల్లులు పనిచేసే ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాల్లో కూడా ఈ సదుపాయాన్ని కల్పించాలన్నాను. 

లైంగిక వేధింపులు
బిడ్డలకు చనుబాలివ్వడానికి గదులు అందుబాటులో లేకపోవడంతో తల్లులు రద్దీగా ఉండే ప్రాంతాల్లోనే తమ పిల్లలకు పాలివ్వాల్సి వస్తోంది. ఈ సమయంలో వారు లైంగిక వేధింపులను కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది. తల్లి గౌరవాన్ని దెబ్బతీసే వారు ఆమెను గౌరవంగా చూడరు. కంప్లైంట్‌ చేస్తే టాయ్‌లెట్‌లో కూర్చొని పాలు ఇవ్వమని సలహా ఇచ్చేవారున్నారు. కానీ, అటువంటి మురికి, దుర్వాసన ఉన్న ప్రదేశంలో కూర్చొని పాలు ఇవ్వడం తల్లి, బిడ్డ ఇద్దరి ఆరోగ్యానికీ ప్రమాదకరం. 

ఈ సమస్యకు సంబంధించి అన్ని శాఖలు, ఏజెన్సీలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 2019లో నిర్ణయం తీసుకుని, ఫీడింగ్‌ రూమ్‌లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ సదుపాయాన్ని కల్పించాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు పంపారు. హైకోర్టు తీర్పు తర్వాత చైనా, అమెరికా, లండన్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీడియా దానిని కవర్‌ చేసింది.

ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంలో కనీస సౌకర్యాలు కూడా లేవని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. హైకోర్టు నిర్ణయం తర్వాత పింక్‌ టాయిలెట్, బ్రెస్ట్‌ ఫీడింగ్‌ రూమ్‌ ప్రారంభమైంది. ఇందులో తల్లులకు ప్రత్యేక భోజన గదులు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ తల్లి హాయిగా కూర్చొని బిడ్డకు పాలు పట్టచ్చు.

స్నానం చేసి, బట్టలు కూడా మార్చుకోవచ్చు. ఢిల్లీలో కన్నాట్‌ ప్లేస్‌లోని పార్లమెంట్‌ స్ట్రీట్‌లో మొదటి ఫీడింగ్‌ రూమ్‌ను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఆ తర్వాత ఢిల్లీ ఎన్‌సిఆర్‌లో 700కు పైగా పింక్‌ టాయిలెట్లు ఏర్పాటు చేశారు. 

ఆలయాల నుంచీ.. 
షిర్డీలో సాయిబాబా ఆలయం నుండి తాజ్‌మహల్‌ వరకు తల్లిపాలు ఇచ్చే గదులు నిర్మించారు. బస్టాప్‌లు, రైల్వే స్టేషన్‌లలో తల్లిపాల క్యాబిన్లు ప్రారంభించారు. ఇప్పుడు రైల్వేస్టేషన్‌లలోనే కాదు రైళ్లలో కూడా ప్రత్యేక ఫీడింగ్‌ క్యాబిన్లను తయారుచేస్తున్నారు. ఈ విజయం ప్రభావం దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ కనిపించింది. 

తల్లి పాల బ్యాంక్‌
దేశంలో ఏ ఒక్క తల్లీ బిడ్డ కూడా బహిరంగ ప్రదేశాల్లో ఫీడింగ్‌ సమస్యను ఎదుర్కోకూడదు. ఈ ఆలోచనతో ‘మాతృ స్పర్ష్‌ ఇనిషియేటివ్‌ బై అవ్యన్‌ ఫౌండేషన్‌’ పేరుతో ఒక ఎన్జీవోని ప్రారంభించాను. దీని ద్వారా ఫీడింగ్‌ రూమ్, తల్లి పాల బ్యాంకు సౌకర్యాన్ని కల్పించే ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాను. ఇప్పుడు చాలా మంది తల్లి పాలు కావాలనే వాళ్లు కూడా సంప్రదిస్తున్నారు.

దీంతో తల్లిపాలను దానం చేయాలనుకుంటున్న తల్లుల నుంచి పాలుతీసుకొని, అవసరమైన పిల్లలకు ఇస్తుంటాం. ఈ పనిలో ప్రభుత్వాలు చొరవ తీసుకుంటే, ప్రతి బిడ్డ తల్లి పాలు సులభంగా పొందుతుంది. ఆ దిశగానే ఇప్పుడు నేను ప్రయత్నిస్తున్నాను. 

లండన్‌ యూనివర్శిటీలో జరుగుతున్న పరిశోధనలో నేను వాదించిన తల్లిపాల కేసు చేర్చారు. కేవలం తొమ్మిది నెలల వయసులో పిల్‌ దాఖలు చేసినందుకు నా కొడుకు అవ్యన్‌ పేరు ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో నమోదైంది. రొమ్ము లైంగిక అవయవం కాదు. ఇది తల్లి–బిడ్డల మధ్య పవిత్ర సంబంధాన్ని కలిగిస్తుంది. ఈ పోరాటం అంత సులువు కాలేదు. మాది చిన్న కుటుంబం.

నా కొడుకు సిజేరియన్‌ ద్వారా పుట్టాడు. ఈ పోరాటంలో నేను ఆపరేషన్‌ నుంచి  చాలా రోజుల వరకు కోలుకోలేకపోయాను. ఇంటి నుండి కోర్టు పనులు పూర్తయ్యేవరకు పిల్లాడిని పట్టుకొనేదాన్ని. సమాజంలో పాతకాలపు ఆలోచనలను మార్చడం పెద్ద సవాల్‌. ఎంతో మంది మహిళలు కూడా ఎన్ని ఇబ్బందులు పడినా మాట్లాడలేకపోతున్నారు’’ అంటూ ఈ సమస్య గురించి సుధీర్గంగా తన గళం వినిపిస్తారు ఈ లాయర్‌.

చదవండి: రూమ్‌, ఫుడ్‌ ఉచితం, మంచి జీతం.. జాబ్‌ ఏంటని తెలిస్తే షాక్‌ అవుతారు!
  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement