
‘బరిలో బడా బడా ఫైటర్లు ఉన్నారు. నీవల్ల ఎక్కడవుతుంది’ అనే మాట విని ‘నిజమే సుమండీ’ అని అమాయకంగా వెనుతిరిగేవాళ్లు ఎప్పుడూ ఫైటర్లు కాలేరు. ‘నేనేమీ చిన్నవాడిని కాదు’ అనే ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగే వాళ్లే సత్తా నిరూపించుకునే ఫైటర్లు అవుతారు. స్టార్టప్ కంపెనీలు కూడా అంతే. కొన్ని సంవత్సరాల క్రితం మొదలైన చిన్నపాటి స్టార్టప్ కంపెనీ ‘ఆస్ట్రోమ్’ గిగా మెష్ అనే ఆవిష్కరణతో అద్భుతాన్ని సాధించింది. యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది..
ఇంటర్నెట్ అనేది ఇప్పుడు ఇంటింటి అవసరంగా మారింది. ఇ-కామర్స్ పెరిగాక బడా కంపెనీలకు పట్టణాలు, ఒక మాదిరి పట్టణాలతో పాటు పల్లెలు కూడా ఆత్మీయనేస్తాలయ్యాయి. కానీ ఏంలాభం? పట్టణాలతో పోల్చితే మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు ఎంత కష్టమో తెలియందేమీ కాదు. ఫైబర్ భారం లేకుండా, ఖర్చు తక్కువగా మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్‌ను తేవడం ఎలా? సరిగ్గా ఈ ప్రశ్న నుంచి పుట్టుకువచ్చిందే ఆస్ట్రోమ్. ప్రసాద్ హెచ్.ఎల్.భట్‌తో కలిసి 2016లో బెంగళూరులో ఈ స్టార్టప్ మొదలుపెట్టారు నేహా శతక్.
మారుమూల ప్రాంతాలకు హైస్పీడ్ ఇంటర్నెట్ ఆలోచన తొలిసారిగా ‘ఆస్ట్రోమ్’కేమీ రాలేదు. అంతకుముందే గూగుల్, ఫేస్‌బుక్, స్పేస్‌ఎక్స్‌లాంటి దిగ్గజాలతో పాటు వన్‌వెబ్, బోయింగ్‌లాంటివి ప్రయోగాలు చేస్తున్నాయి. ‘అంత పెద్ద సంస్థల ముందు మనం ఎంత?’ అని ఢీలా పడిపోలేదు నేహా. డ్రోన్స్‌కు మినియేచర్ వెర్షన్ ‘మైక్రోలెవెల్స్–వెహికిల్స్’ రూపకల్పనతో మొదలైన ఆమె ప్రయాణం ‘గిగా మెష్’తో పతాకస్థాయికి చేరింది. మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ అందించడానికి వైర్‌లెస్ బ్యాక్‌హాల్ టెక్నాలజీ ఉన్నప్పటికీ ఖర్చు ఎక్కువ, డేటా స్పీడ్ పెరగకపోవడంలాంటి పరిమితులు ఉన్నాయి. ‘ఆస్ట్రోమ్’ వారి వైర్‌లెస్ డివైజ్ ‘గిగా మెష్’తో తక్కువ ఖర్చుతో వేగంగా ఇంటర్నెట్ సేవలు అందించవచ్చు. దీనికి ఇటీవలే మన దేశంతో పాటు అమెరికాలోనూ పేటెంట్ లభించింది. త్వరలో దీని సేవలు అందుబాటులోకి రానున్నాయి.
‘ఆస్ట్రోమ్’ వ్యవస్థాపకురాలు, సీయివో నేహా శతక్ స్వస్థలం రాజస్థాన్‌లోని బ్యావర్. పదవతరగతి పూర్తికాగానే పై చదువుల కోసం జైపూర్‌కు వచ్చారు. తన జీవితంలో ఇదో పెద్ద ముందడుగు అని చమత్కరిస్తారు ఆమె. ‘పదవతరగతి పూర్తయింది కదా...ఆడపిల్లకు ఈమాత్రం చదువు చాలు’ అనుకునే ప్రాంతం అది. అయితే నేహా తల్లిదండ్రులు అలా ఆలోచించలేదు. ఆమెను బాగా ప్రోత్సహించారు. ‘ఒక కుటుంబంలో ఆడపిల్లను పెద్ద చదువులు చదివిస్తే మిగిలిన వాళ్లు స్ఫూర్తి పొంది అదే బాటలో పయనిస్తారు. మా అమ్మాయిని ఇంజనీరింగ్ కాలేజీలో ఎలా చదివించాలి? అని ఒకరోజు అమ్మను అడిగాడు మాకు పాలుపోసే వ్యక్తి’ అంటూ గుర్తు చేసుకుంటారు నేహా
నేహాకు సైన్స్–ఫిక్షన్ నవలలు చదవడం, టీవీ సీరియల్స్ చూడడం అంటే ఇష్టం. ఈ ఇష్టమే ఆమెను ఏరోస్పేస్ ఫీల్డ్‌పై ఆసక్తిని పెంచింది. యూఎస్‌లో పీహెచ్‌డి చేసిన నేహా ఏదో ఒక సంస్థలో ఉద్యోగం చేయడం అని కాకుండా తనను తాను నిరూపించుకోవడానికి ఏరోస్పేస్ట్ ఫీల్డ్‌లో కంపెనీ స్థాపించాలనుకున్నారు. ఇండియాకు తిరిగి వచ్చిన తరువాత తనకు పాఠాలు చెప్పిన గురువును సలహా అడిగారు. ఆయన నేహాను ఆశీర్వదించి ఇ–కామర్స్ స్టారప్‌పై పనిచేస్తున్న ప్రసాద్ భట్‌కు పరిచయం చేశారు. అలా ‘ఆస్ట్రోమ్’ ప్రయాణం మొదలైంది. ‘భూమిపై మనం ఎదుర్కునే సమస్యలకు ఆకాశంలో పరిష్కారాలు వెదకాలి’ అనేది నేహా సిద్ధాంతం. అనంతమైన ఆకాశం సృజనాత్మకమైన ఆవిష్కరణలకు గొప్ప అవకాశం అంటారు ఆమె.
ఆస్ట్రోమ్ అస్త్రం
మారుమూల ప్రాంతాల్లోనే కాదు ఇంట్లో కూడా తరచుగా ఇంటర్నెట్ సమస్యలు ఎదురవుతుంటాయి. ‘గిగా మెష్’తో అలాంటి సమస్య ఉండబోదని హామీ ఇస్తుంది ఆస్ట్రోమ్. ప్లగ్ అండ్ ప్లే వైఫై శాటిలైట్ అయిన ‘గిగా మెష్’ను సులభంగా ఉపయోగించవచ్చు. కట్టింగ్–ఎడ్జ్ మెష్ వైఫై, బీమ్ ఫార్మింగ్ సాంకేతికజ్ఞానంతో అధికవేగంతో ఇది సేవలు అందిస్తుంది.
ఆకాశమే గొప్ప అవకాశం!
మనం ఒక రంగంలో పనిచేస్తున్నప్పుడు పోలిక తప్పనిసరిగా మొదలవుతుంది. ప్రతికూలంగా తీసుకుంటే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము. పాజిటివ్‌గా తీసుకుంటే ఏదైనా చేయగలం. పోలిక ద్వారా జరిగే విశ్లేషణలో మనకు ఉన్న పరిమితులతోనే గొప్పగా ఎలా ప్రయత్నించవచ్చో ఆలోచించాలి. భూమి మీద మనం ఎదుర్కునే సమస్యలకు ఆకాశంలో పరిష్కారాలు వెదకాలి.
– నేహా శతక్,ఆస్ట్రోమ్
సహ వ్యవస్థాపకురాలు,
సీయివో
Comments
Please login to add a commentAdd a comment