పాత భావాలు... పారేయము. అటక మీద పాత సరుకు.. పారేయము. పంచేయము. పాత బట్టలు, బూట్లు... పారేయము. పంచేయము. అవసరం లేని ఇంటిని ఆక్రమించిన చెడిపోయిన వస్తువులు? పారేయము. పంచేయము. కొత్తవి రావాలంటే పాతవి ఖాళీ చేయాలి. కొత్త సంవత్సరం వచ్చేసింది. పాతవి పారేయండి. లేదా అవసరం ఉన్నవారికి పంచేయండి.కొత్తకు దారివ్వండి.
కొత్త సంవత్సరం వస్తుంటే కొత్త నిర్ణయాలు తీసుకోవాలనిపిస్తుంది. దానికి ముందు పాతవి పారేయాలి కదా. పాతను తీసేయాలి కదా. అక్కరలేని పాతవి అక్కర ఉన్నవారికి కనీసం పంచేయాలి కదా. ఆ పని చేయము. కొత్త సంవత్సరానికి రెడీ కావడం అంటే కొత్తగా రెడీ కావడమే. కొత్త సంవత్సరంలో తేలిగ్గా ప్రవేశించాలి. పాత లగేజ్‌తో కాదు. ఎన్ని ఉంటాయి పాతవి ఇళ్లల్లో. పేరబెట్టుకొని. అడ్డంగా. స్పేస్ ఆక్యుపై చేసి. ఇంట్లో ఏయే పాత వస్తువుల బరువు దించుకోవాలో చూద్దామా?
ఆ భారీ పాత సోఫా
మన ఇంటి సోఫా జన్మ సంవత్సరం ఏమోగాని దాని ఆయుష్షు తీరి చాలా రోజులై ఉంటుంది. కవర్లు మార్చి, చిరిగిన చోట ప్యాచ్ వేసి, కిరకిరమంటుంటే మానేజ్ చేస్తూ, చిల్లులు పడుంటే పైన బెడ్‌షీట్ వేస్తూ... డబ్బులు లేకపోతే సరే. ఉంటే కొత్త సోఫా తెచ్చుకోండి. ఇల్లు కొత్తదిగా కనిపించాలంటే మారే కాలంతో పాటు వచ్చే ఫర్నీచర్ తెచ్చుకోవాలి. ఖరీదైనదే అక్కర్లేదు. రోడ్‌సైడ్ కూడా మోడరన్ ఫర్నీచర్ దొరుకుతుంది. ఆ పాత సోఫాను వాచ్‌మన్‌కు ఇచ్చేయండి. దానిని పెన్నిధిగా భావించే ఏ కారు డ్రైవర్‌కో లేదంటే అవసరం ఉన్నవారికో ఇచ్చేయండి. ఇల్లు బరువు తగ్గుతుంది. కొత్త కళ వస్తుంది.
పాత బట్టలు, పుస్తకాలు
ప్రతి ఇంట్లో ఏవి ఉన్నా ఏవి లేకున్నా ఇవి ఇబ్బడి ముబ్బడిగా ఉంటాయి. భర్తవి, భార్యవి, పిల్లలవి మళ్లీ పొరపాటున వేసుకోరు అని తెలిసినా ఆ బట్టలను కూరి కూరి బీరువాలలో నింపి ఉంటారు. వాటిని ఈ చలికాలంలో పేదవారికి పంచేస్తే ఎంత గుండె తేలిక. ఇల్లు తేలిక. పిల్లలు స్కూలు పుస్తకాలు కూడా దాచి ఉంటారు. పాత క్లాసులవి ఎందుకు. ఎవరికైనా ఇచ్చేయొచ్చు. ఇంట్లో ఎప్పటెప్పటివో పుస్తకాలు ఉంటాయి. వాటిలో కొన్నే విలువైనవి. కొన్ని ఒకసారి చదివితే చాలనిపించేవి. ఆ ఒకసారి చదవదగ్గ పుస్తకాలను వేరేవాళ్లకు ఇచ్చేయాలి. హ్యాపీగా ఉంటుంది.
షూ ర్యాక్ క్లీన్ చేయండి
ప్రతి ఇంటి షూ ర్యాక్ పాత చెప్పులు, బూట్లు దుమ్ముపట్టి పోయి ఉంటాయి. వాటిని వాడేది లేదు. అలాగని పారేసేది లేదు. పిల్లల షూస్ కూడా ఉంటాయి. వాటిని పేద పిల్లలకు ఇచ్చేస్తే సంతోషంగా వేసుకుంటారు. చెప్పులు నిరుపేదలకు ఇచ్చేస్తే వేసుకుంటారు. పాతవి పోతే కొత్త చెప్పులు కొనుక్కోవచ్చు. ఈ న్యూ ఇయర్‌కి కొత్త చెప్పులు తొడుక్కోండి.
అటక మీద ఉంటుంది రహస్యం
అటక మీద తోసేస్తాం చాలా. పాత తపేలాలు, కీబోర్డులు, చెంబులు, కుర్చీలు, మిక్సీలు, గ్రైండర్‌లు... అవన్నీ ఎందుకు దాస్తామో తెలియదు. వాటిని ఎవరికైనా ఇస్తే సరి చేయించుకుని వాడుకుంటారు. లేదా పాత సామాన్లవాడికి వేస్తే మనకే కొద్దిగా చిల్లర వస్తుంది. అవి బూజుపట్టి వికారంగా కనిపిస్తే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పరిపూర్ణంగా తిరుగాడదు. ఇంకా బాల్కనీల్లో అక్కర్లేని సామాన్లు ఉంటాయి. వాష్ ఏరియాల్లో బోలెడన్ని పనికిరాని వస్తువులు ఉంటాయి. మిద్దె మీద కొందరు పనికి రానిదంతా దాస్తారు ఎందుకో. అన్నీ పారేయండి. పంచేయండి. కొత్త సంవత్సరం కోసం ఇంటిని మీ మనసును తేలిగ్గా చేసుకోండి. కొత్త వెలుతురు కు దారి ఇవ్వండి. అదిగో ఇవాళ మీరు ఫలానా వస్తువు ఇచ్చారన్న ఆనందంతో కొంతమంది అయినా న్యూ ఇయర్‌లోకి అడుగు పెట్టేలా చేయండి. సరేనా?
Comments
Please login to add a commentAdd a comment