బలవంతంగా లాక్కొని వెళ్లి.. ఇదేం చర్య? వాళ్లూ మనుషులే కదా! | Noida woman holds domestic help captive | Sakshi
Sakshi News home page

బలవంతంగా లాక్కొని వెళ్లి.. ఇదేం చర్య? వాళ్లూ మనుషులే కదా! ఇకపై అలా చేయకండి

Published Thu, Dec 29 2022 4:33 AM | Last Updated on Thu, Dec 29 2022 11:10 AM

Noida woman holds domestic help captive - Sakshi

బుధవారం వైరల్‌ అయిన వీడియో దృశ్యం

బుధవారం ఒక వీడియో వైరల్‌ అయ్యింది. ఢిల్లీ నోయిడాలోని ఒక సొసైటీలో 20 ఏళ్ల పనిమనిషిని ఆమె యజమాని బలవంతంగా లాక్కుని పోయే వీడియో అందరూ చూశారు. ‘పని చేయను మొర్రో’ అంటున్నా వినకుండా ఆ పనిమనిషిని తన ఇంటికి తీసుకెళ్లి హింసించింది ఆ యజమాని.

ఇటీవల మనిమనుషులను హింసించి వార్తలకెక్కుతున్న యజమానులు ఎక్కువగా ఉన్నారు. పని మనుషులు స్త్రీలు. ఇంట్లో పని చేయించునేది స్త్రీలే. సమ దృష్టితో పని చేయించుకోకపోతే కేసుల్లో చిక్కుకోవాల్సి వస్తుంది. అశాంతితో గడపాల్సి వస్తుంది.

► పని మనుషులతో పని విధానం ఎలా ఉండాలి?
లోకంలో పని మనుషుల మీద ఉన్నన్ని జోకులు మరెవరి మీదా ఉండవు. పని మనుషులు ‘డిమాండ్స్‌’ పెట్టడం గురించి ఈ జోకులన్నీ ఉంటాయి. వారి పని పద్ధతి గురించి కూడా జోకులుంటాయి. ‘పని మనుషులు’ కూడా ‘ఇంత పని మాత్రమే చేస్తాం’... ‘ఇంత జీతానికే చేస్తాం’ అని డిమాండ్‌ చేయడం ‘యజమానులకు’ వింతగా, నవ్వులాటగా, సహించలేని వ్యవహారంగా అనిపిస్తుంది.

కాని ఈ యజమానులు లేదా వారి పిల్లలు ఉద్యోగాల్లో చేరేటప్పుడు తప్పనిసరిగా పని స్వభావం, పని గంటలు, జీతం తెలుసుకుని అందుకు అంగీకారమైతేనే చేరుతారు. పని మనుషులు మాత్రం తమ వద్ద అలా ఉండటాన్ని భరించలేరు.

► తాజా ఘటన
పని మనుషులు ‘అతీగతీ’ లేని వారు అనే భావనతో వారితో ఎలాగైనా వ్యవహరించవచ్చని యజమానులు అనుకుంటే వారు పోలీసు కేసుల వరకూ వెళ్లాల్సి ఉంటుందని నోయిడాలో జరిగిన తాజా ఘటన తెలియచేస్తోంది. నోయిడా సెక్టర్‌ 120లో షెఫాలీ కౌల్‌ అనే మహిళ తన వద్ద పని చేసే 20 ఏళ్ల అనిత అనే అమ్మాయిని లిఫ్ట్‌లో నుంచి తన ఫ్లాట్‌కు ఈడ్చుకుంటూ వెళ్లే వీడియో వైరల్‌ అయ్యింది.

ఆమె వద్ద పని చేసే ఒప్పందం అక్టోబర్‌తో ముగిసినా ఇంకా పని చేయవలసిందేనని ఆమె బలవంతం చేస్తున్నదని, ఇంట్లో నిర్బంధిస్తోందని, తిడుతోందని, కొడుతోందని అనిత తండ్రి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. వీడియో ఇందుకు సాక్ష్యం పలుకుతోంది. నేరం రుజువైతే షెఫాలీ కౌల్‌కు శిక్ష తప్పదు. దేశంలో ఇటీవల ఇలాంటి ఘటనలు ఎక్కువయ్యాయి. మనకు సేవ చేసేవారు మనకంటే తక్కువ అనే భావన పాతుకుపోవడం వల్లే ఇలా జరుగుతుంది.

► పని మనుషులు నిస్సహాయులు
పనికి సంబంధించిన ఎటువంటి గ్యారంటీ లేని నిస్సహాయులుగానే పని మనుషులు వున్నారు. యజమానులు వారిని ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఎప్పుడైనా తీసేయొచ్చు. వారికి కనీస వేతన చట్టం వర్తించదు. సెలవులు ఉండవు. ప్రసూతి సెలవులు చాలా పెద్ద మాట. రోజూ వచ్చిపోతూ పని చేసే పని మనుషుల కంటే ఇంట్లోనే ఉంటూ పని చేసే వారికి యజమానులు చెడ్డవాళ్లయితే నరకం కనిపిస్తున్న దాఖలాలు ఉన్నాయి.

తమ వద్దే గతి లేకుండా ఉన్నారన్న ఉద్దేశంతో వీరి చేత చాకిరి విపరీతంగా చేయించడమే కాదు... ఏదైనా తప్పు జరిగినా/మాట వినకపోయినా దండన కూడా ఉంటుంది. ఆ దండన–
► జీతం ఆపడం ∙
►ఆకలికి మాడ్చడం
► నిద్ర లేకుండా పని చేయించడం
► కొట్టడం ∙హింసించడం
► దొంగతనం నిందలు వేయడం

కొన్ని సంఘటనల్లో లైంగిక దాడులు కూడా జరపడం. ఇవన్నీ శిక్షార్హమైన నేరాలని యజమానులు గుర్తుంచుకుంటే మంచిది. కాని యజమానుల ధోరణి అహంతో నిండి ఉంటోంది. కొంత కాలం క్రితం ముంబైలోని ఒక సొసైటీలో పని మనుషులందరూ తమకు జీతాలు తక్కువ ఉన్నాయని పనిలోకి రాబోమని ఈ సొసైటీ ఎదుట ధర్నా చేశారు. అప్పుడు యజమానులు తగ్గి జీతం పెంచారు. కాని కొన్ని నెలల్లోనే ఎవరైతే ఆ ‘విప్లవం’ లేవదీశారో వారందరి పని పోయింది. మెల్ల మెల్లగా తీసేశారు. మళ్లీ తక్కువ జీతానికి పని చేసే వాళ్లే పనిలో కుదరాల్సి వచ్చింది.

► పని మనుషులూ మనుషులే
పని మనుషులూ మనుషులే. పని మనుషులుగా ఇళ్లల్లో పని చేసేది, చేయాల్సింది స్త్రీలే. వీరంతా నిరుపేద వర్గం నుంచి వచ్చినవారే అయి ఉంటారు. వారికి కుటుంబాలు ఉంటాయి... పిల్లలు ఉంటారు... బాధ్యతలు ఉంటాయి... అనారోగ్యాలు ఉంటాయి... భర్తల నుంచి ఏదో ఒక మేరకు వొత్తిళ్లు ఉంటాయి... సమస్యలు ఉంటాయి... అని గుర్తుంచుకోవాలి.

ఎన్నో ఇబ్బందులు ఉండి ఆ ఇబ్బందుల్లో బతుకు గడవడానికి వారు పనిలో చేరుతారు. ఇంటికి సంబంధించిన ‘మురికి’ని శుభ్రం చేస్తారు. వారి సహాయం, శ్రమ లేకుండా ఇళ్లు శుభ్రపడవు. యజమానులు సౌకర్యంగా తమ పనులు చేసుకోలేరు. అందువలన వారితో స్నేహంగా, సమదృష్టితో వ్యవహరించడం అవసరం. వారి అవసరాలు అన్నీ తీర్చాల్సిన పని లేదు కాని ఒక్కోసారి వారి బాధను పట్టించుకోవడం కూడా అవసరమే.

కుటుంబంలో ఒకరిగా మారి దశాబ్దాల పాటు పని చేసిన మనుషులు, పని మనిషిని కుటుంబ సభ్యులతో సమానంగా చూసుకునే యజమానులు ఎందరో ఉన్నారు. కాని అలా కాకుండా ‘మనం అనేవాళ్లం... వాళ్లు పడేవాళ్లు’ అనే భావన ఉంటేగనక అలాంటి భావనను మార్చుకోక తప్పదు. కొందరి ఇళ్లల్లో పని మనుషులు నెలకు మించి నిలువరు. పని మనుషులను మార్చుతూ వెళతారు కాని తాము మారరు.

ఇవి చేయండి
► మీకు ఎన్ని పని గంటలు కావాలో ముందే స్పష్టంగా చెప్పండి
ఏమేమి పనులు చేయాలో తప్పనిసరిగా ముందే చెప్పండి 
వారానికి ఒకరోజు సెలవు (ఒక పూటైనా) ఇవ్వండి ∙
అనారోగ్యం ఉంటే బలవంతంగా పని చేయించకండి ∙
పండగలకు బక్షీసు ఇవ్వండి ∙
చీటికి మాటికి జీతం కోయకండి
∙పరుష పదజాలం ఉపయోగించకండి
పని చేస్తుంటే వెంట ఉంటూ అజమాయిషీ చేయకండి
► మీరు తినలేనివి పెట్టకండి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement