యాసిడ్‌ ఓడింది జంట కలిసింది | Odisha Acid Attack Survivor Pramodini Roul Got Married | Sakshi
Sakshi News home page

యాసిడ్‌ ఓడింది జంట కలిసింది

Published Fri, Mar 5 2021 1:14 AM | Last Updated on Fri, Mar 5 2021 1:17 AM

Odisha Acid Attack Survivor Pramodini Roul Got Married - Sakshi

పెళ్లితో ఒకటైన ఒడిశా యాసిడ్‌ అటాక్‌ సర్వయివర్‌ ప్రమోదిని, సాహు జంట

ఒడిశాలో 28 ఏళ్ల ప్రమోదిని అందరికీ తెలుసు. మూర్ఖ ప్రేమికుడు 2009లో యాసిడ్‌ కుమ్మరిస్తే ఆమె రెండు కళ్లు పోయాయి. చర్మం ధ్వంసమైంది. జీవితం శాశ్వతంగా మారిపోయింది. ‘నన్ను పెళ్లి చేసుకుంటే క్షమిస్తా’ అన్లేదు ప్రమోదిని. వాణ్ణి జైలుకు పంపింది. పదేళ్ల పాటు శక్తిని కూడదీసుకుని జీవితాన్ని నిర్మించుకుంది. ఇవాళ ఆమెకు పరిచయమైన స్నేహితుణ్ణి భర్తగా స్వీకరించింది. ‘ఇది చాలామంచి రోజు’ అందామె. వెరవక నిలబడితే మంచిరోజు తప్పక వస్తుంది.

‘భారతదేశంలో పెళ్లి అంటే వధువు ముఖం చూస్తారు అంతా. నాకు ముఖం ఉందా? లేదు. కాని నేను పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఇరువైపులా పెద్దలు అంగీకరించినప్పుడే చేసుకోవాలనుకున్నాను. మా పెద్దలు అంగీకరించారు. మా పెళ్లి జరిగింది.’ అంది ఒడిశా యాసిడ్‌ అటాక్‌ సర్వయివర్‌ ప్రమోదిని. రెండ్రోజుల క్రితం ఆమె వివాహం సాహూతో జగత్సింగ్‌పూర్‌ జిల్లాలో జరిగింది. ఒడిశా గవర్నర్‌ ప్రత్యేకంగా ఆ పెళ్లికి హాజరయి వధూవరులను ఆశీర్వదించారు. ప్రమోదిని పెళ్లి సందర్భంగా 20 మంది యాసిడ్‌ బాధిత స్త్రీలు వచ్చి ఆనందాన్ని పంచుకున్నారు. పాటలకు డాన్సులు చేశారు. ‘కాలింది ముఖమే. కలలు కావు’ అని వీరు నొక్కి చెప్పారు.

2009లో జరిగిన ఘటన

ప్రమోదినికి ఆ సమయం లో పదిహేడు పద్దెనిమిదేళ్లు ఉంటాయి. ఆమెకు తండ్రి లేడు. ముగ్గురు అక్కచెల్లెళ్లలో పెద్దది తను. ‘బాగా చదువుకొని కుటుంబాన్ని చూసుకోవాలనుకున్నాను నేను’ అంది ప్రమోదిని. ఆ సమయంలోనే ఊళ్లోని ఆర్మీ జవాన్‌ సంతోష్‌ వేదాంత్‌ ఆమె వెంటపడ్డాడు. ప్రేమ అన్నాడు. ఆమె ఒప్పుకోలేదు. ప్రమోదిని కుటుంబానికి కూడా ఈ పెళ్లి ఇష్టం లేదు. అది భరించలేకపోయాడు సంతోష్‌. మే 4, 2009న కాలేజీ నుంచి వస్తుంటే ముఖంపై యాసిడ్‌ చల్లి పారిపోయాడు. వెంటనే ఆమెకు కళ్లు పోయాయి. చర్మం చాలామటుకు కాలిపోయింది. హాహాకారాల నడుమ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ఆ తర్వాత కటక్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో ఆమె బతుకుతో చావుతో ఐదేళ్లు పోరాడింది. మరోవైపు ‘సరైన ఆధారాలు’ లేవని పోలీసులు 2012లో కేసు క్లోజ్‌ చేసేశారు. ఈలోపు నిందితుడు పెళ్లి కూడా చేసుకున్నాడు. యాసిడ్‌ గాయం కంటే నిందితుడు తప్పించుకోవడం ఆమెకు ఇంకా కోపం తెప్పించింది.

కోలుకొని.. పెళ్లి చేసుకుని
ఆమెను వివాహం చేసుకున్న సాహూది భువనేశ్వర్‌. మెడికల్‌ రిప్రజెంటేటివ్‌. ఊళ్లు తిరుగుతున్నప్పుడు హాస్పిటల్‌లో ఉన్న ప్రమోదిని అతనికి పరిచయం అయ్యింది. సాహూ ఎలా ఉంటాడో ఆమెకు తెలియదు. చూడలేదు. కాని అతను వస్తే ఆమె సంతోషపడేది. ఆమె తల్లి కూడా ఊరడింపు పొందేది. ఒక రోజు మంచం మీద ప్రమోదిని పక్క తడిపేస్తే అతను ఏ మాత్రం సంశయించకుండా సాపు చేశాడు. ‘ఎందుకు ఇదంతా చేస్తున్నావు’ అనడిగితే కారణాలు ఉంటేనే చేయాలా అన్నాడు. అప్పుడు ప్రమోదిని అతణ్ణి పట్టుకుని ఏడ్చింది. 2016లో సాహు ఆమెకు కళ్లకు సంబంధించిన సర్జరీ చేయించాడు. చాలా కొద్దిగా చూపు వచ్చింది. ఆ రావడం రావడం ఆమె నిందితుడి వేట మొదలెట్టింది. ఆధారాలు సేకరించింది. మీడియాలో తనపై జరిగిన దాడిని ప్రచారం చేసింది. దాంతో ఏకంగా ఒరిస్సా సి.ఎం. విచారణకు ఆదేశించి కేసు రీ ఓపెన్‌ చేయించారు. 2017లో నిందితుడి అరెస్ట్‌ జరిగింది. ప్రస్తుతం జైలులో ఉన్నాడు. 2018లో సాహు, ప్రమోదినిల నిశ్చితార్థం జరిగింది. ఇప్పుడు పెళ్లి.

నిలబెట్టుకున్న ఆశ
ప్రమోదినిలో ఆశ ఉంది. కాని దానిని నిలబెట్టే వ్యక్తులు, వ్యవస్థ ఉన్నప్పుడు అది సజీవంగా ఉంటుంది. సాహు ఆమెకు ఆ బలం ఇచ్చాడు. అదీగాక లక్నోలో పని చేస్తున్న స్వచ్ఛంద సంస్థ ‘షీరోస్‌’ యాసిడ్‌ బాధితుల పునరావాసం కోసం పని చేస్తుండటంతో వారు ఒకరికొకరు బలం అయ్యారు. ప్రమోదిని కూడా వారితో కలిసే తన గొంతు వినిపించింది. సాహూ మెడికల్‌ రిప్రజెంటేటివ్‌ ఉద్యోగం మానేసి ఇప్పుడు ఈ సంస్థ కోసం పని చేస్తున్నాడు. అబ్బాయిలు నిరాకరణ కూడా ఆశించడంలో ఒక భాగం అని అంగీకరించే విధంగా పెంపకం, చదువు, సామాజిక సంస్కారం ఉండాలి. నిరాకరణలో హుందాతనం ఉందని గ్రహించాలి. అబ్బాయి నిరాకరించినా అమ్మాయి నిరాకరించినా జీవితం ముగిసిపోదు. కాని ఆ నిరాకరణ ప్రతీకారంలోకి మారినప్పుడే ఇరుపక్షాల జీవి తానికీ ప్రమాదం. యాసిడ్‌ దాడిని జయించిన ప్రమోదిని ఇప్పుడు చిర్నవ్వు నవ్వుతోంది. యాసిడ్‌ దాడి చేసినవాడికి ఆ జీవన సౌలభ్యం ఉండదు. అదీ గ్రహించాల్సింది.


– సాక్షి ఫ్యామిలీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement