భిన్న రకాల పెట్స్‌తో మమేకమవుతున్న నగరవాసులు
ముందస్తు అవగాహన లేని పెంపకంతో అనర్థం..
పెట్స్ పేరెంటింగ్‌కు ముందు జాగ్రత్త అవసరం అంటున్న నిపుణులు
లేడికి లేచిందే పరుగు.. అన్నట్టు ఆలోచన వచి్చందే తడవు ఇంటికి తెచ్చేసుకుని మరీ భౌ¿ౌలూ, మ్యావ్ మ్యావ్‌లూ, కిచకిచలూ.. వింటూ ఆనందించేద్దాం అనుకుంటే సరిపోదు.. కొనడం నుంచి పెంచడం దాకా పెట్స్ పేరెంటింగ్ కూడా ఒక కళే అంటున్నారు నిపుణులు. దీంతో పాటు వాటికి అనువైన ప్రదేశం ఉండేలా చూసుకోవాలి. తరచూ వాటికి ఇవ్వాల్సిన టీకాలు ఇప్పించడం, వాటి నుంచి సంక్రమించే వ్యాధులకు తగిన చికిత్సలు తీసుకోవడం చాలా ముఖ్యమని చెబుతున్నారు..
నగరంలో పెంపుడు జీవులను మచ్చిక చేసుకోవడం... వాటి పెంపకం పట్ల హాబీ ఇంతింతై వటుడింతై అన్నట్టుగా పెరుగుతోంది. అయితే ఏవి కొనాలి? ఎలా పెంచాలి? ఎలా ఉంచాలి? వంటి కీలక విషయాల పట్ల అవగాహన లేకుండానే ఇంటికి తెచ్చేసుకుంటూ ఇబ్బందులు పడుతున్నవారు తక్కువేం కాదు. ఈ నేపథ్యంలో నిపుణులు అందిస్తున్న సూచనలివి...
కొనేముందు..
పెంపుడు జీవిగా శునకమైనా, పిల్లులైనా, పక్షులైనా.. తెచ్చు‘కొనే’ముందు తమ ఇంటి పరిస్థితులను విశ్లేషించుకోవాలి. కుటుంబ జీవనశైలి, మనకు అందుబాటులో ఉన్న స్థలం వంటి అంశాలపై ఆధారపడి పెట్‌ని ఎంపిక చేసుకో వాలి. అలాగే సదరు జీవి స్వభావం, దాని శక్తి స్థాయిలు, దానికి అందించాల్సిన సంరక్షణ అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. ఇంట్లోని పిల్లలు/వృద్ధుల వయస్సు, వారి ఆరోగ్య పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకోవాలి.
ఇలాగైతే బాగు ‘భౌగు’..
శునకాలు, పిల్లులు, పక్షులకు సరిపడేలా, సౌకర్యవంతమైన స్థలాన్ని అందించాలి. అలాగే ఫుడ్‌కీ, ఆటలకీ తగిన టైమ్ కోసం షెడ్యూల్ సెట్ చేసుకోవాలి. వాటికి ఇవ్వాల్సిన ఆహారం తదితరాల గురించి అలాగే టీకాల షెడ్యూల్ గురించి డాక్టర్ నుంచి సరైన మార్గదర్శకాలు తీసుకోవాలి.. అలాగే జనన నియంత్రణ శస్త్రచికిత్స ఎప్పుడు నిర్వహించాలి వంటివి తెలుసుకోవాలి. శునకాలకు సోషల్ లైఫ్ ముఖ్యం. చుట్టుపక్కల వారితో, సాటి జీవులతో స్నేహపూర్వక బంధం ఏర్పడడం కోసం అవకాశం ఇవ్వాలి. శునకం 4–5 నెలలకు చేరుకున్నప్పుడు వాటికి పలు అంశాల్లో శిక్షణ ఇప్పించడం అవసరం. అదే విధంగా 3 నెలల వయసు వరకూ ఫోమ్ బాత్/డ్రై బాత్, 4–6 నెలల వయసులో 15 రోజులకు ఒకసారి, 6 నెలలు దాటిన తర్వాత వారానికోసారి స్నానం తప్పనిసరి. దాంతో పాటే హెయిర్ కోట్‌ను క్రమం తప్పకుండా బ్రష్ చేయడం ముఖ్యం. హెయిర్ కట్, గోర్లు కత్తిరించడం చెవి శుభ్రపరచడం ఆసన గ్రంథులు శుభ్రపరచడం అవసరమే.
బ్రీడ్.. గుడ్..
శునకాలను కొనుగోలు చేసేముందు వాటి బ్రీడ్స్‌ను పరిశీలించడం మంచిది. సహనం, ఉల్లాసభరితమైన స్నేహపూర్వక స్వభావంతో పిల్లలున్న కుటుంబాలకు, లాబ్రడార్ రిట్రీవర్లు, గోల్డెన్ రిట్రీవర్లు బీగల్స్ వంటివి, అలాగే అపార్ట్‌మెంట్స్‌కు పగ్స్, షిహ్ త్జుస్ వంటి చిన్న బ్రీడ్స్ నప్పితే, ఫార్మ్ హౌస్‌ల కోసం డాబర్‌మ్యాన్, రోట్‌వెల్లర్.. ఇలా ప్రత్యేకించిన బ్రీడ్స్ కూడా ఉన్నాయి. ఇండియన్ పరియా డాగ్ వంటి స్థానిక భారతీయ జాతులు మన వాతావరణానికి బాగా సరిపోతాయి కావలీర్ కింగ్, చార్లెస్ స్పానియల్స్, బాక్సర్లు కూడా పిల్లలతో ఆప్యాయంగా ఉండడానికి పేరొందాయి.
మ్యావ్.. మ్యాచ్..
ఇటీవల పిల్లులను పెంచుకుంటున్నవారు బాగా పెరుగుతున్నారు. పెట్స్‌గా పిల్లులను ఎంచుకున్నవారు వాటి కోసం ఇంట్లో సరైన ప్రదేశాన్ని కనుగొనాలి. నులిపురుగుల నివారణకు వైద్య సలహాలు తీసుకోవాలి. పిల్లులకు రెగ్యులర్‌గా టీకా వేయడం వల్ల దానికి మాత్రమే కాదు పెంచుకునే వారికీ మంచిది. పిల్లులకు మూత్ర, మల విసర్జనలకు ఉపయోగించేందుకు లిట్టర్ బాక్స్ తప్పనిసరి. వాటికి లిట్టర్ శిక్షణ ఇవ్వడం చాలా ముఖ్యం. సంవత్సరం కంటే తక్కువ వయసున్న పిల్లులుకు వైరల్ ఇన్ఫెక్షన్లకు ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి వైరల్ సంక్రమణను నివారించడానికి ఇతర వీధి పిల్లులతో సంబంధాన్ని నివారించాలి. మగ ఆడ పిల్లుల హార్మోన్ల మార్పులు గురించి అవగాహన ఉండాలి. చాలా మంది పిల్లి యజమానులు ఈ సమయంలో వాటిని చూసి పిల్లికి ఏదో అనారోగ్యం ఉందని అనుకుంటారు. పిల్లులకు తరచూ వస్త్రధారణ అవసరం లేదు అలాగే పిల్లులు తమను తాము శుభ్రం చేసుకుంటాయి కానీ నెలకు ఒకసారి మాత్రం శుభ్రపరచడం తప్పనిసరి..
వండని మాంసాన్ని ఇవ్వకూడదు..
పక్షులను పంజరంలో ఉంచవద్దు. వీలైనంత వరకూ పక్షులను బందిఖానాలో ఉంచడం వాటికి హానికరం. ఇది వాటికి తీవ్రమైన కఠినమైన పరిస్థితిగా మారుతుంది. పోషకాహార లోపం, సరిపడని వాతావరణం, ఒంటరితనం, నిర్బంధంలో ఉన్న ఒత్తిడి వంటి సమస్యలకు దారి తీస్తుంది. పక్షులు ఎగురుతూ ఇతర పక్షులతో కలిసి జీవించాలి. ఓపెన్ స్కై కింద. వాటిని చిన్న ప్రదేశాల్లో ఉంచినప్పుడు, స్వభావ ప్రకోపాలు మానసిక కల్లోలాలకు గురవుతాయని నిపుణులు చెబుతున్నారు.
పెంపకంలో అలక్ష్యం వద్దు..
పెట్స్‌ని పెంచుకునేవారు నగరంలో బాగా పెరుగుతున్నారు. అలాగే ఏ మాత్రం అవగాహన లేకుండా వాటిని తెచ్చుకుంటూ ఇబ్బందులు పడుతున్నవారూ పెరుగుతున్నారు. రకరకాల అనారోగ్యాలతో మా దగ్గరకు తమ పెట్స్‌ను తీసుకొచ్చే కేసుల్లో చాలా
సందర్భాల్లో యజమానుల అవగాహన లోపమే కారణంగా తెలుస్తోంది. తరచూ వాటి బాగోగులు పర్యవేక్షించడం, నిరంతరం
వైద్యులతో సంభాషించడం. చేస్తూ జాగ్రత్తగా చూసుకోవాలి.
–డా.బి.యమున, శునకాల, పిల్లుల వైద్య నిపుణులు
Comments
Please login to add a commentAdd a comment