ఉద్యోగాల్లో పెంపుడు జంతువులు
యజమానుల్లో సంతోషం
చైనాలో ఇప్పుడిదో ట్రెండ్
సమోయెడ్ జాతికి చెందిన ఓకే అనే రెండేళ్ల శునకం మొన్నటి దాకా ఓ కెఫెలో ఉద్యోగం చేసింది. తాజాగా మరో చోట ఇంటర్వ్యూకెళ్లి, ఎంపికైంది. త్వరలోనే కొత్త ఉద్యోగంలో చేరబోతోంది. డటౌ అనే తెల్ల పిల్లి కూడా తక్కువేం కాదు. అది నెలకు ఐదు క్యాన్ల ఆహారాన్ని సంపాదించుకుంటోంది. అదీ అన్ని పన్నులూ పోను..!
ఇది కాకుండా.. ఆరోగ్యంగా, అందంగా, బుద్ధిగా ఉండే పిల్లులకి రోజూ స్నాక్స్ ఇస్తాం. యజమాని స్నేహితులకి 30 శాతం డిస్కౌంట్ ఇస్తాం అంటూ ఓ కెఫె నిర్వాహకుడు ఆఫర్ ఇచ్చారు. మరోచోట కెఫె నిర్వాహకుడు తమకు కావాల్సిన అర్హతలుండే పిల్లులు, కుక్కల కోసం ఇంటర్వ్యూలు చేసుకుంటున్నారు..! చైనాలో కొత్త ట్రెండిది.
చైనీయుల్లో కుక్కలు, పిల్లుల్ని పెంచుకోవాలనే ఉబలాటం ఇటీవల అనూహ్యంగా పెరిగిపోయింది. ఈ ఏడాది చివరికల్లా ఆ దేశంలో పిల్లల కన్నా పెంపుడు జంతువులే (పెట్స్) ఎక్కువుంటాయని ఓ సర్వేలో తేలింది. అయితే, తట్టుకోలేని జీవన వ్యయం.. బిజీబిజీగా మారిన జీవితంతో పెంపుడు జీవుల్ని కెఫెల్లో ఉద్యోగాలకు కుదుర్చుతున్నారు. ఉద్యోగాలకు వెళ్లిన సమయాల్లో ఇవి కెఫెల్లో ఉంటాయి. తిరిగి రాగానే తమతోపాటే ఉంటాయి.
దీంతోపాటు, కెఫెల్లో పార్ట్‌టైం, ఫుల్‌టైం ఉద్యోగాలతో ఎంతో కొంత ఆదాయం కూడా ఉంటోంది. దీంతోపాటు, చైనాలో మొదటిసారిగా గ్వాంగ్‌ఝౌలో 2011లో క్యాట్ కెఫె ప్రారంభించారు. ఇలాంటి కెఫెల సంఖ్య ఏటా 200 శాతం పెరుగుదల నమోదవుతోంది. 2023 లెక్కల ప్రకారం చైనాలో 4 వేల పైచిలుకు పిల్లులకు సంబంధించిన కంపెనీలు నడుస్తున్నాయి. పిల్లులు, కుక్కలతో గడపడం ఇష్టపడే కస్టమర్లు ఈ తరహా కెఫెలకు వస్తుంటారు. వీరి నుంచి సుమారు రూ.350 నుంచి రూ.700 వరకు వసూలు చేస్తుంటారు. తమ మధ్య తిరుగాడుతూ ఉండే పిల్లులు, కుక్కలతో వీరు సరదాగా ఆడుకుంటారు.
‘తల్లిదండ్రులు పిల్లల్ని స్కూలుకు పంపిన మాదిరిగానే ‘ఓకే’ను నేను కూడా కెఫెలో పార్ట్‌టైం జాబ్‌కి పంపిస్తున్నా’అని ఆ శునకం యజమాని 27 ఏళ్ల పీహెచ్‌డీ విద్యార్థి జ్యూ తెలిపారు. కొత్త జీవితానికి అది అలవాటు పడుతుందన్నారు. ‘జాబ్‌కెళ్లేటప్పుడు ఉదయం నాతోపాటే ఓకే కూడా కెఫెకు వస్తుంది. వచ్చే టప్పుడు తిరిగి సాయంత్రం ఇంటికి తెస్తాను. నేను, నా భర్త వీకెండ్స్‌లో బయటికి వెళ్లినప్పుడు ఓకేను కెఫె నిర్వాహకులే చూసుకుంటారు.
పైపెచ్చు, పగలంతా మేం జాబ్‌లకెళితే ఓకే బద్ధకంగా నిద్రతోనే గడిపేస్తుది. ఆ సమయంలో దాని కోసం ప్రత్యేకంగా ఏసీ ఆన్ చేసి ఉంచడం తప్పనిసరి. ఫుజౌ నగరంలో అసలే నిర్వహణ ఖర్చులెక్కువ. ఓకే కూడా జాబ్ చేస్తే దాని ఖర్చులు అంది సంపాదించుకుంటుంది కదా’అని చెప్పుకొచ్చారు జ్యూ. ఓకేను ఇటీవలే ఓ కెఫె యజమాని గంటపాటు పరిశీలించారు. కస్టమర్లతోపాటు తోటి కుక్కలతో మసలుకునే తీరును గమనించి, ఓకే చెప్పారని జ్యూ తెలిపారు. ‘ఓకే స్టార్ ఆఫ్ ది కెఫె’అంటూ ఆమె ఆనందం వ్యక్తం చేశారు.
జిన్‌జిన్ అనే బీజింగ్‌కు చెందిన టీచర్‌కు టీఝాంగ్ బ్యుయెర్ అనే పిల్లి ఉంది. తనకున్న రెండు పిలుల్ని పోషించేందుకు నెలకు 500 యువాన్ల(సుమారు రూ.6 వేలు) వరకు ఖర్చువుతోందని ఆమె అంటున్నారు. ఆహారం తింటూ రోజంతా బద్ధకంగా ఇంట్లోనే ఉంటోంది. అందుకే, ఆహారం, స్నాక్స్ ఖర్చుల కోసం బ్యుయెర్‌ను కూడా కెఫెల్లో పనికి పంపించేందుకు సిద్ధం చేస్తున్నానన్నారు. ‘అక్కడైతే అటూఇటూ తిరుగుతుంటే తిన్నది అరుగుతుంది.
పైపెచ్చు హుషారుగా కూడా ఉంటుంది’అన్నారు జిన్‌జిన్. ఇప్పుడు చైనాలో కెఫె యజమానులు తమకు కావాల్సిన పిల్లులు, కుక్కల కోసం సోషల్ మీడియాలో యాడ్‌లు ఇస్తున్నారు. క్యాట్ కెఫెలో పనిచేస్తే ఎంత శాలరీ ఇస్తారు?అని ఒకరు ప్రశ్నించగా, ఓ కెఫె యజమాని ఇచి్చన సమాధానం వైరల్‌గా మారింది. ‘మా క్యాట్ కెఫెలో పనికి పంపుతామంటూ చాలా మంది యజమానులు మమ్మల్ని అడుగుతున్నారు. ఇక శాలరీ విషయానికొస్తే మేం చెప్పే దొక్కటే. మా పాత ఉద్యోగులు కొందరికి ఇచ్చినంత!’అని తెలిపారు.
– సాక్షి నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment