ప్రతీకాత్మక చిత్రం
How To Secure Digital Payment Transactions Safe Expert Suggestions: ఫ్రెండ్స్‌కి పార్టీ ఇవ్వడానికి గీత (పేరు మార్చడమైనది) తన స్నేహితులతో రెస్టారెంట్‌కి వెళ్లింది. ఆర్డర్ ఇచ్చినవన్నీ టేబుల్ మీద అందంగా అమర్చారు అక్కడి వెయిటర్లు. అందరూ కబుర్లు చెప్పుకుంటూ అక్కడి పదార్థాలను ఆస్వాదించారు. ఇక చివర్లో వెయిటర్ బిల్ తెచ్చి టేబుల్ మీద పెట్టాడు. అది చూసిన గీత తన బ్యాగ్‌లో నుంచి క్రెడిట్ కార్డు తీసి, బిల్ ఉన్న బుక్‌లో పెట్టి వెయిటర్‌ని పిలిచి, పిన్ నెంబర్ కూడా చెప్పి, స్వైప్ చేసి తీసుకురమ్మంది. వెయిటర్ బిల్ పే చేసి, ఆమె కార్డును ఆమెకు తిరిగి ఇచ్చేశాడు. పది రోజులు గడిచాయి.
తన క్రెడిట్ కార్డు నుంచి అరవై వేల రూపాయలు డెబిట్ అయినట్టుగా మెసేజ్ వచ్చింది. షాక్ అయ్యింది గీత. తను ఎక్కడ ట్రాన్సాక్షన్స్ చేసిందో కూడా అర్థం కాలేదు. వేరే రాష్ట్రంలో తను షాపింగ్ చేసినట్టుగా మెసేజ్ వచ్చింది. బ్యాంక్ కస్టమర్ కేర్‌కు ఫోన్ చేస్తే షాపింగ్ ఏ ప్రాంతంలో జరిగిందో చెప్పారు. మోసం జరిగిందనుకుంటే వెంటనే కార్డు బ్లాక్ చేసుకోమని, మరో కార్డుకు అప్లై చేయమని సూచించారు. క్రెడిట్ కార్డు తన వద్దే ఉంటే అసలు మోసం ఎలా జరిగిందో, ఎక్కడ జరిగిందో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు గీతకు.
∙∙
నగదును మన వెంట తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా డిజిటల్ మార్కెట్‌లోకి వచ్చేశాం. లావాదేవీలన్నీ చాలావరకు డిజిటల్ మార్గంలోనే జరుగుతున్నాయి. ఫలితంగా మోసగాళ్లు డిజిటల్ నుంచే పుట్టుకు వస్తున్నారు. ఏ విధంగా మన వద్ద ఉన్న మొత్తాన్ని రాబట్టాలో రకరకాల మార్గాల ద్వారా వ్యూహాలను పన్నుతున్నారు. గీతకు మోసం ఎక్కడ జరిగిందంటే.. రెస్టారెంట్ లో వెయిటర్‌కు బిల్ పే చేయమని కార్డు, పిన్ నెంబర్ ఇచ్చేసింది. దీంతో ఆ వెయిటర్ రెస్టారెంట్ స్వైప్ మిషన్ కన్నా ముందు అరచేతిలో పట్టేంత ఉన్న తన మరో మిషన్‌లో స్వైప్ చేశాడు.
దీంతో కార్డులో ఉన్న చిప్ ద్వారా ఆ డేటా అతని మిషన్‌లోకి చేరింది. అటు తర్వాత రెస్టారెంట్ బిల్ పే చేసి, తిరిగి ఆ కార్డును ఆమెకు ఇచ్చేశాడు. ఆ వెయిటర్ అలా డేటా సేకరించడానికి మోసగాళ్లు అతనితో ముందుగానే ‘డీల్’ కుదుర్చుకున్నారు. దీంతో గీత కార్డు వివరాలన్నీ మోసగాళ్ల చేతిలోకి వెళ్లిపోయాయి. పది రోజుల తర్వాత గీత కార్డు బిల్ మొత్తం కట్టేశాక, క్రెడిట్ బ్యాలన్స్ ఎక్కువ మొత్తంలో ఉందని గ్రహించిన మోసగాళ్లు అంత మొత్తాన్ని ఆమె కార్డు ద్వారా దొంగిలించేశారు.
∙∙
కార్డ్ స్కిమ్, కాపీ, క్లోన్... డేటా ద్వారా కొత్త కార్డులను తయారు చేసే ముఠాలు తయారవుతున్నాయి. ఎక్కువగా రొమేనియన్స్ చేసే ఈ మోసాలు ఇప్పుడు ఇతరులూ చేస్తున్నారు. డార్క్ వెబ్‌లో స్కిమ్మర్, బ్లాక్ కార్డ్ మేకర్స్ కూడా లభించడం, అచ్చం క్రెడిట్/ డెబిట్ కార్డులను పోలి ఉన్నవి తయారుచే సుకోవడం కూడా మోసం చేయడానికి రాచమార్గం.
కార్డుల ద్వారా జరిగే మోసాలను అరికట్టాలంటే...
► మీ కార్డుల వివరాలకు ఎట్టి పరిస్థితులో మీరే రక్షకులు.
► కార్డు ద్వారా లావాదేవీలు జరుపుతున్నప్పుడు మీ దృష్టి మరల్చకూడదు
► స్వైప్ మిషన్ ద్వారా మీ కార్డు నుంచి డెబిట్ చేశాక, ఎంత మొత్తం డెబిట్ చేశారో రిటైలర్ ను అడగండి.
► కొత్త కార్డులు వచ్చిన వెంటనే, ఆ కార్డుపైన సంతకం చేయాల్సిన చోట తప్పనిసరిగా సంతకం చేయండి.
► బిల్లు చెల్లించి, రశీదు తీసుకున్నాక ఒకసారి ఆన్‌లైన్ స్టేట్‌మెంట్‌లో సరిచూసుకోవాలి.
► కార్డు లావాదేవీల ద్వారా పొందిన రశీదులను, మీ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన సమాచారాన్ని జాగ్రత్తపరచుకోవడాన్ని విస్మరించకూడదు.
► మీ కార్డులను బహిరంగ ప్రదేశాల్లో ఉంచకూడదు. నగదు, మనీ పర్సుల్లానే జాగ్రత్త పరుచుకోవాలి.
► కార్డు మీద పిన్ నెంబర్ రాయకూడదు. అలాగే పిన్ నెంబర్ ఎవరికీ చెప్పకూడదు.
► ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ జరుపుతున్నప్పుడు మీరు ఉపయోగించే సిస్టమ్ యాంటీవైరస్ ఆపరేటింగ్ సాఫ్ట్‌వేర్ ఉన్నదేనా అనే విషయాన్ని నిర్ధారించుకోండి.
► ఇంటర్‌నెట్ ద్వారా నమ్మకమైన సైట్స్ ద్వారా మాత్రమే కొనుగోళ్లు మాత్రమే చేయండి. అందుకు భద్రతా నియమాలు పాటించండి.
► ఎక్స్‌పైరీ డేట్ అయిపోయాక వాటి స్థానంలోకి రీప్లేస్‌మెంట్ కార్డ్స్ వస్తాయి. ఇలాంటప్పుడు పాత కార్డులను అలాగే పడేయకుండా వాటిలో ఉన్న మాగ్నెటిక్ చిప్‌ను తొలగించాలి. అలాగే ఉపయోగంలో లేని కార్డులను బ్లాక్ చేయాలి.
► లావాదేవీలు జరిపిన తర్వాత పిన్‌నెంబర్‌ను మార్చుకోవడం మంచిది. రివార్డ్ పాయింట్స్ రిడెమ్షన్ గురించి అయినా, కార్డు సమాచారం గురించైనా వచ్చే ఫోన్‌కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. అవతలి వ్యక్తులకు సివివి/ఓటీపీ/క్యూ ఆర్ కోడ్ వంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకూడదు. బ్యాంకుకు సంబంధించిన ఏ వ్యక్తులు కూడా ఈ గోప్యతా వివరాలను అడగరు. కాబట్టి, గోప్యతా వివరాల పట్ల జాగ్రత్త అవసరం.
కార్డు ద్వారా చేసే పేమెంట్ (పిఒఎస్)
కార్డు స్కిమ్మింగ్ (మీ వివరాలను కార్డు నుంచి రాబట్టే పరికరం) ఎక్కువగా రిటెయిల్ ఔట్‌లెట్స్, బార్లు, రెస్టారెంట్లు, పార్కింగ్ టికెట్ మెషిన్స్, పెట్రోల్ స్టేషన్‌లలో జరిగే అవకాశాలు ఎక్కువ.
► కార్డు ద్వారా నగదు బదిలీ చేసే సమయంలో మీ దృష్టి మరల్చకూడదు
► స్వైప్ చేసేటప్పుడు మీ కార్డు మీకు కనిపించాలనే విషయం స్పష్టంగా చెప్పండి.
క్రెడిట్/డెబిట్ కార్డుల ద్వారా మోసాలు ఎలా జరుగుతాయంటే..?
► మోసగాళ్ల దగ్గర స్టోర్ కార్డ్ రీడర్ మిషన్, దొంగ కార్డు మిషన్ రెండూ ఉంటాయి. ∙మీరు కార్డు ఇవ్వగానే కార్డు స్కిమ్మర్ చేసి, డేటా దొంగిలిస్తారు ∙ఎటిఎమ్ మిషన్‌లలో అయితే.. కీ బోర్డ్ ప్లేస్‌లో మోసగాళ్లు మరో కీ బోర్డ్‌ను ఇన్‌స్టాల్ చేస్తారు. ∙స్వైపింగ్ మిషన్‌కు సూక్ష్మమైన కెమెరాను సెట్ చేస్తారు.
ఎటిఎమ్‌లలో కార్డును ఉపయోగిస్తుంటే..
► కార్డును ఉపయోగిస్తున్నప్పుడు మీ చుట్టుపక్కల ఉన్నవారి నుంచి జాగ్రత్త.
► మీ పిన్ నెంబర్ మీ నగదుకు కవచం అనే విషయం మర్చిపోవద్దు
► కార్డు పనిచేయనప్పుడు, మిషన్‌లో ఉండిపోయినప్పుడు వెంటనే బ్యాంక్‌కు తెలియజేయాలి
► ట్యాంపరింగ్ సంకేతాలు ఏమైనా కనిపిస్తే ఎటిఎమ్ కార్డును ఉపయోగించవద్దు.
అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్‌బీయింగ్ ఎక్స్‌పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్
చదవండి: Most Famous Afghanistan Refugee: అప్పుడూ ఇప్పుడూ.. ఆమే!.. పాపం మరోసారి
Comments
Please login to add a commentAdd a comment