విజయనగరం అంటే.. రాజులు, రాజ్యాలు, సామ్రాజ్యాలు, సంగీత కళాశాల మదిలో మెదులుతాయి. సంగీతసాహిత్యాలే కాకుండా విజయనగరం ఎన్నో రుచులకు పుట్టినిల్లు. ముఖ్యంగా ఇక్కడి శ్రీలక్ష్మీ హోటల్‌లో రుచులు ఎందరినో ఆకర్షిస్తున్నాయి. ఇక్కడ ఒక్కసారి తిన్నామంటే, మళ్లీమళ్లీ ఇక్కడకు రావలసిందే. ఎందరో ప్రముఖుల ప్రశంసలు అందుకున్న శ్రీలక్ష్మిహోటల్... సంప్రదాయబద్ధమైన నాన్ వెజ్ వంటకాలకు ప్రసిద్ధి. విజయనగరంలోని మూడు లాంతర్ల జంక్షన్ దగ్గర ఉన్న ఈ హోటల్‌లో మాసాంహారం రుచి చూసినవారు మరో పది మందికి చెప్పకుండా ఉండలేరు. అయినంపూడి సుదర్శనరాజు, బుచ్చి అప్పలరాజు కుటుంబ సభ్యుల పర్యవేక్షణలో ఈ వంటకాలకు మరింత రుచి చేరుతోంది.
శుచిరుచులకు కేరాఫ్ అడ్రస్:
ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవమైన పైడితల్లమ్మవారి చదరుగుడికి సమీపంలో ఈ హోటల్‌ని 1964 సంవత్సరంలో అయినంపూడి వెంకటరాజు ప్రారంభించారు. అప్పట్లో నగరంలో కేవలం రెండు, మూడు మాంసాహార హోటళ్లు మాత్రమే ఉండేవి. అందులో శ్రీలక్ష్మి హోటల్ ఒకటి. రోడ్డు మీద నుంచి చూసేవారికి హోటల్ ముఖద్వారం చిన్నగా కనిపించినా, హోటల్ లోపలికి వెళ్లేసరికి విశాలంగా ఉం టుంది. అప్పట్లో అమ్మవారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి విజయనగరం వచ్చిన వారు సమీపంలో ఉండే ఈ హోటల్‌లో తప్పకుండా భోజనం ఆరగించేవారట. హోటల్ ప్రారంభించిన కొత్తల్లో బిర్యానీ, చికెన్ వంటకాలన్నీ పావలా నుంచి రూపాయి పావలాకే అందించేవాళ్లమని ఇప్పటి నిర్వాహకులు అయినంపూడి సుదర్శనరాజు చెబుతున్నారు.
ఇక్కడ ఇప్పటికీ కట్టెల పొయ్యపై మీదే వంటకాలు తయారుచేస్తున్నారు. ఇక్కడకు ఎక్కువ మంది ఆహారప్రియులకు రావటానికి ఇది ప్రత్యేక కారణం. ఇక్కడ అందించే చికెన్ కర్రీ, జాయింట్లు, చికెన్ బిర్యానీ, మటన్ కైమా, చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై , చేపల కర్రీ వంటి వంటకాలు నోరూరిస్తుంటాయి. వీటి తయారీ విషయంలో నిర్వాహకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. అయినంపూడి ఇంటి మహిళలు స్వయంగా తయారుచేసిన మసాలాలు ఇక్కడి వంటకాలకు ఇంత రుచి రావడానికి కారణం. ఇళ్లల్లో వాడే మసాలా కన్నా తక్కువ ఘాటు, ఎక్కువ రుచి ఉంటాయి. నూనె విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటారు.
ఇంట్లో గొడవ పెట్టుకుని వచ్చి తినవలసిందే..:
ఈ హోటల్ ప్రారంభం నుంచి వినియోగదారుల ఆదరణ పొందింది. అప్పట్లో ఈ హోటల్‌లో భోజనం ఆరగించేందుకు పురుషులు ఇళ్లల్లో గొడవ పెట్టుకుని మరీ వచ్చేవారని నిర్వాహకులు సరదాగా చెబుతారు. వచ్చినవారికి వడ్డించేంత తీరిక లేనంత బిజీగా ఉండేదట. సినీ ప్రముఖులు స్రవంతి రవికిషోర్, రావుగోపాలరావు, డైరెక్టర్ వంశీ ఇలా ఎంతో మంది విజయనగరం వచ్చారంటే ఈ హోటల్ భోజనం రుచి చూడవలసిందే. ఇప్పటికీ అదే ఆదరణ కొనసాగుతోంది.
– బోణం గణేష్, సాక్షి ప్రతినిధి, విజయనగరం.
ఇన్‌పుట్స్: పి. నరేష్
చదవండి: ఉదయం పెసరట్టు.. లంచ్‌లో బ్రౌన్ రైస్.. రాత్రికి రాగిముద్ద!
కరోనా: గుడ్లు, చికెన్, చేపలు .. శాకాహారులైతే
Comments
Please login to add a commentAdd a comment