టాలీవుడ్ సీనియర్ నటుడు సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే? ఆయన నటుడిగా, విలన్‌గా పలు విభిన్న పాత్రలతో మెప్పించిన వ్యక్తి. అదీగాక నటుడిగా సుమారు 270కి పైగా సినిమాలు చేశారు. దర్శకుడిగా, నిర్మాతగా పలు చిత్రాలను తెరకెక్కించారు కూడా. కొంతకాలం పాటు తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగారు. ఆ తర్వాత విలన్ పాత్రలు, తండ్రి పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తూనే సీరియల్స్‌లోనూ పలు కీలక పాత్రలు చేస్తున్నారు. మొన్నటి వరకు మనం సురేషని పెద్ద తరహాలో లావుగా చూశాం. ఇప్పుడూ కుర్రాడిలా స్లిమ్‌గా హీరో లుక్‌లో కనిపిస్తున్నారు. ఇంతలా మారిపోయిన సురేష్‌ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ మేరకు ఓ టీవీ ఇంటర్వ్యూలో తాను ఫాలో అయ్యిన డైట్ గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.
ఏకంగా 15 గంటల వరకు నో ఫుడ్..
ఒకప్పుడు సినిమాల్లో మంచి స్లిమ్‌గా హీరోలా కనిపించే సురేష్ గత కొద్దికాలం క్రితం బాగా లావయ్యారు. సుమారు 120 కిలోల బరువు ఉండేవారు. ఆ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేసి సీరియల్స్‌లో నటించడంతో అంతా బరువుగా ఉండటం వల్లే సినిమాలు చేయడం లేదని అనుకున్నారు. ఆ మాటాలు సురేష్ చెవిన పడటంతో ఎలాగైనా బరువు తగ్గాలని స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయినట్లుతెలిపారు నటుడు సురేష్. అందుకోసం గత ఐదు నెలలుగా చాలా కఠినమైన డైట్ ఫాలో అయినట్లు చెప్పారు. అందువల్లే ఇంతలా బరువు తగ్గానని అన్నారు. ఈ నేపథ్యంలో తాను ఫాలో అయిన డైట్‌కి సంబంధించిన ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
తాను నిద్ర లేచిన గంట వరకు ఎలాంటి ఫుడ్స్ తీసుకోనని, కేవలం నీళ్లు, గ్రీన్ టీ వంటివే తీసుకుంటానని అన్నారు. ఆ తర్వాత ఒక గంటకి అరటి పండు లేదంటే ఆపిల్ తీసుకోవడం జరుగుతుందన్నారు. అదీ కాదంటే టమాట తింటానన్నారు. ఉదయం తొమ్మిది గంటలకు ఎగ్‌లోని తెల్ల సొన తింటానన్నారు. ఇక బ్రేక్ ఫాస్ట్‌గా ఓట్స్ తింటానని, ఎక్కువగా ఉడికించిన కాయగూరలే తీసుకుంటానని చెప్పుకొచ్చారు. లంచ్‌లో పుల్కాలు కొద్దిగా రైస్ తీసుకుంటానని చెప్పారు. ఆదివారం వస్తే బిర్యానీ రైస్, గ్రిల్ చికెన్, గ్రిల్ ఫిష్, తప్పనసరిగా ఉండాల్సిందే అన్నారు. మధ్యాహ్నం కడుపునిండా ఫుడ్ తీసుకున్నా 15 గంటల వరకు ఏం తిననని చెప్పారు సురేష్. అంటే మధ్యాహ్నాం ఒంటి గంటకు తింటే మరుసటి రోజు ఉదయం వరకు ఏం తినేది ఉండదు. మరీ తట్టుకోలేనంటే ..కొద్దిగా నీళ్లు లేదా మజ్జిగలో కాస్త నిమ్మరసం పిండుకుని తాగడం వంటివి చేస్తానని చెప్పారు.
ఆ డైట్ చూసి.. డాక్టర్లే షాకయ్యారు..
తన డైట్ గురించి విని డాక్టర్లు షాకయ్యారని సురేష్ చెప్పారు. గత ఐదు నెలలుగా ఈ డైటే ఫాలో అవుతున్నట్లు తెలిపారు. అలా 21 కేజీల వరకు బరువు తగ్గినట్లు చెప్పారు. ప్రస్తుతం తాను 88 కేజీల బరువు ఉన్నట్లు చెప్పారు. ఐతే ఇలా 15 గంటలకు వరకు ఏం తీసుకోకపోవడం వల్ల శరీరంలో కొలస్ట్రాల్ పెరిగే అవకాశమే ఉండదన్నారు. ఎందుకంటే కాస్త తినడానికి విరామం ఇవ్వడం వల్ల బరువు ఆటోమెటిక్‌గా తగ్గిపోతాం అని వివరించారు సురేష్. అయితే ఈ డైట్ మొదలు పెట్టే ముందు తాను ఎన్ని రోజుల వరకు తినకుండా ఉండగలనో చెక్ చేసుకున్నట్లు తెలిపారు.
తాను మూడు రోజుల కేవలం నిమ్మకాయ నీళ్లతో ఏం తీసుకోకుండా ఉండగలిగానని, అప్పుడే ఏకంగా ఆరు కేజీలు వరకు తగ్గానని అన్నారు. ఈ విషయమే వైద్యులకు చెప్పగా..వాళ్లు కోప్పడి అదేం డైట్? చచ్చిపోతావ్! అని ఫైర్ అయ్యారని అన్నారు. సరైన విధంగా డైట్ ఫాలో అవ్వు అని హెచ్చరించడంతో ఇలా డైట్‌లో పలు మార్పులు చేసుకొచ్చినట్లు చెప్పుకొచ్చారు. తాను మొదట్లో ఐదు నిమిషాలే వాకింగ్ చేసేవాడినని, ఇప్పుడూ ఏకంగా 18 కిలోమీటర్లు వరకు వాకింగ్ చేస్తున్నట్లు చెప్పారు నటుడు సురేష్.
(చదవండి: మిథున్ చక్రవర్తికి వచ్చిన ఇస్కీమిక్ స్ట్రోక్ అంటే..? ఎందువల్ల వస్తుంది?)
Comments
Please login to add a commentAdd a comment