పెద్దల మాట.. సద్దన్నం మూట అంటారు. అంటే పెద్దవాళ్లు ఏం చెప్పినా మంచే చెబుతారన్నది దాని సారాంశం. ఇప్పుడంటే మనకు బ్రేక్‌ఫాస్ట్‌లో ఇడ్లీ, దోస, వడ వంటి పదార్థాలు వచ్చాయి.. కానీ పాతకాలం రోజుల్లో అందరూ చద్దన్నమే తినేవాళ్లు. రాత్రి వండిన అన్నాన్ని ఉల్లిపాయతో కలిపి పెరుగు లేదా నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే తినేవారు. దీన్నే చద్దన్నం అనేవారు.
రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో దీనికి మించిన సూపర్ ఫుడ్ లేదంటారు. అందుకే ఇప్పుడు మన దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ పల్లెటూరి బ్రేక్‌ఫాస్ట్ చద్దన్నంకు మంచి డిమాండ్ ఉంది. అక్కడ డబ్బులిచ్చి మరీ చద్దన్నంను కొనుగోలు చేస్తున్నారు.
కరోనా మహమ్మారి చాలామందిని మళ్లీ పాతకాలం అలవాట్లవైపు తిప్పింది. ఒకప్పుడు గ్రామాల్లో అక్కడక్కడ మాత్రమే కనిపించే ఈ చద్దన్నం కల్చర్ ఇప్పుడు నగరాలకు, విదేశాలకు కూడా పాకింది. అందుకే ఇప్పుడు కొన్ని ఫైవ్‌స్టార్ హోటళ్లలోనూ చద్దన్నాన్ని ప్రత్యేకంగా వడ్డిస్తున్నాయి. ఆన్‌లైన్ ఆర్డర్స్‌లోనూ చద్దన్నం స్పెషల్ మెనూ లిస్ట్‌లో చేరిపోయింది.
ఒకప్పుడు రాత్రి మిగిలిన అన్నం పొద్దున తినడం అంటే నామోషీగా ఫీల్ అయ్యేవారు. కానీ ఇందులో ఉన్న పోషక విలువలు తెలుసుకున్నాక చద్దన్నం తినేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అమెరికాలోనూ చద్దన్నం భారీ ధరకు అమ్ముడవుతుంది. దీనికి సంబంధించిన ఓ క్రేజీ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
అమెరికాలోని ఓ స్టోర్‌లో చద్దన్నం దాదాపు వెయ్యి రూపాయలకు అమ్ముతున్నారని, కలికాలం అంటే ఇదేనంటూ ఓ ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో ఇప్పటికే 4.2 వ్యూస్‌తో నెట్టింట హల్‌చల్ చేస్తుంది. దీంతో మరోసారి చద్దన్నంపై చర్చ నడుస్తుంది. ఇంతకీ న్యూట్రీషియన్స్ పరంగా చద్దన్నం తింటే ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో చూద్దాం.
►చద్దన్నంలో ఐరన్, కాల్షియం,పొటాషియం పుష్కలంగా ఉంటుంది.
► అల్సర్లు, పేగు సంబంధ సమస్యలు ఉన్నవారికి చద్దన్నం పరమౌషధంలా పనిచేస్తుంది
► యాంగ్జయిటీని దూరం చేయడంతో చద్దన్నం కీ రోల్ పోషిస్తుంది.
► ఒంట్లో వేడిని తగ్గించడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
► ఉదయాన్నే చద్దన్నంలో పెరుగు కలుపుకొని తింటే రక్తహీనత నుంచి బయటపడొచ్చు
► చద్దన్నం తింటే అధిక రక్తపోటు, మలబద్ధక సమస్యలు దూరమవుతాయి
► ఎదిగే పిల్లలకు చద్దన్నం మంచి పౌష్టికాహారంగా ఉపయోగపడుతుంది.
► తరచూ చద్దన్నం తింటే బద్దకం, నీరసం లేకుండా ఉంటుంది.
చద్దన్నం ఇలా తయారుచేయాలి?
రాత్రి మిగిలిన అన్నాన్ని మట్టి పాత్రలో ఉండలు లేకుండా ఉంచుకోవాలి. దీంట్లో అన్నం మునిగేంత వరకు నీళ్లు పోయాలి. ఆ తర్వాత కొన్ని గోరువెచ్చని పాలు, పెరుగు, నాలుగైదు పచ్చి మిరపకాయలు కొంచెం ఉప్పు వేసి కలియబెట్టాలి. దీనిపై మూత పెట్టి రాత్రంతా కదలించకుండా ఉంచాలి. పెరుగు పులియడం వల్ల ఆరోగ్యానికి మేలు చేసే ప్రొబ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఆ తర్వాత మరుసటి రోజు అన్నంలో పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తింటే రుచిగా ఉండటంతో పాటు శరీరానికి ఎంతో శక్తి లభిస్తుంది. మీరు కూడా ఓసారి ట్రై చేసి చూడండి మరి.
Comments
Please login to add a commentAdd a comment