పలుకు ఒక్కటి చాలు పది వేల సైన్యం’ అనుకుంటే తులసీ గబార్డ్ అక్షరాలా ఆ మాటకు సరిపోతుంది. చర్చావేదికలలో తన వాక్చాతుర్యంతో ప్రత్యర్థిని ముప్పు తిప్పలు పెట్టడంలో తులసికి ఘన చరిత్ర ఉంది. ఆ ప్రతిభే ఆమెను అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలోకి తీసుకువచ్చింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ‘డిబేట్’ అనేది కీలక ఘట్టం. ఓటర్ల అభిప్రాయాలు, ఆలోచనలను ప్రభావితం చేసే చర్చావేదిక. వచ్చే నెలలో జరగబోయే డోనాల్డ్ ట్రంప్–కమలా హారిస్ డిబేట్ కోసం ట్రంప్‌కు శిక్షణ ఇస్తున్న మహిళగా తులసి వార్తల్లోకి వచ్చింది. కమలా హారిస్‌ను ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్న ట్రంప్‌కు తులసికి ఉన్న బహుముఖ ప్రజ్ఞ, ఆమె బృందంలోని ప్రతిభ విలువైన ఆస్తులుగా కనిపిస్తున్నాయి.
ఇక కమలా హారిస్‌కు ఎన్నికల్లో బలమైన సలహదారుగా మాయ హారిస్ ఉంది. ఆమె ఎన్నికల ప్రసంగాలు ఫక్తు ఎన్నికల ప్రసంగాలలాగే ఉండనక్కర్లేదు అనేలా మాయా ప్రసంగాలు ఉంటాయి. కమలా హారిస్ చెల్లెలు మాయా హారిస్‌కు తన ప్రసంగాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అంటే కుటుంబ బంధాల్లో నుంచి చెప్పొచ్చు. ఆమె ప్రసంగాలలో తన తల్లి ప్రస్తావన ఉంటుంది. ఆమె తన తల్లి గురించి చెప్పే భావోద్వేగపూరిత ప్రసంగాలు ట్రంప్‌పై చేసే రాజకీయ విమర్శల కంటే బలమైన ప్రభావం చూపుతాయి. ఆ అద్భుత నైపుణ్యమే మాయను అక్క కమలా హారిస్‌కు కీ అడ్వైజర్‌ని చేసింది. మరీ ఈ ఇద్దరి నేపథ్యం, వారి వాక్ శక్తి ఏంటో సవివరంగా చూద్దామా..
ట్రంప్ సలహాదారుగా తులసీ
‘హూ ఈజ్ షీ?’ అని ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది తులసి గబార్డ్ గురించి ఆరా తీస్తున్నారు. తులసి తండ్రి మైక్ గబార్డ్ సమోవా–అమెరికన్. రాజకీయ నాయకుడు. తల్లి కరోల్ పోర్టర్ ఇండియానా రాష్ట్రంలో పుట్టింది. టీనేజీలో హిందూమతాన్ని స్వీకరించింది. హిందూమతం పట్ల ఆమెకు ఉన్న ఆసక్తితో కుమార్తెకు ‘తులసి’ అని పేరు పెట్టింది.
సెప్టెంబర్ 10న ట్రంప్, కమలా హారిస్ మధ్య తొలి డిబేట్ జరగనుంది. ఇద్దరు అభ్యర్థులు ఒకరినొకరు సవాలు చేసుకోవడానికి, పైచేయి సాధించడానికి సిద్ధమవుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని తన ప్రిపరేషన్‌కు సంబంధించి తులసి, ఆమె బృందం సహాయం తీసుకున్నాడు డోనాల్డ్ ట్రంప్. తులసి సహాయంతో కమలా హారిస్‌పై పై చేయి సాధించి తన స్థానాన్ని బలోపేతం చేసుకోవాలని, ఓటర్లను ప్రభావితం చేయాలని ట్రంప్ లక్ష్యంగా పెట్టుకున్నాడు. 2020 అధ్యక్ష ఎన్నికల తరువాత డెమొక్రాటిక్ ΄ార్టీని వీడిన తులసి ట్రంప్ మద్దతుదారులలో బలమైన వ్యక్తిగా గుర్తింపు పొందింది. ‘ఆమె మాటను ట్రంప్ తు.చ. తప్పకుండా పాటిస్తాడు’ అని చెప్పుకుంటారు.
‘రాజకీయ చరిత్రలో ఉత్తమ వక్తలలో ఒకరిగా ట్రంప్ గుర్తింపు పొందాడు. ట్రంప్‌కు సంప్రదాయ డిబేట్ ప్రిపరేషన్ అవసరం లేదు. అయితే గతంలో కమలా హారిస్‌ను విజయవంతంగా ఎదుర్కొన్న తులసి గబార్డ్‌లాంటి గౌరవ సలహాదారుల అవసరం ఎంతో ఉంది’ అంటుంది ట్రంప్ అధికార ప్రతినిధి కరోలిన్. గత అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో జాతీయ దృష్టిని ఆకర్షించింది తులసి.
దీనికి కారణం ‘డెమోక్రటిక్ డిబేట్స్’లో కమలా హారిస్‌తో పోటీపడి తన సత్తా చాటింది. హవాయి ఆర్మీ నేషనల్ గార్డ్‌లో పనిచేసినప్పటి నుంచి రాజకీయాల వరకు తులసి అనేక సవాళ్లను ఎదుర్కొంది. ‘నేనే సర్వస్వం’ అనుకునే డోనాల్డ్ ట్రంప్‌ను గ్రేట్ డిబేట్ కోసం సన్నద్ధం చేయడం అతి పెద్ద సవాలు. చిన్నప్పటి నుంచి ‘భగవద్గీత’ శ్లోకాల్లో మునిగి తేలిన తులసికి సవాళ్లను ఎదుర్కొనే వ్యూహం ఉంది. మాటలతో సత్తా చాటే శక్తి ఉంది.
కమలకు మాయమద్దతు..
చికాగోలో జరిగిన డెమొక్రటిక్ నేషనల్ కన్వెన్షన్ (డిఎన్‌సీ)లో అక్క కమలా హారిస్‌కు మద్దతుగా మాట్లాడిన మాయా హారిస్ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. తన ప్రసంగంలో భారతీయురాలైన తన తల్లి డా. శ్యామల గోపాలన్‌ను స్మరించుకుంది. ‘అమ్మ స్వయం నిర్ణయాధికార శక్తి మాకు స్ఫూర్తి. మేము స్వతంత్రంగా ముందడుగు వేయడంలో ఆమె పాత్ర ఎంతో ఉంది. ఈ హాల్‌లో అమ్మ ఉండి ఉంటే అక్కను చూసి ఎంత సంతోషించేది. నాకు తెలుసు... ఆమె దివి నుంచి చిరునవ్వుతో మమ్మల్ని ఆశీర్వదిస్తుంది.’ అంటుంది మాయ.
‘మీ జీవిత కథకు మీరే రచయిత్రులు’ అని తల్లి చెప్పిన మాటను ఎప్పుడూ గుర్తు చేసుకుంటుంది మాయాహారిస్. అక్క ΄ోరాట స్ఫూర్తి ఆమెకు ఎంతో ఇష్టం. స్టాన్‌ఫోర్డ్ లా స్కూల్‌లో చదువుకున్న మాయా హారిస్ ‘స్టాన్‌ఫార్డ్ లా రివ్యూ’ కు ఎడిటర్‌గా కూడా పనిచేసింది. విషయ విశ్లేషణ, ఒక అంశాన్ని అనేక కోణాల్లో చూడడం అనేది అక్కడి నుంచే అలవడింది. సామాజిక ఉద్యమాల్లోనూ చురుగ్గా ΄ాల్గొనేది మాయ. ‘డొమెస్టిక్ వయొలెన్స్ క్లినిక్’కు కో–ఆర్డినేటర్‌గా బాధ్యతలు నిర్వహించింది. లా స్కూల్‌లో పట్టా పుచ్చుకున్న తరువాత లా క్లర్క్‌గా పనిచేసింది. ఆ తరువాత ‘జాక్సన్’ లా ఫర్మ్‌లో చేరి సివిల్, క్రిమినల్ కేసులపై పనిచేసింది.
కేవలం కమలా సోదరిగానే కాదు..
రాజకీయ విషయాలకు వస్తే... డెమొక్రటిక్ ΄పార్టీలో హిల్లరీ క్లింటన్ ప్రచార ప్రతినిధిగా, తన సోదరి కమలా హారిస్ కోసం 2020లో ‘క్యాంపెయిన్ ఫర్ ప్రెసిడెంట్’గా పనిచేసింది. ‘వ్యక్తులను తక్కువ అంచనా వేసే వారికి ఎలా జవాబు చెప్పాలో అక్కకు తెలుసు. అండర్‌డాగ్‌గా ఉండడం ఎలా ఉంటుందో కూడా ఆమెకు తెలుసు. ఇప్పటికీ ఎన్నో అడ్డంకులను అధిగమించింది. ఆశావాదంతో ముందుకు వెళుతోంది. ఈ చారిత్రక సందర్భంలో ఆమె నాయకత్వం మనకు అవసరం’ అంటుంది మాయా హారిస్.
అయితే అక్కలో ఉన్నాయని చెబుతున్న సుగుణాలన్నీ మాయలో కూడా ఉన్నాయి. ఆమె గుర్తింపు ‘కమలా హారిస్ సోదరి’కి మాత్రమే పరిమితమైనది కాదు. న్యాయవాదిగా, సామాజిక కార్యకర్తగా, రచయిత్రిగా, ఉపన్యాసకురాలిగా యూఎస్‌లో తనకంటూ సొంత గుర్తింపు ఉంది. ఎన్నికల ప్రచారం, వ్యూహాల విషయంలో కమలా హారిస్ ఇతరులపై ఆధారపడాల్సిన అవసరం లేదు. చెల్లి తనకు ఎంతో అండ. ఉత్తేజిత శక్తి.
(చదవండి: డౌన్ సిండ్రోమ్‌తో లాయర్‌గా చరిత్ర సృష్టించింది! ఎవరీమె..?)
Comments
Please login to add a commentAdd a comment