ఈ రాశి వారు ఈ సంవత్సరం కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే.. | Sagittarius-Dhanu-Rashi-Ugadi-Panchangam-2024 | Sakshi
Sakshi News home page

ఈ రాశి వారు ఈ సంవత్సరం కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే..

Published Sun, Apr 7 2024 11:10 AM | Last Updated on Sun, Apr 7 2024 12:51 PM

Ugadi Panchangam 2024 - Sakshi

ధనూ రాశి

ఆదాయం–11, వ్యయం–5, రాజయోగం–7, అవమానం–5
మూల 1,2,3,4 పాదములు (యే, యో, బా, బీ)
పూర్వాషాఢ 1,2,3,4 పాదములు (బూ, ధా, భా, ఢా)
ఉత్తరాషాఢ 1వ పాదము (బే)

గురువు మే 1 వరకు మేషం (పంచమం)లోను తదుపరి వృషభం (షష్ఠం)లోను సంచరిస్తారు. శని కుంభం (తృతీయం)లోను రాహువు మీనం (చతుర్థం)లోను కేతువు (దశమం)లోను సంచరిస్తారు. రోజు వారీ కార్యక్రమాలలో చాలా చక్కటి సమయపాలన చేసి సుఖపడతారు. అన్ని విషయాలలోనూ స్వతంత్ర నిర్ణయాలు చేసేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. చాలా సందర్భాలలో మీకు శుభవార్తలు అందుతాయి. మీ వ్యవహారాలలో శుభ పరిణామాలు ఎక్కువసార్లు ఉంటాయి. విజ్ఞాన వినోద విహార యాత్రలు ఎక్కువగా సాగిస్తారు. స్నేహితుల మీద ఆధారపడి ఏ పనీ చేయవద్దు. మీ మాట తీరు ఇతరులకు మానసిక చికాకులు సృష్టించి, తద్వారా విభేదాలు తీసుకురాగలదు. వాగ్ధోరణిని నియంత్రించండి. ఉద్యోగ విషయాలు అంతా బాగానే ఉంటాయి కానీ, అనవసర విషయాలు మిమ్మల్ని అశాంతికి లోనయ్యేలాగా చేస్తుంటాయి. స్థిర బుద్ధి ప్రదర్శించకపోవడం దృష్ట్యా మధ్య మధ్య చికాకులు ఉంటాయి.

ట్రాన్స్‌ఫర్‌ ప్రయత్నాలు జాగ్రత్తగా చేస్తే స్వస్థలం లేదా అనుకూల స్థలం చేరుకోగలరు. మీకు మంచి మార్పులకు కూడా కాలం అనుకూలం అవుతుంది. వ్యాపారులకు అనుకూల స్థితి ఉంటుంది. ఎప్పటి నుంచో ఉండిపోయిన వ్యాపార సమస్యలు, ప్రభుత్వ తరఫు సమస్యలు కూడా ఈ సంవత్సరం సానుకూలంగా పూర్తి అవుతాయి. కుటుంబ విషయాలు చూస్తే తరచుగా భార్యాపుత్ర విరోధం ప్రతి విషయంలోనూ ఎదురవుతుంది. కానీ తెలివిగా సరిచేయగలుగుతారు. పెద్దల ఆరోగ్య విషయంగా జరిగే పనులు మీ ఇతర కార్యక్రమాలను ఇబ్బంది పెడతాయి. పనులు వాయిదా వేసి ఒంటరిగా ఎక్కడకు అయినా వెళ్ళాలి అని తరచుగా అనిపిస్తుంది. తరచుగా శుభకార్య, పుణ్యకార్య నిమిత్త ప్రయాణాలు మీ వలన ఆగిపోవడం దృష్ట్యా కుటుంబ సభ్యులు అసంతృప్తి చెందుతారు. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే ధనవ్యయం బాగా అధికం అవుతుంది. అరికట్టలేని పరిస్థితి ఉంటుంది. కొన్ని సందర్భాలలో ముఖ్యమైన అవసరాలను కూడా వాయిదా వేయాల్సిన స్థితి ఉంటుంది. 

ఋణాలు ఇచ్చి పుచ్చుకునే సందర్భంలో సమస్యలు ఎదురౌతాయి. మీ అందరితోనూ మితవాదం చేయుట శ్రేయస్కరం. ఏ విషయంలోనూ ఇచ్చిన హామీలు నెరవేర్చుకోలేరు. ఆరోగ్య విషయంగా వాత సంబంధ అనారోగ్యం ఉన్నవారికి కొంచెం ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. మిగిలిన వారి విషయంలో పెద్దగా ఇబ్బందులేవీ ఉండవు. మొత్తం మీద మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశికి చెంది స్త్రీలకు సరైన గుర్తింపు లేని విధంగా ఉద్యోగ పరిస్థితులు ఉంటాయి. అయితే ఇబ్బందికర ఘటనలు ఉండవు. 

కుటుంబ విషయాలలో అనుకూల స్థితి ఉంటుంది. గర్భిణీ స్త్రీల విషయమై మే నెల తరువాత ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. వైద్య సలహాలు బాగా పాటించండి. షేర్‌ వ్యాపారులకు వ్యాపారం బాగున్నా, తగిన లాభాలు అందని పరిస్థితి. ప్రశాంత చిత్తంతో ఆలోచించండి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి పనులు కొంచెం ఇబ్బంది పెట్టినా, సానుకూలం అవుతుంటాయి. కోర్టు వ్యవహారాలలో ఉన్నవారికి మే నెల నుంచి ధనవ్యయం అధికం అవుతుంది. కార్యలాభం దూరమే. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి కావలసిన వనరులు తేలికగా లభ్యం అవుతాయి. మంచి నిర్ణయం చేస్తారు. విద్యార్థులకు శ్రమతో కూడిన మంచి ఫలితాలు వస్తాయి. గురుబలం తక్కువ. అన్ని విద్యా విషయాలు జాగ్రత్తగా చూడండి. రైతుల విషయంలో మంచి సలహాలు దొరకవు. అయితే మీరు చేసే శ్రమ ఒక్కటే మీకు శ్రీరామరక్ష.

మూల నక్షత్రం వారికి సాంఘిక కార్యక్రమాలలో అవమానాలు ఎదురవుతాయి. అయిష్టంగానే కొన్ని పనులు చేయవలసి వస్తుంది. కుటుంబ, ఆర్థిక, వృత్తి విషయాలలో అసంతృప్తి పెరుగుతుంది. పూర్వాషాఢ నక్షత్రం వారు ముందు జాగ్రత్త చర్యలతో పరిస్థితులను సానుకూలం చేసుకుంటారు. తరచు విహార యాత్రలు చేస్తారు. గురువులను దర్శించుకుంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఉత్తరాషాఢ నక్షత్రం వారు నియమబద్ధంగా వృత్తి ఉద్యోగాలు నిర్వర్తిస్తారు. అభివృద్ధి ఉన్నా, తగిన ఫలితాలు రావు. కుటుంబంలో సానుకూలత సాధిస్తారు. 

శాంతి మార్గం: సంవత్సర ఆరంభంలో రాహువుకు, మే నెలలో గురువుకు జపం చేయించండి. ప్రాతఃకాలంలో రోజూ తెల్లటి పుష్పాలతో అమ్మవారి అర్చన చేయడం, ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణలు చేసి దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేయడం శ్రేయస్కరం.

ఏప్రిల్‌: పని మీద దృష్టి పెట్టలేరు. ఇతర కార్యకలాపాలపై ఆసక్తి వలన ఇబ్బందులు కలుగుతాయి. అశ్రద్ధ, అకాలభోజనం వలన ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆదాయం తగ్గుతుంది, ఖర్చులు పెరుగుతాయి. నవగ్రహస్తోత్రం పఠించాలి. ఉద్యోగ వ్యాపారాలలో కోరిన విధంగా ముందుకు వెడతారు. కుటుంబ సమస్యలకు, ఋణ సమస్యలకు, కోర్టు వ్యవహారాలకు మంచి పరిష్కారాలు పొందుతారు. పుణ్యకార్యాలలో పాల్గొంటారు.

మే: నూతనోత్సాహంతో పనులు పూర్తిచేస్తారు. వ్యాపారం గతంలోకన్నా లాభిస్తుంది. ఉద్యోగంలో బదిలీలు అనుకూలం. దుర్జన సాంగత్యం వలన ఊహించని సమస్యలు. ఆరోగ్య జాగ్రత్తలు అవసరం. ప్రయాణాలు కలిసివస్తాయి. వివాహాది ప్రయత్నాలు ఫలిస్తాయి. షేర్‌ వ్యాపారుల ప్రణాళికలు సరిగా సాగవు. రైతులకు, విద్యార్థులకు శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ.

జూన్‌: తరచు ఊహించని ప్రయాణాలు. దాంపత్య జీవితంలో మనస్పర్థలు కలుగుతాయి. పనిఒత్తిడి వలన ఇంటి పనులు నిర్వహించలేరు. వ్యాపార భాగస్వామితో విభేదాలు తలెత్తుతాయి. శివకుటుంబ ఆరాధన మంచిది. మూలనక్షత్రం వారు ఒత్తిడికి లోనవుతారు. ఆర్థిక వెసులుబాటు ఇబ్బందికరంగా ఉంటుంది. ఇతరులను నమ్మి కొత్త ప్రయత్నాలు చేయరాదు. ఉద్యోగులకు శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ. షేర్, ఫైనాన్స్‌ వ్యాపారులకు విచిత్ర సమస్యలు ఉంటాయి. పాత ఆరోగ్య సమస్యలు తిరగబెడతాయి. 

జులై: దాంపత్య జీవితంలో సమస్యలు సర్దుకుంటాయి. వ్యాపారంలో విభేదాలు, శత్రుబాధలు తొలగుతాయి. ఉద్యోగంలో రాణిస్తారు. ప్రభుత్వ పనుల్లో జాప్యం. భూమి కొనుగోలు చేస్తారు.  శివ–విష్ణు స్తోత్ర పారాయణ మేలు. క్రమంగా అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. షేర్‌ వ్యాపారులకు అద్భుతాలు జరుగుతాయి. విద్యార్థులకు రైతులకు అనుకూలం.

ఆగస్ట్‌: ఈనెల అనుకూలత తక్కువ. చెప్పుకోలేని సమస్యలు. వృథా కాలక్షేపం వలన పని ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. నవగ్రహ శాంతి చేయడం మేలు. పుణ్యకార్య శుభకార్య, కుటుంబ కార్యక్రమాల నిమిత్తం ప్రయాణాలు అధికంగా చేస్తుంటారు. ఆర్థిక వెసులుబాటు తక్కువ. వస్తువులు చౌర్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. షేర్‌ వ్యాపారులకు దూకుడు తగదు. రైతులకు కాలం అనుకూలం.

సెప్టెంబర్‌: ఉద్యోగంలో సమస్యలు కొలిక్కి వస్తాయి. అధికార యోగం. ప్రతిభకు తగిన పురస్కారాలు లభిస్తాయి. వ్యాపార లబ్ధి. ఆరోగ్యంపై అశ్రద్ధ వద్దు. కుటుంబ సమస్యలకు పెద్దల సలహాలతో పరిష్కారం లభింస్తుంది. రాబోవు ఆరుమాసాలు ఆర్థిక, ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు అధికంగా పాటించాలి. షేర్‌ వ్యాపారులకు అనుకూలత తక్కువ. విద్యార్థులకు, రైతులకు కూడా ఇబ్బందికరమైన కాలమే. విదేశీ ప్రయత్నాలకు అనుకూలం కాదు.

అక్టోబర్‌: ఉద్యోగ వ్యాపారాలలో కార్యసిద్ధి. రాజకీయవేత్తలు ఉన్నత పదవులు చేపడతారు. ఇప్పటి నుంచి 6 నెలలు పనులలో జాప్యం, తరచు ఆరోగ్య సమస్యలు, ఇతరులతో వివాదాలు ఉంటాయి. కుజ, సుబ్రహ్మణ్య శాంతి చేయాలి. వాహనాలు, పనిముట్ల వాడకంలో జాగ్రత్తలు పాటించాలి. షేర్‌ వ్యాపారులు, విద్యార్థులు, రైతులు ఓర్పుగా వ్యవహరించాల్సిన కాలం.

నవంబర్‌: స్థిరాస్తి, కోర్టు వ్యవహారాలలో చికాకులు. ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఇష్టంలేని బదిలీలు, ప్రయాణాలు వలన శ్రమాధిక్యం, అకాల భోజనం, పనుల్లో జాప్యం జరుగుతాయి. ఋణాలు ఇచ్చి పుచ్చుకునేటప్పుడు దూకుడు తగ్గించడం మంచిది. షేర్‌ వ్యాపారులకు అనుకూలం. విద్యార్థులకు, రైతులకు శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ.

డిసెంబర్‌: పనులన్నీ నత్తనడకన సాగుతాయి. ఎంత శ్రమించినా ఫలితం కనిపించక నిరాశ చెందుతారు. ప్రయాణాల వలన ఇబ్బందులు. ఆర్థిక విషయాలలో జాగ్రత్త. శివ–విష్ణు ఆరాధన శుభప్రదం. పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వైద్య ఖర్చులు పెరుగుతాయి. తెలివి ఉన్నా, ధైర్యం చేయలేక చాలా పనులు ఆపివేస్తారు. షేర్‌ వ్యాపారులకు, విద్యార్థులకు అనుకూలత తక్కువ. 

జనవరి: ఆర్థిక ప్రణాళిక రూపొందిస్తారు. పనుల నిమిత్తం ఎక్కువగా తిరగవలసి రావటం, శ్రమాధిక్యం ఉంటాయి. కార్యజయం ఉన్నది. విష్ణుస్తోత్ర పారాయణ శ్రేయస్కరం. ఆదాయ వ్యయాల సమతుల్యత సాధించలేరు. దైనందిన జీవనం సరిగా సాగదు. షేర్‌ వ్యాపారులకు, ఫైనాన్స్‌ వ్యాపారులకు, విద్యార్థులకు అతి శ్రమ, స్వల్ప ఫలితం ఉంటాయి.

ఫిబ్రవరి: నూతన ఉద్యోగ, వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తిలో విశేష గౌరవం పొందుతారు. స్థిరాస్తి కోర్టు విషయాలు సర్దుకుంటాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. విష్ణు–సుబ్రహ్మణ్య ఆరాధన మంచిది.

పూర్వాషాఢ నక్షత్రం వారికి అన్ని రంగాల్లోనూ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. çఅభివృద్ధి కోసం చేసే ప్రతి పనీ ఇబ్బందికరం అవుతుంది. షేర్‌ వ్యాపారులకు అనుకూలం. విదేశీ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, శుభకార్య ప్రయత్నాలు వేగంగా సాగుతాయి. మార్చి: విశేష వ్యాపారలబ్ధి ఉంటుంది. పనులన్నీ నేర్పుతో పూర్తి చేస్తారు. వ్యాపార నిమిత్త ప్రయాణాలు లాభిస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. కుటుంబంలో ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. నవగ్రహారాధన చేయుట మంచిది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement