కొండరాళ్ల మీద చెక్కిన శిల్పాలు
నేల మీది కైలాసం ఉనకోటి... కోటికి ఒకటి తక్కువ. ఇది లెక్క మాత్రమే కాదు. ఓ ప్రదేశం కూడా. హిమాలయ శ్రేణుల పాదాల చెంత ఉంది. త్రిపుర రాష్ట్రంలో అందమైన పర్యాటక ప్రదేశమిది. త్రిపుర రాష్ట్ర రాజధాని అగర్తల నగరానికి 178 కి.మీ.ల దూరంలో ‘కైలాస్‌హర’ అనే పట్టణానికి దగ్గరగా ఉంది ఉనకోటి. జనారణ్యానికి దూరంగా వెళ్లే కొద్దీ చెట్లు చేమలు నిండిన పచ్చటి కొండలు బారులుతీరి ఉంటాయి. పచ్చదనం లోపించిన కొండరాయిలో అందమైన రూపాలు కనువిందు చేస్తాయి. విఘ్నేశ్వరుడు, ఈశ్వరుడు, దుర్గాదేవి, గంగ, ఇతర కైలాసగణమంతా కొలువుదీరినట్లు ఉంటుంది. ఇంతటి భారీ శిల్పాలను ఎప్పుడు చెక్కారో, ఎవరు చెక్కారో, ఎలా చెక్కారో?
అన్నింటినీ చూడలేం...
ఇక్కడి శివుడి పేరు ఉనకోటేశ్వర కాలభైరవ విగ్రహం 30 అడుగుల ఎత్తు ఉంటుంది. శివుడికి రెండు వైపులా సింహవాహనం మీద దుర్గాదేవి, గంగామాత శిల్పాలుంటాయి. నేలలో కూరుకుపోయిన నంది విగ్రహం, మౌనముద్రలో గణేశుడు, ఇంకా పేరు తెలియన అనేక శిల్పాలు కొన్ని ఎకరాల విస్తీర్ణంలో పరుచుకుని ఉన్నాయి. ప్రధానమైన వాటిని చూడడంతోనే శక్తి తగ్గిపోతుంది. కొన్ని శిల్పాలను సమీప గ్రామాల వాళ్లు ఇళ్లకు పట్టుకుపోగా మిగిలిన వాటి కోసం ఇండియన్ ఆర్కియాలజీ సర్వే నోటిస్ బోర్డు పెట్టింది. ఇంకా విగ్రహాలున్నయోమోనని అడవిని గాలిస్తోంది. ఇది హెరిటేజ్ సైట్. భవిష్యత్తులో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌ల ప్రామాణిక పట్టికలో చేరి తీరుతుంది. ప్రపంచం గుర్తించేలోపే ఉనకోటిని చూసేశామంటే... ‘వరల్ట్ హెరిటేజ్ సైట్’ అనే ట్యాగ్‌లైన్ చేరిన రోజు ‘ఎప్పుడో చూసేశాం’ అని మన భుజాన్ని మనమే చరుచుకోవచ్చు.
ఎవరు చెక్కారంటే...
‘కల్లు కుమ్‌హార్’ అనే గిరిజన శిల్పకారుడు ఈ శిల్పాలను చెక్కినట్లు స్థానికులు చెబుతారు. అతడు పార్వతి భక్తుడని, కైలాసాన్ని కళ్లకు కట్టడానికే ఈ శిల్పాలను చెక్కాడని చెబుతారు. క్రీ.శ 16వ శతాబ్దంలో కాలాపహాడ్ అనే మొఘలు గవర్నర్ భువనేశ్వర్‌లోని శివుడిని, ఉనకోటికి సమీపంలో ఉన్న తుంగేశ్వర శివుడిని ధ్వంసం చేసినట్లు చరిత్ర చెబుతోంది. ఈ ప్రదేశం మీద దాడిచేయడానికి అతడు చేసిన ప్రయత్నం కుదరక వదిలేసినట్లు చెబుతారు. ఇక్కడ ఏటా ఏప్రిల్ మాసంలో జరిగే ‘అశోకాష్టమి మేళా’లో వేలాదిగా భక్తులు పాల్గొంటారు. సమీప విమానాశ్రయం అగర్తలలో ఉంది. రైల్వేస్టేషన్ కుమార్‌ఘాట్‌లో ఉంది. కుమార్‌ఘాట్‌కు ఉనకోటి 20 కి.మీ.ల దూరాన ఉంది.
జనపథ కథనం
ఒకానొకప్పుడు శివుడితోపాటు కోటిమంది కైలాసగణం కాశీయాత్రకు బయలుదేరింది. ఆ ప్రయాణంలో ఈ ప్రదేశానికి వచ్చేసరికి సంజెచీకట్లు అలముకున్నాయి. ప్రయాణం కష్టమైంది. దాంతో ఆ రాత్రికి ఈ అడవిలోనే విశ్రమించారంతా. తెల్లవారక ముందే నిద్రలేచి ఈ ప్రదేశాన్ని విడిచిపెట్టాలని, ఆలస్యమైతే రాళ్లలా మారిపోతారని, నిద్రకుపక్రమించే ముందు శివుడు అందరినీ హెచ్చరిస్తాడు. చెప్పిన సమయానికి శివుడు తప్ప మరెవరూ నిద్రలేవలేకపోవడంతో మిగిలిన వారంతా శిలలుగా మారిపోయారు. కోటి మంది బృందంలో శివుడు మినహా మిగిలిన వారంతా శిలలు కావడంతో ఈ ప్రదేశానికి ‘ఉనకోటి’ అనే పేరు వాడుకలోకి వచ్చింది– అని స్థానికులు ఆసక్తికరమైన కథనం చెబుతారు. ఆ కథనం ప్రకారమైతే అక్కడ శివుడి శిల్పం ఉండకూడదు, కానీ ఇక్కడ శివుడి శిల్పం కూడా ఉంటుంది. పైగా దేశంలోకే అత్యంత పెద్ద శివుడి శిల్పం ఇదేనని కూడా చెబుతారు. వాస్తవాల అన్వేషణకు పోకుండా ఆ శిల్పాల నైపుణ్యాన్ని ఆస్వాదిస్తే ఈ టూర్ మధురానుభూతిగా మిగులుతుంది.
Comments
Please login to add a commentAdd a comment