
ఆరుబయట విహారయాత్రలకు వెళ్లేటప్పుడు వెంట తీసుకుపోవడానికి వీలుగా పోర్టబుల్ పవర్ స్టేషన్లు రకరకాలకు చెందినవి ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. వాతావరణం పొడిగా ఉన్నప్పుడు వీటితో ఇబ్బందేమీ ఉండదు గాని, అకస్మాత్తుగా వాన కురిసి, వాన నీటి వల్ల వీటి లోపలి భాగాలు తడిస్తే మాత్రం ప్రమాదాలు తలెత్తే అవకాశాలు లేకపోలేదు. నీరు పడినా ఎలాంటి ప్రమాదం లేకుండా ఉండేలా ఆస్ట్రేలియన్ కంపెనీ ‘ఆర్క్‌ప్యాక్’ ప్రపంచంలోనే మొట్టమొదటి వాటర్‌ప్రూఫ్ పోర్టబుల్ పవర్‌స్టేషన్‌ను ‘ఆర్క్ ఐపీ67’ బ్రాండ్ పేరుతో అందుబాటులోకి తెచ్చింది.
ఇది 1500 డబ్ల్యూహెచ్ సామర్థ్యంతో పనిచేస్తుంది. ఏకకాలంలో పదకొండు ఎలక్ట్రానిక్ పరికరాలను దీని ద్వారా చార్జింగ్ చేసుకోవడానికి తగిన వెసులుబాటు ఉండటం విశేషం. ఆరుబయట విహారయాత్రలకు వెళ్లేటప్పుడు, బోటు షికార్లకు వెళ్లేటప్పుడు వెంట తీసుకుపోయి, ఎక్కడ కావాలనుకున్నా ఉపయోగించుకోవడానికి అనువుగా దీనిని తీర్చిదిద్దారు. దీని ధర 1,999 డాలర్లు (రూ.1.66 లక్షలు).