కరెంటు వద్దు...గ్యాస్ చాలు
కరెంటు వద్దు...గ్యాస్ చాలు
Published Sun, Nov 22 2015 2:27 AM | Last Updated on Sun, Sep 3 2017 12:49 PM
బట్టలు ఇస్త్రీ చేసే పని సగంలో ఉండగా కరెంటు పోతే ఆ ఇబ్బంది వర్ణనాతీతం. కరెంటు వచ్చేవరకూ చూస్తూ కూర్చోవాలి. ఎంతకీ రాకపోతే నలిగిన దుస్తులు వేసు కునే ఆఫీసుకు వెళ్లాలి. అంటే మన ఇస్త్రీ కరెంటు మీద ఆధారపడి ఉంది. ఇక రజకులు అయితే ఇప్పటికీ బొగ్గులతో పనిచేసే ఇస్త్రీపెట్టెలనే నమ్ముకుంటున్నారు. ఇటీవలి కాలంలో బొగ్గులు కూడా తేలిగ్గా దొరకడం లేదు. పైగా బొగ్గులతో పనిచేసే ఇస్త్రీపెట్టెలు చాలా బరువుగా ఉండి జబ్బలు లాగేస్తుంటాయి. బొగ్గుల నుంచి రేగే బూడిద మరో సమస్య.
ఈ సమస్యలన్నింటికీ ఓ చక్కని పరిష్కారం కనుగొన్నారు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కె.లింగబ్రహ్మం. కరెంటు, బొగ్గులు కాకుండా... గ్యాస్‌తో పనిచేసే ఇస్త్రీపెట్టెకు రూపకల్పన చేశారాయన. ఇస్త్రీపెట్టెకు చిన్న గ్యాస్ సిలిండర్‌ను అనుసంధానించి, ఓ రెగ్యులేటర్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఇస్త్రీపెట్టె ఇళ్లలో వాడుకోవడానికే కాదు... రజకులకు, దర్జీలకు కూడా చాలా అనుకూలంగా ఉంటుందని ఆయన చెబుతున్నారు. అరకిలో గ్యాస్‌తో ఇది నిరాటంకంగా ఎనిమిది గంటల పాటు పనిచేస్తుందట. అంటే దీని వల్ల ఖర్చు కూడా బాగా తగ్గుతుందన్న మాట!
లింగబ్రహ్మం రూపొందించిన ఈ ఇస్త్రీపెట్టె ఇప్పటికే పలువురి దృష్టిని ఆకర్షించింది. తక్కువ శ్రమ, తక్కువ ఖర్చుతో పని చేస్తుంది కాబట్టి దీన్ని ద బెస్ట్‌గా పేర్కొంటున్నారంతా. గుజరాత్‌లోని నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ అయితే ఉత్తమ ఆవిష్కరణగా ఓ అవార్డును కూడా ఇచ్చింది. ఈ ఇస్త్రీ పెట్టె త్వరగా మార్కెట్లోకి వచ్చేస్తే కరెంటు కోతలు మన ఇస్త్రీని ఇక ఆపలేవు!
Advertisement