‘సిలికాన్ వ్యాలీ ట్రెండ్’గా పేరున్న ‘డోపమైన్ ఫాస్టింగ్’ సాంకేతిక నిపుణులకే పరిమితం కాలేదు. యువతరానికి దగ్గర అవుతోంది. డిజిటల్ ప్రపంచంలో హద్దులు దాటుతున్న ‘ప్లెజర్ కెమికల్’కు నియంత్రణ విధించడానికి ‘డోపమైన్ ఫాస్టింగ్’ అనేది ఒక మార్గం అయింది...
చెన్నైకి చెందిన ఇరవై రెండు సంవత్సరాల రుచిత తన ఫ్రెండ్ ద్వారా ‘డోపమైన్ ఫాస్టింగ్’ అనే మాట విన్నది. ‘ఒకసారి ట్రై చేసి చూద్దాం’ అనుకుంటూ రంగంలోకి దిగింది. తల్లిదండ్రులకు చెప్పి మారుమూల ప్రాంతంలోని చుట్టాల ఇంటికి వెళ్లింది. ఆ పల్లెలో ఉరుకులు పరుగులు కనిపించవు. రణగొణ ధ్వనులు వినిపించవు. పిట్టపాటను దగ్గరగా వినే అదృష్టం దక్కుతుంది.సెల్‌ఫోన్‌కు సెలవు ఇచ్చి ఆ వారం రోజులు ఒక చెట్టు కింద కూర్చొని నచ్చిన పుస్తకాలు చదువుకుంది.పట్నాకు చెందిన తేజశ్రీకి నాన్‌స్టాప్‌గా మాట్లాడే అలవాటు ఉంది. రానూ రానూ ఆమె అంటే స్నేహితుల్లో తెలియని భయం లాంటిది ఏర్పడింది. పక్కకు తప్పుకోవడం మొదలైంది. ఇది గమనించిన తేజశ్రీ ఆలోచనల్లో పడినప్పుడు ఆమెకు కనిపించిన దారి... డోపమైన్ ఫాస్టింగ్.
ఫాస్టింగ్‌లో భాగంగా ఒక వారం రోజుల పాటు అవసరమైతే తప్ప ఒక్కమాట కూడా ఎక్కువ మాట్లాడలేదు తేజశ్రీ!. ఫాస్టింగ్ తరువాత ఆ ఇద్దరి నోటినుంచి వచ్చిన మాట...‘ఇంత అద్భుతమైన ఫలితాన్ని ఊహించలేదు’ఈ ఇద్దరు మాత్రమే కాదు దేశవ్యాప్తంగా యువతరంలో ఎంతోమంది జపిస్తున్న మంత్రం... డోపమైన్ ఫాస్టింగ్. ‘డోపమైన్ ఫాస్టింగ్’ సిలికాన్ వ్యాలీలో మారుమోగిన ట్రెండ్. సాంకేతిక నిపుణులను బాగా ఆకట్టుకుంది.‘దీనికి ఎలాంటి శాస్త్రీయ పద్దతి పదికా లేదు’ అనే మాట ‘డోపమైన్ ఫాస్టింగ్’ పాపులారిటీని యూత్‌లో తగ్గించలేకపోతోంది. టీవీ షోలు, యూట్యూబ్ వీడియోలు, పాడ్‌కాస్ట్, మ్యూజిక్ షోలు... డిజిటల్ ప్రపంచంలో వివిధ మార్గాల ద్వారా మెదడులో డోపమైన్ విడుదల అవుతుంది. డిజిటల్ కంటెంట్ నుంచి డివైజ్‌లకు అతిగా అలవాటు పడడం వరకు ప్లెజర్ కెమికల్ అనబడే ‘డోపమైన్’ హద్దులు దాటితే అది దురలవాటుగా మారి సమస్యల్లోకి తీసుకువెళుతుంది.
అధిక నిద్ర, అధిక తిండి నుంచి అదే పనిగా సోషల్ మీడియాలో తలదూర్చేవరకు... ఎన్నెన్నో అలవాట్లు డోపమైన్ ప్రతిఫలనాలే. అమెరికన్ సైకియాట్రిస్ట్ అన్నా లెంబ్కే‘డోపమైన్ నేషన్’ పేరుతో పుస్తకం రాసింది. ఆ పుస్తకంలో ఆమె రాసిన ఒక మాట...‘మన చుట్టూ ఉన్న ప్రపంచంలో అవసరమైన దానికంటే ఎక్కువ సౌకర్యాలు ఉన్నాయి. దీంతో ఒత్తిడి పెరుగుతోంది. సౌకర్యాలు, వస్తువులు పెరిగేకొద్దీ సంతోషం కూడా తగ్గుతుంది’‘డోపమైన్ ఫాస్టింగ్ అంటే తిండికి దూరం కావడం కాదు. ఎవరితో మాట్లాడకపోవడం కాదు. మెదడులో డోపమైన్ విడుదలయ్యేందుకు కారణమయ్యే వాటికి విరామం ఇవ్వడం’ అంటున్నారు నిపుణులు.
‘డోపమైన్ ఫాస్టింగ్’ లక్ష్యం డోపమైన్‌కు దూరం చేయడం కాదు. డోప్‌మైన్ లోపం వల్ల ఏ సంతోషం లేకుండా జీవితం నిస్సారంగా అనిపించడం, డిప్రెషన్‌లో కూరుకుపోవడం, చెడు అలవాట్లకు బానిస కావడంలాంటివి కూడా జరిగే ప్రమాదం ఉంది. అందుకే డిజిటల్ ఫాస్టింగ్ అనేది ‘డోపమైన్’ మరీ ఎక్కువ కాకుండా, మరీ తక్కువ కాకుండా సమన్వయ ధోరణిలో వెళుతుంది. అందుకే ‘డోపమైన్ ఫాస్టింగ్’ మోస్ట్ వవర్‌ఫుల్ బ్రేక్‌గా పేరు తెచ్చుకుంది.‘సంతోషకరమైన విషయం ఏమిటంటే యువతరం డోపమైన్ డిటాక్స్‌పై దృష్టి పెడుతోంది. డోపమైన్ ఫాస్టింగ్ వల్ల వచ్చిన విరామం ద్వారా తమ మానసిక ఆరోగ్యంపై టెక్నాలజీ చూపే ప్రతికూల ప్రభావాన్ని గురించి తెలుసుకోగలుగుతున్నారు’ అంటుంది అన్నా లెంబ్కే.
ఇంటర్‌మిటెంట్ ఫాస్టింగ్
బాలీవుడ్‌కు సంబంధించి సోషల్‌మీడియాలో బాగా పాపులర్ అయిన ట్రెండ్.. ఇంటర్‌మిటెంట్ ఫాస్టింగ్. ఇంటర్‌మిటెంట్ ఫాస్టింగ్‌లో భాగంగా 16 గంటల ఫాస్టింగ్ రూల్‌ని అనుసరిస్తూ ఆలియాభట్ బరువు తగ్గింది. వెజిటేరియన్‌గా మారింది. వ్యాయామాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చే జాక్వీలైన్ ఫెర్నాండేజ్ ఇంటిర్‌మిటెంట్ ఫాస్టింగ్‌కు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తుంది. కమెడియన్ భారతిసింగ్ లాక్‌డౌన్ సమయంలో ఇంటర్‌మిటెంట్ ఫాస్టింగ్‌ను అనుసరించి పదిహేను కిలోల బరువు తగ్గింది. హీరో వరుణ్ ధావన్ రోజుకు 14-16గంటల ఇంటర్‌మిటెంట్ ఫాస్టింగ్‌ను అనుసరిస్తాడు.
Comments
Please login to add a commentAdd a comment