అత్తాకోడళ్లకు పడదు. వదినామరదళ్లూ ఎడమొహం పెడమొహమే. తోడికోడళ్లదీ స్నేహమూ రంగేసుకున్న వైరమే. ఇరుగుపొరుగు ఆడవాళ్ల మధ్యా అసూయను పెంచే పోటీయే. ఆఫీసుల్లోనూ నటనా చెలిమిలే.
అదేమంటే స్త్రీకి స్త్రీయే శత్రువు.. అనే నానుడి వినిపిస్తారు. టాక్సిక్ ఫెమినినిటీ అనే పేరూ ఖాయం చేసేస్తారు. ఎవరు? పురుషులు. ఎందుకు? మగవాళ్ల ఆలోచనల్లోని టాక్సిన్స్‌ను బయటపెట్టినందుకు.. టాక్సిక్ మాస్క్యులినిటి అంటూ వేదనచెందినందుకు. నిజానికి స్త్రీని స్త్రీకి శత్రువుగా చేసిందే మాస్క్యులినిటీలోని ఆ టాక్సిన్సే.
కొత్తగా వచ్చిన కోడలిని చూపిస్తూ అత్తకు అభద్రత సృష్టించడం, వదినకు వచ్చిన అధికారంతో మరదలిలో అటెన్షన్ సీకింగ్‌ను ప్రేరేపించడం, భర్త సంపాదన, పుట్టింటి కట్నకానుకలతో తోడికోడళ్ల మధ్య విభేదాలను పుట్టించడం, పొరిగింటి పుల్లకూరకు చవులూరిస్తూ ఇల్లాలిని పోటీకి రెచ్చగొట్టడం, ఉద్యోగినుల మధ్య పక్షపాతాన్ని అవలంభిస్తూ విరోధాన్ని నాటడం.. ఇవన్నీ పురుషాధిపత్య ప్రణాళికలే. ఆ మెదడు స్థిరం చేసిన అభిప్రాయాలే.
ఈ నిజం గ్రహింపులోకి వచ్చింది. స్త్రీ, పురుష సమానత్వాన్ని కాంక్షించే వారు ముందు స్త్రీలలో ఐక్యత రావాలని కోరుకున్నారు. అందుకే ‘సిస్టర్‌హుడ్’ కామనకు ఉనికి కల్పించారు. కార్యాచరణతో సుస్థిరం చేసే ప్రయత్నంలో పడ్డారు. దాన్నీ పురుషాధిపత్యం అడ్డుకోకుండా ఉండడానికి ఓ ఉద్యమంలా ముందుకు తీసుకెళ్తున్నారు. ఆ కదలికలో సినిమా, సాహిత్యాలూ పాలుపంచుకుంటున్నాయి. కలం, కెమెరాలు సిస్టర్‌హుడ్‌ను ప్రమోట్ చేస్తున్నాయి.
ఇది కథ కాదు...
అంటూ జీవితంలో అత్తాకోడళ్లు ఇలా ఉంటే బాగుంటుంది అని చూపించాడు దర్శకుడు కె.బాలచందర్ 1970ల్లోనే. శాడిస్ట్ భర్తతో వేగుతున్న భార్యకు అండగా నిలుస్తుంది అత్త. మనిషితనం లేని ఆ కొడుకు నుంచి కోడలిని విముక్తి చేయాలనుకుంటుంది. ముళ్ల బంధనంగా ఉన్న ఆ పెళ్లి బంధనాన్ని తెంచుకోమని.. కొత్త జీవితం ప్రారంభించమని చెప్తుంది. స్త్రీ మనసు స్త్రీకి కాక ఇంకెవరికి తెలుస్తుంది అనిపిస్తుంది ‘ఇది కథ కాదు’ చూస్తే!
న్యాయం కావాలి..
అంటూ కోర్టుకు వెళ్లిన వనితకు న్యాయ పోరాటంలో సహాయం చేసింది ఇంకో మహిళే. 1981లో వచ్చిన ఈ సినిమాలో పెళ్లి చేసుకుంటానని మోసం చేస్తాడు ఓ పురుషాంహకారి. పెళ్లి కాకుండానే గర్భవతి అయిన ఆ బిడ్డను పరువు కోసం బయటకు పంపిస్తారు తల్లిదండ్రులు. అప్పుడు అక్కున చేర్చుకుంటుంది ఓ లాయర్. ఆమె తరపున కోర్టులో వాదిస్తుంది. ఆడవాళ్లకున్న ఆడవాళ్ల మద్దతును గెలిపిస్తుంది.
దృష్టి..
సారించింది హిందీ సినిమా కూడా 1990ల్లో. భర్త వివాహేతర సంబంధంతో ఇంకో మహిళ తమ సంసారాన్ని విచ్ఛిన్నం చేస్తే ఆ రెండో మహిళను శాపనార్థాలు పెట్టదు ఇంటి ఇల్లాలు. భర్త వ్యక్తిత్వాన్ని తప్పు పడుతుంది. తన జీవితంలోంచి ఆ బలహీనుడు తప్పుకున్నా తను బలంగానే నిలబడుతుంది. సాటి స్త్రీ పట్ల సానుభూతే ప్రదర్శిస్తుంది.
సెక్షన్ 375..
2019లో వచ్చిన హిందీ సినిమా. చలనచిత్ర పరిశ్రమలోని కాస్టింగ్ కౌచ్ మీద ఎక్కుపెట్టిన బాణం. ఇందులోనూ బాధితురాలికి చేయూతనిచ్చిన న్యాయవాది మహిళే. ఒకరకంగా ఇది పరస్పర అంగీకార ఇచ్ఛ, రేప్‌కి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని, ఏది రేప్ అన్న నిర్ధారణను చర్చకు పెట్టిన సినిమా. మహిళల గౌరవమర్యాదలకు భంగం వాటిల్లే పరిస్థితులను మహిళలంతా ఏకమై ఎదుర్కోవాలని సూచించిన సినిమా.
ఈ నాలుగు నమూనాలు మాత్రమే. ఇలాంటి ఇంకెన్నో దృశ్యాలు థియేటర్‌లో విడుదలయ్యాయి.. సిస్టర్‌హుడ్ మీద అవగాహన కల్పించేందుకు. ఓల్గా నుంచి తోట అపర్ణ దాకా చైతన్యవంతులైన రచయిత్రులెందరో సిస్టర్‌హుడ్ ఇతివృత్తంగా కథలు, నవలలు రాశారు.. రాస్తున్నారు. ఇందులో సోషల్ మీడియా పాత్రా ప్రధానమైనదే. 1967, అమెరికాలో సివిల్‌రైట్స్ మూవ్‌మెంట్స్ సమయంలో వైట్ ఫెమినిస్ట్‌లు తమకున్న ప్రత్యేక హక్కులకు అతీతంగా బాధితుల పక్షాన నిలబడాలని బ్లాక్ ఫెమినిస్ట్‌లు డిమాండ్ చేసినప్పుడు ఈ ‘సిస్టర్ హుడ్’ అనే పదం ప్రచారంలోకి వచ్చింది.
ఆ స్ఫూర్తి ఇప్పటి సామాజిక మాధ్యమాల్లోనూ కనపడుతోంది. పాశ్యాత్య దేశాల్లోని స్త్రీవాదంలో రంగు విభజనరేఖను గీస్తే మన దగ్గర కులం, మతం ఆ వ్యత్యాసానికి కాపలాకాస్తున్నాయి. ఆ కంచెను తొలగించడంలో సోషల్ మీడియా చాలా చురుగ్గా పనిచేస్తోంది. హథ్రాస్ సంఘటనే తాజా ఉదాహరణ. కుల,మతాలకతీతంగా మహిళలు బాధితురాలి కుటుంబానికి అండగా నిలబడ్డారు. అగ్రకుల, పురుషాహంకారాన్ని నిరసించారు. సిస్టర్‌హుడ్‌ను చాటారు. సిస్టర్‌హుడ్ అంటే మహిళలందరూ ఒకేరకమైన ఆలోచనలు, విశ్వాసాలతో ఉండడం కాదు, పురుషాధిపత్యభావజాలంతో సమస్యలెదుర్కొంటున్న స్త్రీలకు మద్దతుగా నిలబడ్డమే. వాళ్లు ఏ విశ్వాసాలను అవలంబిస్తున్నా.. ఏ సామాజిక వర్గంలో ఉన్నా సరే. ఏ లేబుల్ వేయకుండా ఆ భిన్నత్వాన్ని గౌరవిస్తూ ఆలంబనగా ఉండడమే.
-శరాది
Comments
Please login to add a commentAdd a comment