నైపుణ్యం గురించి ఎంత చెప్పుకుంటే అంత పుణ్యం! కొన్ని మంచి ముత్యాలు: ‘నీలోని నైపుణ్యాన్ని మెరుగుపెట్టడానికి మంచి మార్గం ఏమిటో తెలుసా? దాన్ని ఉపయోగించడమే’.. ‘శక్తి కంటే నైపుణ్యం గొప్పది’..
‘నీలోని నైపుణ్యానికి సాన పడితే, ... అది ప్రతిభతో చెలిమి చేస్తుంది’.. ఈ సంవత్సరం వరల్డ్ యూత్ స్కిల్స్ డే థీమ్: ట్రాన్స్‌ఫార్మింగ్ యూత్ స్కిల్స్ ఫర్ ది ఫ్యూచర్
బెమ్యాక్స్.. మంచి ఆవిష్కరణ
తమ అద్భుతమైన ప్రతిభాపాటవాలతో చిన్న వయసులోనే అద్భుత భవిష్యత్ నిర్మాణానికి బాటలు వేసున్న వారిలో నీల్ దేశ్‌ముఖ్ ఒకరు. తల్లిదండ్రులతో పాటు పెన్సిల్వేనియా(యూఎస్)లో ఉండే నీల్ దేశ్‌ముఖ్ ఇండియాలోని నానమ్మ వాళ్ల ఇంటికి వచ్చాడు. అదొక గ్రామం.
బామ్మతో మాట్లాడుతున్న క్రమంలో ఆమె చూపు మందగించడాన్ని గమనించాడు. సరదాగా పొలాల వెంట తిరుగుతున్న సమయంలో పంట తెగుళ్ల వల్ల రైతులు ఎదుర్కొంటున్న రకరకాల సమస్యల గురించి తెలుసుకోగలిగాడు. అమెరికాకు తిరిగి వచ్చిన తరువాత రెండు సమస్యలు అతడి ఆలోచనల్లో నిండిపోయాయి. ఒకటి...బామ్మ కంటి చూపు, రెండు...రైతు సమస్య.
ఎప్పుడూ ఏదో ఆలోచించడం అంటే దేశ్‌ముఖ్‌కు ఇష్టం. లేదా అలవాటు. ఇప్పుడు ఆ అలవాటు రెండు ఆవిష్కరణలకు కారణం అయింది. తనకు ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సామర్థ్యంతో రైతులకు ఉపయోగపడే ‘ప్లాన్‌ంటమ్ ఏఐ’ యాప్, అంధులు, చూపు మందగించిన వారికి ఉపయోగపడే ‘వోకల్ ఏఐ’ యాప్‌లను రూపొందించాడు.
తక్కువ ఖర్చుతో కూడిన పర్సనల్ హెల్త్‌కేర్ అసిస్టెంట్ ‘బెమ్యాక్స్’ మరో మంచి ఆవిష్కరణ. ఇరవై ఏళ్లు కూడా నిండని దేశ్‌ముఖ్‌కు ప్రపంచం నలుమూలల నుంచి ప్రశంసలు లభించాయి. ఎన్నో ప్రసిద్ధ పురస్కారాలు వరించాయి.
‘ప్లాన్‌ంటమ్ ఏఐ’ అనే కంపెనీ స్థాపించి రైతులకు మార్గదర్శనం చేసే మంచిపనికి శ్రీకారం చుట్టాడు దేశ్‌ముఖ్. ఏ.ఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) అంటే దేశ్‌ముఖ్‌కు చెప్పలేనంత ఇష్టం.
కాని యూత్‌లో చాలామందికి అదంటే అయోమయం, భయం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ‘ఏ.ఐ’పై భయాలను పోగొట్టడానికి క్లాసులు, వర్క్‌షాప్‌లను నిర్వహించాడు. చాలా చిన్న వయసులోనే ‘ఇ–డిజైన్’ కంపెనీకి సీయివోగా చరిత్ర సృష్టించిన శ్రీలక్ష్మీ సురేష్ (కేరళ) ఎన్నో సంస్థలకు వందకు పైగా వెబ్‌సైట్లను క్రియేట్ చేసింది.
ఒజాస్ బాత్రా కథ వేరు
పదవతరగతి మానేసిన తరువాత ‘చదవడం ఇక నా వల్ల కాదు బాబోయ్’ అని చేతులెత్తేశాడు దిల్లీకి చెందిన ఒజాస్ బాత్రా. ‘కుదరదుగాకా కుదరదు’ అని తల్లిదండ్రులు శాసించలేదు. ఎందుకంటే అతడి ‘స్కిల్స్’ ఏమిటో వారికి తెలుసు. త్రీడి డిజైన్, విఎఫ్‌ఎక్స్‌లో అతడి నైపుణ్యం పదహారు సంవత్సరాల వయసులోనే ‘హైవ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్’కు ఫౌండర్, సీయివోను చేశాయి.
......యువ ప్రతిభావంతుల జాబితాలో వీరు కొందరు మాత్రమే. అయితే వీరెవరికీ అల్లావుద్దీన్ అద్భుతదీపాలు దొరకలేదు. ఆలోచనే వారి బలం, ఇంధనం. తమలోని నైపుణ్యంపై దృష్టి పెట్టారు. పదును పెట్టారు. ప్రయోగాలతో ఫలితాలు సాధించారు. బంగారు భవిష్యత్‌కు బాటలు వేస్తున్నారు. ‘వరల్డ్ యూత్ స్కిల్స్ డే’ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేద్దాం.
Comments
Please login to add a commentAdd a comment