వార ఫలాలు (సెప్టెంబర్‌ 6  నుంచి 12 వరకు) | Weekly Horoscope From September 6th To 12th 2020 | Sakshi
Sakshi News home page

వార ఫలాలు (సెప్టెంబర్‌ 6  నుంచి 12 వరకు)

Published Sun, Sep 6 2020 7:47 AM | Last Updated on Sun, Sep 6 2020 7:47 AM

Weekly Horoscope From September 6th To 12th 2020 - Sakshi

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
కొత్త ప్రణాళికలతో ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. అనుకున్న పనులు పూర్యయ్యే వరకూ విశ్రమించరు. ఆర్థిక పరిస్థితి మరింత సానుకూలమవుతుంది. చిన్ననాటి మిత్రుల నుంచి అందిన సందేశం సంతోషం కలిగిస్తుంది. స్థిరాస్తి కొనుగోలులో తుది  ఒప్పందాలు చేసుకుంటారు. నిరుద్యోగులకు కొంత అనుకూలమైన కాలమనే చెప్పాలి. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహం, ఉత్సాహం. పారిశ్రామికవర్గాల శ్రమ వృథా కాదు. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో సమస్యలు. ఆకుపచ్చ, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
కొత్త పనులకు శ్రీకారం చుడతారు. మీ ఆలోచనలు కుటుంబసభ్యులతో పంచుకుంటారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక రుణాలు తీరతాయి. ఒక సమాచారం ఎంతో సంతోషం కలిగిస్తుంది. స్వల్ప అనారోగ్యం కలిగినా ఉపశమనం లభిస్తుంది. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం. అయితే, నిర్ణయాలలో కొంత నిదానం అవసరం. వ్యాపారాలు మరింత లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు సంభవం. కళారంగం వారికి సుదీర్ఘ నిరీక్షణ ఫలిస్తుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. శ్రమాధిక్యం. నీలం, పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ చాలీసా పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
పొరపాట్లు సరిదిద్దుకుని కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. మరపురాని సంఘటన ఎదురవుతుంది. ఆర్థికంగా ఇబ్బందులు తొలగుతాయి. రుణాలు తీరే సమయం. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. కాంట్రాక్టర్లకు శుభవార్తలు. ప్రత్యర్థుల నుంచి సానుకూల సందేశాలు అందుతాయి. ఆస్తి విషయంలో నెలకొన్న వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగి లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో కొన్ని సమస్యలు తీరే సూచనలు. రాజకీయవర్గాలకు సంతోషకరమైన సమాచారం. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్యం మందగిస్తుంది. దైవదర్శనాలు. పసుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. కాలభైరవాష్టకం పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
వీరికి అన్ని విధాలా సానుకూల కాలమే. ఏ పని చేపట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే ఆశాజనకంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభాలు ఉండవచ్చు. నూతన ఉద్యోగావకాశాలు ఉత్సాహాన్నిస్తాయి. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. వాహనాలు, భూములు కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు  మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో మీకు ఎదురుండదు. కళారంగం వారి ఆశలు నెరవేరతాయి. వారం మధ్యలో ధనవ్యయం. అనారోగ్యం. ఆలయ దర్శనాలు. ఎరుపు, తెలుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. అందరిలోనూ విశేష గౌరవం లభిస్తుంది. మధ్యలో కొంత ఆరోగ్యం ఇబ్బంది కలిగించినా ఉపశమనం పొందుతారు. ఆస్తులు విషయంలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఇంటి నిర్మాణాలు, కొనుగోలు యత్నాలలో కొంత పురోగతి కనిపిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. వారం ప్రారంభంలో బంధువిరోధాలు. మానసిక అశాంతి. ఎరుపు, గులాబి రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ప్రారంభంలో సమస్యలతో సహవాసం చేస్తారు. అలాగే, కొన్ని నిర్ణయాలపై వ్యతిరేకత వ్యక్తం కావచ్చు. అయితే క్రమేపీ వీటిని అధిగమించి ముందుకు సాగుతారు. పనులు చకచకా పూర్తి చేయడంలో మిత్రుల చేయూత పొందుతారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారదశకు చేరుకుంటాయి. ఆలయాలు సందర్శిస్తారు. వాహనయోగం. కుటుంబసభ్యులను సంప్రదించకుండా వ్యవహారాలలో ముందడుగు వేయరు. ఉద్యోగయత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపారాలలో లాభాలు ఊరటనిస్తాయి. ఉద్యోగాలలో పొరపాట్లు సరిదిద్దుకుంటారు. రాజకీయవర్గాలకు ముఖ్య సమాచారం అందుతుంది. వారం ప్రారంభంలో ఆరోగ్యసమస్యలు. సోదరులతో కలహాలు. ఆకుపచ్చ, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి రుణబాధలు తొలగుతాయి. మీ ప్రతిపాదనలు కుటుంబంలో ఆమోదిస్తారు. కాంట్రాక్టర్లకు ఊరటనిచ్చే ప్రకటన రావచ్చు. మిత్రుల చేయూతతో పనులు చక్కదిద్దుతారు. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు వృద్ధిబాటలో నడుస్తాయి. ఉద్యోగాలలో ఒడుదుడుకులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు మరింత అనుకూలమైన కాలమనే చెప్పాలి. వారం మధ్యలో దుబారా వ్యయం. ఇంటా బయటా ఒత్తిడులు. నీలం, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
సంఘంలో పేరుప్రతిష్ఠలు పొందుతారు. ఏ పని చేపట్టినా సకాలంలో పూర్తి చేసేవరకూ విశ్రమించరు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఆస్తుల విషయంలో సోదరులతో అంగీకారానికి వస్తారు. ఇంటి నిర్మాణాలపై కొత్త ప్రతిపాదనలు చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. అయితే మధ్యలో కొంత రుణాలు చేస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాలకు సంతోషకరమైన సమాచారం. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. ఎరుపు, పసుపు ర ంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
పరిస్థితులు అనుకూలిస్తాయి. అందరిలోనూ మీ సత్తా, ప్రతిభ చాటుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితిలో గందరగోళం తొలగుతుంది. రావలసిన సొమ్ము అందుతుంది. వాహనాలు, భూములు కొంటారు. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుతాయి. వివాహాది వేడుకలపై తుది నిర్ణయాలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు క్రమేపీ లాభిస్తాయి. ఉద్యోగాలలో మీ సమర్థత వెలుగులోకి వస్తుంది. రాజకీయవర్గాల యత్నాలు సానుకూలమవుతాయి. వారం ప్రారంభంలో అనుకోని ధనవ్యయం. ఆరోగ్యభంగం. గులాబీ, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
కొత్త కార్యక్రమాలు చేపడతారు. మీ ఆలోచనలు కుటుంబసభ్యులతో పంచుకుంటారు. ఆర్థిక పరిస్థితి మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. రుణబాధలు తొలగుతాయి. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలలో బంధువుల సలహాలు పొందుతారు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. సంఘంలో పేరుప్రతిష్ఠలు పొందుతారు. శుభకార్యాలకు ప్రణాళికలు సిద్ధం చేస్తారు. కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు ఎదురుకావచ్చు. వ్యాపారాలు విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో చిక్కుల నుంచి బయటపడతారు. రాజకీయవర్గాలకు ఆకస్మిక పిలుపు రావచ్చు. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. నేరేడు, ఆకుపచ్చ రంగులు. పశ్చిమది ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు కొన్ని పరిష్కరించుకుంటారు. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. సేవాకార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఇంటి నిర్మాణాలపై కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. స్థిరాస్తి ఒప్పందాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో పురోగతి ఉంటుంది. కొన్ని వివాదాలు తీరతాయి. పారిశ్రామికవర్గాలకు ఒడిదుడుకులు తొలగుతాయి. వారం మధ్యలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. గులాబి, నీలం రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివస్తోత్రాలు పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ముఖ్యమైన పనులు కొంత నెమ్మదిస్తాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబసభ్యులతో అకారణంగా విభేదాలు నెలకొనవచ్చు. కష్టానికి తగిన ఫలితం కనిపించదు. ఆస్తుల కొనుగోలులో ఆటంకాలు చికాకు పరుస్తాయి. ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగించవచ్చు, జాగ్రత్త అవసరం. మిత్రుల నుంచి కొంతమేర ఒత్తిడులు ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటుంది. రుణయత్నాలు సాగిస్తారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు మీదపడవచ్చు. కళారంగం వారికి ఆశలు అంతగా ఫలించవు. వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. గులాబీ, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారా స్తోత్రాలు పఠించండి.
- సింహంభట్ల సుబ్బారావు
జ్యోతిష్య పండితులు 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement