ప్రపంచ దేశాలతో సుస్థిర అభివృద్ధి గమనంలో పోటీ పడుతున్న భారతదేశం స్వాతంత్య్ర శతాబ్ది 2047 నాటికి అగ్రస్థానంలో నిలవాలని పరితపిస్తోంది. అధిక ఆదాయ స్థితిసాధనకు రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి శక్తిమంతంగా పని చేస్తోంది. ఒకవైపు కేంద్రం, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాలు పేదరిక నిర్మూలనలో మునిగిపోయాయి. ఈక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువయింది.
2022–23 ఆర్థిక సంవత్సరంలో నీతి ఆయోగ్ వెల్లడించిన జాతీయ బహుముఖ పేదరిక సూచిక (ఎంపీఐ)తాజా నివేదిక ప్రకారం, రాష్ట్రంలో పేదరికం రేటు 11.77 శాతం నుంచి 6.06 శాతానికి తగ్గింది. గ్రామాల్లో పేదరికం తగ్గింపు రేటు సగానికి పైగా దిగింది. పోషకాహారం, శిశు, కౌమార దశ మరణాలు; ప్రసూతి ఆరోగ్యం, పాఠశాల విద్య, హాజరు, వంట ఇంధనం, పారిశుద్ధ్యం, తాగు నీరు, విద్యుత్, గృహాలు, ఆస్తులు, బ్యాంకు ఖాతాల గణాంకాలను వినియోగించి నీతి ఆయోగ్ తాను ఈ నివేదికను రూపొందించినట్లు పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంతవరకు ఏ ముఖ్యమంత్రీ అనుసరించని పాలనా పద్ధతుల్ని జగన్ ప్రవేశపెట్టారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి సంక్షేమాన్ని పొందవచ్చో తెలియజేసే వాలంటీరు వ్యవస్థ పేద ప్రజల వెంట నడుస్తోంది. అర్హులయిన లబ్దిదారులంతా నవరత్నాలతో పాటు ఎప్పటికప్పుడు అమల్లోకి వస్తున్న మిగతా ప్రభుత్వ పథకాల్ని సద్వినియోగం చేసుకుంటున్నారు.
గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ప్రజలకు ప్రభుత్వాన్ని మరింతగా చేరువ చేసింది. దీంతో ప్రజాపాలనలో రెట్టింపు వేగం పెరిగింది. మానవ వనరుల సంపదకు పునాదివేయడానికి వ్యవసాయం, విద్య, ఆరోగ్య సంరక్షణ మూలస్తంభాలని ముఖ్యమంత్రి బలంగా విశ్వసిస్తున్నారు. భారతదేశంలో అతిపెద్ద వ్యవసాయ ఆధారిత రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమైనది.
రాష్ట్రంలో 67 శాతానికి పైగా ప్రజలు ఈ రంగంలో నిమగ్నమై జీవిస్తున్నారు. కాబట్టి వ్యవసాయరంగాన్ని బలోపేతం చేయడానికి సుస్థిర విధానాలను ప్రభుత్వం అమలు చేస్తోంది. రాష్ట్రంలో 70 శాతం మంది సన్నకారు రైతులకు ‘రైతు భరోసా’తో రబీ, ఖరీఫ్ పంటల్లో బాసటగా నిలుస్తుంది. పంటలు విఫలమయితే తదుపరి పంటపనులకు ముందుగానే రైతులకు బీమా అందిస్తోంది.
పాడి, మత్స్య పరిశ్రమలకు తగిన సహకారం లభించింది. రాష్ట్ర అభివృద్ధిలో ఈ పరిశ్రమల వాటా పెరిగింది. ప్రభుత్వం స్వయం ఉపాధి, సాంప్రదాయ వృత్తుల నేత కార్మికులు, టైలర్లు, డ్రైవర్లు తదితర చేతివృత్తిదారులకు ఆర్థికంగా అండగా నిలుస్తుంది. మహిళల నేతృత్వంలోని స్వయం సహాయక బృందాలకు సకాలంలో రుణ సహాయాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. ‘ఆంధ్రప్రదేశ్‌ను దేశంలో అగ్రగామి రాష్ట్రంగా నిలపాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆశయం.
‘‘అందుకు నేను నా వంతు కృషి చేస్తున్నాను. నిజానికి నేను చేయలేనిది చేసిన వాగ్దానాన్ని ఉల్లంఘించడం. మీరు నా ప్రభుత్వం నుండి లబ్ది పొందితేనే నాకు ఓటు వేయండి అనే నినాదంతో రేపటి ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్తాను. నాకు ప్రజలు అద్భుత ఫలితాలు అందిస్తారని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను’’ అంటున్నారు ఆయన. పేద ప్రజలను ప్రగతిపథంలో నడిపిస్తున్న ఆయన అభివృద్ధి, సంక్షేమ పాలన మీద ఆయనకున్న నమ్మకం ఇది.
– జి. యోగేశ్వరరావు, సీనియర్ జర్నలిస్ట్, 95028 12920.
Comments
Please login to add a commentAdd a comment